చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల సమన్యాయం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిండా ముంచిందనే చెప్పాలి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల సమన్యాయం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిండా ముంచిందనే చెప్పాలి. బలమైన తెలంగాణ సెంటిమెంటు నేపథ్యంలో జిల్లాలో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. కొద్దో గొప్పో కార్యకర్తలు కష్టనష్టాలకు తట్టుకొని నిలబడినప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ సెంటిమెంటును గౌరవించే పార్టీల్లో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జిలను వెతుక్కునే పనిలోనే ఉంది.
ఐదు నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్‌చార్జిలనే నియమించలేదు. పార్టీకి చెప్పుకోవడానికి జిల్లాలో ఒకే ఒక అసెంబ్లీ సీటుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే జిల్లాను వదిలేసి సేఫ్ జోన్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి దాదాపు ఆయన మానసికంగా సిద్ధమైనట్టు సమాచారం. చంద్రబాబునాయుడుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని బట్టి ఆయనకు టికెట్ ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన పునాదులు లేవు. ఈ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలే దిక్కు లేరు. సిద్దిపేటలో హరీష్‌రావు, సంగారెడ్డిలో జగ్గారెడ్డి, పటాన్‌చెరులో నందీశ్వర్‌గౌడ్ బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు కూడా లేరు. సిద్దిపేటలో హరీష్‌రావును రాజకీయంగా ఢీకొట్టగల తెలుగుదేశం అభ్యర్థులు లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి నాయకుడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతంతగానే ఉంది.
పలు గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నా మండల కమిటీ నాయకత్వం వారిని ముందుకు నడిపే స్థితిలో లేదు. ఈ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో చాలా గ్రామాల్లో పార్టీకి కార్యకర్తలే లేరు. గతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీలలో చేరారు. పటాన్‌చెరులో కొంతమేరకు నందమూరి కుటుంబానికి అభిమానులున్నా, చంద్రబాబునాయుడు వైఖరిపై నందమూరి హరికృష్ట తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అక్కడి కార్యకర్తల్లో స్తబ్దత ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పార్టీ ఉనికి అంతంతమాత్రంగానే ఉంది. సంగారెడ్డిలో ఐదు మంది సభ్యుల కమిటీ ఉన్నా ఒక్క నేత కూడా ముందుకొచ్చి జగ్గారెడ్డిని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నమే చేయడం లేదు. ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ స్వల్పంగా క్యాడర్ ఉన్నప్పటికీ వాళ్లు కూడా మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్‌చార్జి బాబుమోహన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
బహుసభ్య కమిటీలతో మొదటికే మోసం...
ఇన్ని సమస్యల నేపధ్యంలో పార్టీని పటిష్ట పరిచి, గ్రామస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు కొన్ని నియోజకవర్గాల్లో బహుసభ్య కమిటీని వేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో వీలును బట్టి ముగ్గురు నుంచి ఐదు మందితో కూడిన సమన్వయ కమిటీలు వేశారు.ఈ కమిటీలతో పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చాయి. ఇంత మందిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చేసి పార్టీని నడిపించడం వృథాప్రయాస అనే ధోరణిలో నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం.
ఎవరినో ఒక్కరినే ఇన్‌చార్జిగా వేయాలని ఈ కమిటీ సభ్యులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎవరికి ఇన్‌చార్జి పదవి అప్పగిస్తే మిగిలిన వారి నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయేనని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రేపు, మాపు అంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు.