సాక్షి కథనంపై స్పందించిన కమిషనర్ టి.చిరంజీవులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నర్సరీల్లో పెంచుతున్న మొక్కల లెక్కలపై ఆరా మొదలైంది. ‘కోటి మొక్కలు...కొంటె లెక్కలు’ అని సాక్షిలో ప్రచురితమైన కథనంపై కమిషనర్ టి.చిరంజీవులు స్పందించారు.
హెచ్‌ఎండీఏకు చెందిన 22 నర్సరీల్లో ఉన్న మొక్కల లెక్కల కోసం ఔట్‌సోర్సింగ్‌కు చెందిన 20 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను రంగంలోకి దింపారు. ఆదివారం వరకు ఆయా నర్సరీల్లో ఉన్న మొక్కల లెక్కలను తేల్చి సోమవారంనాటికి సమగ్ర నివేదికను ఇవ్వాలని కమిషనర్ ఆదేశించగా.. ఇప్పటికే లెక్కల పనులు మొదలెట్టారు. గతేడాది మిగిలిన వాటితో పాటు ఈ ఏడాది పెంచుతున్న ఒక కోటి 80 లక్షల మొక్కల్లో ఎన్ని ఉన్నాయనేది సోమవారం తేలిపోనుంది.
అధికారుల్లో గుబులు!
నర్సరీల్లో మొక్కలు లెక్కించేందుకు దింపిన ప్రత్యేక బృందాలతో హెచ్‌ఎండీఏకు చెందిన అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్ అధికారుల్లో గుబులు మొదలైంది. ఇది ఎటుతిరిగి ఎటువైపు పోతుందోనన్న కలవరం పుట్టిస్తోంది. అయితే, అంతా లెక్కల ప్రకారమే మొక్కలు ఉన్నాయని అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నా ఏం జరుగుతుందనే ఆందోళన ఆ విభాగంలో వ్యక్తమవుతోంది.