మరుగుదొడ్లకు స్థలాలు లేవా?
అధికారులపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆగ్రహం
మహబూబ్‌నగర్ టౌన్ : ‘జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయకుండా నాకు కథలు చెబుతారా..?’ అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.చిరంజీవులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో మరుగుదొడ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని నెలరోజులుగా తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్విహస్తున్నా అధికారులు పనితీరులో ఏమాత్రం మార్పులేదన్నారు.
జిల్లా వ్యాప్తంగా 1,187పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉండగా కనీసం పదిశాతమైనా పూర్తికాకపోవడంపై మండిపడ్డారు. అలాగే 174 పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించేందుకు స్థలాల్లేవని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మరో 2,370 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ముందుకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా అందరూ సమన్వయంతో పనిచేసి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
వీటితోపాటు పాఠశాలలకు ప్రహరీలు, తాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్నీ పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. దీంతో నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్తగా చేపట్టే మరుగుదొడ్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీకే శ్రీదేవి బదులిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రాజేష్ పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.120కోట్లు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ.120కోట్లు మంజూరుచేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.చిరంజీవులు వెల్లడించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని సమర్థవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 50శాతం నిధులను అన్ని జిల్లాల ఖాతాల్లో జమచేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించామని చెప్పారు. ఈనెలాఖరు నాటికి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసి నివేదికలు పంపించాలని ఆదేశించామన్నారు. ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో మరుగుదొడ్ల పనులు ఆలస్యమవుతున్నాయని, సమీక్షించేందుకే జిల్లాకు వచ్చానని వివరించారు. వీటి లక్ష్యాన్ని పూర్తిచేసేంత వరకు తాను నిద్రపోనని అన్నారు.
కథలు చెప్పొద్దు.. లక్ష్యం పూర్తి చేయండి
Published Sun, Jun 14 2015 3:46 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement