సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. 40 శాతానికి పైగా రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తోందని, ఐదారేళ్లలో రాష్ట్రంలోని మెజారిటీ జనాభా పట్టణాల్లో నివసించే అవకాశముందని చెప్పారు. అత్యధిక శాతం పట్టణ జనాభా గల రాష్ట్రంగా త్వరలో తెలంగాణ మారుతుందన్నారు. పెరుగుతున్న పట్టణీకరణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం రానున్న 30 ఏళ్లలో ఏర్పడనున్న అవసరాలను తెలుసుకుని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రారంభించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా అదనపు కమిషనర్లకు ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఆదాయ పెరుగుదలకు వినూత్న పద్ధతులు..
హైదరాబాద్ చుట్టుపక్కల పురపాలికల్లో, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పట్టణీకరణ వేగంగా జరుగుతుందని, అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రతి పురపాలిక తన ఆదాయ వనరుల విషయంలో ప్రత్యేక ఆడిట్ చేపట్టి రానున్న సంవత్సరాల్లో ఆదాయ పెరుగుదలకు సంబంధించిన వినూత్నమైన పద్ధతులను ఎంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తొలుత మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు.
పరిపాలన వికేంద్రీకరణ సాధనంగా..
పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఈ మేరకు పరిపాలన వికేంద్రీకరణ ఒక సాధనంగా ఎంచుకుందని కేటీఆర్ చెప్పారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచి ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment