
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై కేంద్రం సీరియస్
రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థకు తదుపరి ఖర్చుపై 10 శాతం పెనాల్టీ
2026 అక్టోబర్ 31 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం
అంచనా వ్యయం రూ.60 కోట్లు పెంపు
పాత నిర్మాణ సంస్థే కొనసాగింపు
పనులు, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ.. స్వతంత్ర సంస్థకు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నరేళ్ల జాప్యంతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపుతున్న ఉప్పల్–మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం మొదలైన పనులు ఇంకా సగం కూడా పూర్తి కాకపోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ కారణమని తేల్చి.. రెండింటికి పెనాల్టీ విధించింది. పనుల్లో జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరగనుండటంతో దాదాపు రూ.60 కోట్ల మేర అంచనాను పెంచింది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ కారిడార్‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చింది.
ఇదీ నేపథ్యం..: హైదరాబాద్–భూపాలపట్నం 163 జాతీయ రహదారి మీద హైదరాబాద్–వరంగల్ మధ్య వాహనాల రద్దీ బాగా పెరిగి ఉప్పల్ సమీపంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. దీంతో దిగువన 150 మీటర్ల సర్వీసు రోడ్డు నిర్మిస్తూ, ఘట్కేసర్ వైపు వెళ్లే వాహనాలకు నిరాటంక ప్రయాణానికి వీలు కల్పించేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2017లో ప్రతిపాదించారు. ఉప్పల్ కూడలి నుంచి మేడిపల్లి వరకు 6.2 కి.మీ నిడివితో 45 మీటర్ల వెడల్పు ఉండే ఆరు వరుసల ఫ్లైఓవర్‌కు డిజైన్ చేశారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 11.5 కి.మీ. నిడివితో నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత, ఇదే పెద్ద ఫ్లైఓవర్ కానుండటం గమనార్హం. 2018 జూలైలో ప్రారంభమైన పనులను 2020 జూలై నాటికి పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. రూ.670 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. కానీ, నిర్మాణ సంస్థ అసాధారణ రీతిలో వ్యవహరించిన తీరు మొదటికే మోసం తెచ్చింది.
ఓ రష్యన్ కంపెనీతో కలిసి నిర్మాణ సంస్థ ఏకంగా 25 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. అంత తక్కువ మొత్తంలో ఈ వంతెనను పూర్తి చేయటం కష్టమని దానికి తర్వాత తెలిసొచ్చింది. అదే సమయంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 43 శాతం మాత్రమే పనులు చేసి ఆపేసింది. అసంపూర్తి పనులతో ఆ మార్గంలో వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడేళ్లుగా వాహనదారులు ఆ ప్రాంతాన్ని దాటేందుకు నానా అవస్థలకు గురవుతున్నారు.
నిర్మాణం పాత సంస్థదే.. పర్యవేక్షణకు స్వతంత్ర సంస్థ
టెండర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్త టెండర్ పిలిచి మరో నిర్మాణ సంస్థకు బాధ్యత అప్పగించాలని తొలుత అధికారులు భావించారు. కానీ, దీనివల్ల మరింత జాప్యంతోపాటు ఖర్చు కూడా పెరుగుతుందని గుర్తించి, పాత నిర్మాణ సంస్థకే బాధ్యత అప్పగించారు. పని పూర్తి చేసేందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది.
కంపెనీ ఆర్థిక నష్టాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యవహారం నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను నియమించాలని నిర్ణయించారు. ఆర్థిక వ్యవహారాలు సహా మొత్తం ఆ సంస్థే పర్యవేక్షించనుంది. మరో సంస్థతో అవగాహన కుదుర్చుకుని నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది.
20 నెలల్లో పూర్తి: ప్రాజెక్టు పనులను 20 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. 2026 అక్టోబర్ 31 నాటికి వంతెనను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించింది.
తాజా నిర్ణయాలు ఇవీ
రూ.28 కోట్ల పెనాల్టీ: పనుల్లో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థల తీరు కారణమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ తేల్చింది. సకాలంలో భూసేకరణ పూర్తి చేయలేకపోవటం, నిర్మాణానికి వీలుగా స్తంభాలు, ఇతర కట్టడాలను తొలగించకపోవటంతో పనుల్లో జాప్యం జరిగింది. పనులు మొదలయ్యాక నిర్మాణ సంస్థ మధ్యలో ఆపేసి ఆ జాప్యాన్ని కొనసాగించింది. దీంతో.. ఆ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసేందుకు భవిష్యత్తులో ఖర్చుచేసే మొత్తంపై 10 శాతాన్ని పెనాల్టీగా విధించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ చెరిసగం భరించాలని పేర్కొంది.
అంచనా రూ.60 కోట్లు పెంపు: ఈ ప్రాజెక్టు ఒప్పంద అంచనా రూ.425.10 కోట్లు. ఇందులో ఇంకా 225.56 కోట్ల పని చేయాల్సి ఉందని లెక్క తేలింది. కానీ, ఆ మొత్తంతో పని పూర్తి కాదు. మరో రూ.60 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. అంటే రూ.286 కోట్లు ఖర్చవుతుందన్నమాట. నిర్మాణ సంస్థ పెనాల్టీగా రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లించే క్రమంలో రూ.14 కోట్ల పెనాల్టీని మినహాయించుకోవాలని అధికారులను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment