సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్), శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం నూరా హెల్త్ సంస్థ, యూనిసెఫ్‌ల సహకారంతో వైద్య శాఖ కేర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఈ కార్యక్రమంపై ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి విజయవాడలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రతి లక్ష ప్రసవాలకు దేశంలో ఎంఎంఆర్ 97గా ఉంటే ఏపీలో 45గా ఉందని, ఐఎంఆర్ దేశంలో 28గా ఉంటే రాష్ట్రంలో 24కు తగ్గిందని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్‌ను సింగిల్ డిజిట్‌కు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈ కేర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మాతా శిశు సంరక్షణ, రక్తహీనత సమస్య నివారణ.. ఇలా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో దేశంలోనే ఒకటి, రెండోస్థానాల్లో రాష్ట్రం ఉండాలన్న సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, నూరా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సీమామూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్.ఎస్.అనిల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలు ఆగవు
రాష్ట్రంలో మే ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపేస్తున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కృష్ణబాబు కోరారు. ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రా«దాన్యం ఇస్తున్న సీఎం జగన్ బిల్లుల చెల్లింపు విషయంలోను తీవ్రజాప్యం లేకుండా చూస్తున్నారని చెప్పారు. ఇటీవల బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, పెండింగ్ బిల్లుల్లో కొంత భాగాన్ని త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు.
రూ.రెండువేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నది వాస్తవం కాదని, రూ.800 కోట్ల మేర మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తుంటే.. ప్రస్తుతం రూ.మూడువేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీన్నిబట్టి ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment