సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పట్లో కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం వంటి నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి.’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా ఇప్పట్లో వదిలిపెట్టదని, అందుకే దీని కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖతో కలిసి పురపాలక శాఖ విడుదల చేస్తోందన్నారు.
వైరస్ కట్టడికి మున్సిపల్ కమిషనర్లు తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయనున్నారని, ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి, బేసి సంఖ్యల విధానంలోనే దుకాణాలు తెరిచేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇప్పట్నుంచే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు
వచ్చే వర్షాకాలంలో డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని, గతంలో చేపట్టిన తరహాలోనే యాంటీ లార్వా కార్యక్రమాలను ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆరోగ్య శాఖతో కలసి పురపాలక శాఖ తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ప్రతి పట్టణంలోని మురికి కాలువలను శుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు.
పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలైన మాస్కులు, గ్లౌజులు లేకుండా పని చేయరాదన్నారు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా కార్య క్షేత్రంలో కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్‌లదే అవుతుందని హెచ్చ రించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటి కొరత పెద్దగా లేదని మున్సిపల్ కమిషనర్లు మంత్రికి తెలియ జేశారు. ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రూ.830 కోట్లను విడుదల చేశామని, ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాలపైన ఒక నివేదికను రూపొందించి వెంటనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించాలని కేటీఆర్ ఆదేశించారు.
నేటి నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం
‘ప్రతి ఆదివారం 10 గంటలకు–10 నిమిషాలు’పేరిట సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమానికి పురపాలక శాఖ నేటి నుంచి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అంద రూ కూడా తమ తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని, నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment