సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం.. కొబ్బరి చిప్పల సమన్యాయంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం స్థానికంగా ఏ పార్టీ కలిసి వస్తే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుని మున్సిపాలిటీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అవసరమైతే వార్డుల వారీగా కలిసి వచ్చే పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోర్ కమిటీ స్పష్టం చేసింది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు మున్సిపాల్టీలకు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగుతున్నాయి.
వీటిలో ఒక్క మెదక్ మున్సిపాలిటీ మినహా మిగిలిన చోట్ల టీడీపీకి పెద్దగా బలం లేదు. దీంతో ఆ పార్టీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవాలని అగ్ర నాయకత్వం చెప్పడంతో జిల్లా నేతలు పొత్తుల కోసం అన్ని పార్టీల వైపు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలో నలుగురు సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఇటీవల చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును సమన్వయకర్తగా నియమించారు. ఈ కోర్ కమిటీ ఇటీవల పటాన్‌చెరులో తెలగుదేశం పార్టీకి చెందిన జిల్లా ముఖ్యనాయకులతో సమావేశమైంది.
మున్సిపల్ ఎన్నిక ల్లో స్థానికంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతో, ఎజెండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పొత్తులు పెట్టుకోవాలని, దీంతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉండి టికెట్లు రాక.. అలకవహించిన వారిని పిలిచి టికెట్లు ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. దీంతో తెలగు తమ్ముళ్లు టికెట్ల ఖరారు లిస్టులో ఖాళీలు పెట్టి పక్క పార్టీల నుంచి వచ్చే నేతల కోసం ఎదురు చూస్తున్నారు.
ఎన్నికలు నెత్తి మీదకొచ్చినా... టీడీపీలో ఇంకా నియోజకవర్గం ఇన్‌చార్జులనే పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పటికీ ఐదు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులే లేరు. కోర్ కమిటీ లీడర్‌గా ఉన్న మైనంపల్లి జిల్లా బయటనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆయన ఈసారి రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో, పూర్తి సమయం మల్కాజ్‌గిరికే కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికా సమావేశాలు పెట్టడానికి తప్పితే జిల్లా మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఇన్‌చార్జులు లేకపోవడంతో కార్యకర్తలను, ఇతర గ్రామ, పట్టణ స్థాయి నాయకులను ప్రోత్సహించేవారు లేరు. దీంతో ఏళ్లకేళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు గత్యంతరం లేని పరిస్థితులో ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఎన్నికలు రావడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. కొంతలో కొంతైనా పరువు నిలుపుకునేందుకు స్థానిక అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు పోవాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
రండి బాబో.. రండి
Published Thu, Mar 13 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement
Advertisement