సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహిళ.. ఆమె ఓ శక్తి. ఆదిపరాశక్తి. ఆమె కన్నెర్ర చేసిందంటే సమాజానికే వణుకు. కానీ ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో, కుటుంబ పాలనలో ఆమె చూపించే ఓపిక వర్ణించలేనిది. పితృస్వామ్య సమాజంలో అనేక అవమానాలు, అణచివేతలకు గురవుతున్నా.. సంప్రదాయాలు, విలువలు విస్మరించకుండా నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యమవుతోంది మహిళాలోకం.
కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ అభివృద్ధిలో, పిల్లల ఆలనాపాలనలో మమేకమై సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమైన జిల్లా మహిళా లోకం రానున్న ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. అందుకే మహిళలు ఎటు మొగ్గు చూపితే జిల్లాలో వారే విజయం సాధించడం ఖాయం. నేతల రాతను మార్చి.. వారి భవిష్యత్తును నిర్దేశించే శక్తి జిల్లా మహిళా లోకానికి ఉంది.
వైఎస్సార్ హయాంలో ఎంతో అభివృద్ధి
జిల్లాలో మహిళల పరిస్థితి పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో అడపాదడపా దీపం పథకం కింద గ్యాస్‌కనెక్షన్లు ఇవ్వడం తప్ప పెద్దగా ఒరిగిందేమీలేదనే చెప్పాలి. స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేశారే కానీ వారు పొదుపు చేసుకున్న మొత్తాన్నే తిరిగి వారికి రుణం
కింద ఇచ్చేవారు. మహిళల రుణాలకు సంబంధించి బాబు హయాంలో ఏ ఒక్క ఏడాదిలో రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. వైఎస్సార్ పాలన విషయానికి వస్తే స్వయం ఉపాధి కోసం డ్వాక్రారుణాలు, వృద్ధులు, వితంతు మహిళలకు పింఛన్లు, గ్యాస్‌సబ్సిడీ, పెద్ద చదువుల కలను సాకారం చేసేందుకు విద్యార్థినులకు ఉన్నత చదువులు, ఆర్థిక అభివృద్ధి ఉపకరించే ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, వృద్ధాప్యంలో అసరాగా నిలిచే అభయ హస్తం లాంటి పథకాలు ఎన్నో అమలు చేశారు.
బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) ద్వారా ఒక ఆడబిడ్డ జన్మిస్తే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలయితే రూ.30 వేల చొప్పున బీమా చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కింది. ఇక, వైఎస్ చనిపోయిన తర్వాత ఈ పథకం కింద జిల్లాకు నిధులే మంజూరు కాలేదు. కొత్త లబ్ధిదారుల మాట అటుంచితే... పాత లబ్ధిదారుల బీమా ప్రీమియం చెల్లింపునకు కూడా కిరణ్ సర్కారు నిధులివ్వలేదు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని చెప్పిన వెఎస్ జిల్లా మహిళల కోసం రూ వేలకోట్లు ఖర్చు చేశారు. తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత దాదాపు రూ.1000 కోట్ల రూపాయలు కేవలం మహిళలకు పావలా వడ్డీ రుణాల కిందే అందజేశారు. 2004లో తాను అధికారంలోనికి వచ్చిన ఏడాది జిల్లాకు డ్వాక్రారుణాల బడ్జెట్ 39 కోట్లుంటే దానిని రూ.290 కోట్లకు పెంచారు. వైఎస్ అధికారంలోనికి వచ్చేనాటికి జిల్లాలో ఉన్న స్వయంసహాయక సంఘాల సంఖ్య 12వేలుంటే ఆ సంఘాల సంఖ్యను 32వేలకు పెంచారు.
ఇక జిల్లాలోని మహిళలు చైతన్యశీలురనే అభిప్రాయం ఉంది. పోరాటాల పురిటిగ డ్డగా పేరుగాంచిన మెతుకుసీమ జిల్లా వ్యాప్తంగా మహిళలు తమదైన రీతిలో రాణిస్తున్నారు. వంటింటికే పరిమితం కాకుండా కుటుంబ ఆర్థిక, సామాజిక హోదాను పెంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రానున్న ఎన్నికలలో వీరు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. ఉద్యోగసంఘాలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలియజేస్తూ తెలంగాణ కోసం కృషి చేశారు.
ఇప్పుడు వీరి దృష్టంతా ‘నవ తెలంగాణ’పైనే ఉంది. ముఖ్యంగా మహిళల స్థితిగతులను సమూలంగా మార్చి వేసే నాయకత్వానికి పట్టం కట్టే ఆలోచనలో జిల్లా మహిళలు ఉన్నారు. ఓ అన్నగా, ఓ తండ్రిగా, ఓ తమ్ముడిగా అక్కున చేర్చుకుని ఆదరించే పాలకులను ఎన్నుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న మహిళా లోకం ఎన్నికల్లో ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాల్సిందే. మారాణులూ... మీదే నిర్ణయం... మీదే భవిష్యత్తు.
మహిళలే నిర్ణేతలు
Published Sat, Mar 22 2014 12:07 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
Advertisement
Advertisement