సాక్షి, తిరుపతి: 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి స్థానిక సంస్థలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వరకు వరుస ఓటములతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో టెన్షన్ వెంటాడుతోంది. కుప్పం ఎన్నికల్లో ఇప్పుడు ఓటమి పాలైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మరోసారి పరాభవం ఖాయమని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కుప్పంపై ఆయన ‘ప్రత్యేక’ దృష్టిపెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
చదవండి: Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు
కుట్రలు, కుతంత్రాలకు పన్నాగం
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. వాటిని పక్కాగా అమలుచేసేందుకు ఆయన, లోకేశ్.. టీడీపీ నేతలు, ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏం చేయాలో ఏ రోజుకా రోజు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఎంతైనా ఖర్చు చేయండి
నిజానికి.. కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఎన్నికలను అధిగమించేందుకు భారీగా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేసేందుకు వెనుకాడొద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బు ఎంతైనా ఖర్చుచేయాలని.. అవసరమైన మొత్తం తాను పంపుతానని ఇన్‌చార్జ్‌లకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఖర్చు బాధ్యతలను చంద్రబాబు తన పీఎస్ దొరస్వామినాయుడుకు అప్పగించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోజువారీ ప్రచారం నిమిత్తం ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు, మద్యం, బిర్యాని పంపిణీ కూడా చేయమని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఏపీలో మద్యం కొనుగోలు చేయవద్దని, పక్కనే ఉన్న కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా తెప్పించుకోమని సూచించినట్లు సమాచారం. మద్యం కోసమే ప్రత్యేకంగా ఓ టీంని నియమించారు. ఇక ఓటర్లకు ఎంత ఇవ్వాలో తాను తరువాత చెబుతానని బాబు చెప్పినట్లు తెలిసింది.
దాడి చేయండి.. ఎదురు కేసులు పెట్టండి
ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వైఎస్సార్‌సీపీ శ్రేణులే టార్గెట్‌గా దాడులు చేయమని కూడా చంద్రబాబు సూచనలు చేసినట్లు కుప్పం టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కొట్టి.. వారిపైనే తిరిగి కేసు పెట్టాలని ఇన్‌చార్జ్‌లకు సూచనలు అందాయి. ఇందులో భాగంగానే శుక్రవారం వీ కోట టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ రంగనాథ్ తన అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తప్ప మిగిలిన వారికి ఇక్కడ ఏం పని అని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గణపతి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రంగనాథ్ అనుచరులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అదే విధంగా ఎన్‌ఎఫ్‌సీ కళాశాల వద్ద కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మునస్వామి, బంధువు వెంకటేష్‌పై స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు దాడిచేశారు. దాడిచేసిన వారే బాధితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాబు ఆదేశాలకు అద్దంపడుతున్నాయి.
కుప్పానికి పరిటాల, జేసీ వర్గీయులు
కుప్పంలో అలజడులు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల, జేసీ వర్గీయులను దింపనున్నారు. అల్లర్లలో ఆరితేరిన వారిని కుప్పం ఎన్నికలకు వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. వారంతా ఒకట్రెండు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్నారు. వీరి కోసం కుప్పం శివారుల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకుని టీడీపీ ప్రచారాల్లో రచ్చచేయాలని.. వీలైతే దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనల ద్వారా తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు కూడా చంద్రబాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిసింది. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడం ఈ బృందం బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment