ఉప్పల్ భగాయత్ రైతులతో సమావేశమైన అధికారులు, ప్రజాప్రతినిధులు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ భగాయత్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ వేగవంతమైంది. భూములు కోల్పోయిన రైతులతో హెచ్‌ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు.
కమిషనర్ చేసిన ప్రతిపాదనలపై రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్లాట్ల కేటాయింపుపై సీఎం కేసీఆర్ ఈనెల 4వ తేదీన స్పందించిన విషయం తెలిసిందే. ఎకరా పట్టా భూమికి అభివృద్ధి చేసిన లే అవుట్ వెయ్యి గజాలు, యూఎల్‌సీ భూమికి 600 గజాలు కేటాయించి.. రైతులకు అందజేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రతిజాప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది.
లాటరీ పద్ధతిన కేటాయింపు..
లాటరీ పద్ధతిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయిస్తామని కమిషనర్ టి. చిరంజీవులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుందన్నారు. రైతుల నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. ఈ భారాన్ని హెచ్‌ఎండీఏ భరిస్తుందన్నారు.
ఈ నిర్ణయంపై మెజారిటీ రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. వారం పది రోజుల తర్వాత లాటరీ ప్రక్రియ చేపట్టాలని, ఆ తర్వాత తాము అఫిడవిట్‌లు అందజేస్తామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు సమ్మతించారు. లే అవుట్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్ తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. అంతేగాక సదరు లే అవుట్‌ని.. మల్టీ పర్పస్ జోన్‌గా గుర్తిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
10న వివరాల వెల్లడి...
ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ సేకరించిన 733.08 ఎకరాల్లో.. 413.13 ఎకరాల్లో లే అవుట్‌ని హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. గుంటల నుంచి ఎకరాల వరకు చాలా మంది రైతులు భూమిని కోల్పోయారు. అయితే నష్టపోయిన ఒక్కో ఎకరం పట్టా భూమికి వెయ్యి గజాలు ఇవ్వాల్సి ఉంది. ఏ రైతు ఎంత భూమి నష్టపోయాడు.. ఎంత విస్తీర్ణంలో పాట్లు కేటాయించాల్సి ఉందో.. తదితర వివరాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు జాబితాను రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు.
అలాగే కొంతమంది రైతులు కోల్పోయిన భూమి గుంటలలో ఉంది. వీరికి ప్లాట్ల కేటాయింపులో 30 – 40 గజాలు మాత్రమే రైతులకు చెందాల్సి ఉంది. వాస్తవంగా నిబంధనల ప్రకారం.. ఇంత తక్కువ విస్తీర్ణంలో లేవుట్‌లో చోటు ఉండదు. ఈ నేపథ్యంలో పది రైతులు కలిస్తే.. 300 గజాలుగా సమకూరుతుంది.
ఈ మొత్తాన్ని బహిరంగా మార్కెట్‌కు ధరకు విక్రయించడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని అధికారులు సలహా ఇచ్చారు. ఇలా అన్ని స్థాయిల్లో పనులు పూర్తయితే.. దీపావళిలోగా రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ మెంబర్ ఎస్టేట్ రాజేషం, సెక్రటీరీ కె. మధుకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.