dds
-
‘కలుపు’కొని తినాలి..
వర్షాకాలంలో పంట పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకొనేందుకు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వచ్చిన కొందరు సందర్శకులకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్‌తండా, ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామాల్లో సహజ ఆకుకూరల ప్రాధాన్యం గురించి వివరించారు. అవి ఏ మేరకు ఆరోగ్యాన్ని అందిస్తాయో సభ్యులు చెప్పారు. వర్షాకాల పంటల్లో పలు రకాల కలుపు మొక్కలు వస్తాయని.. వాటిని రైతులు తొలగిస్తుంటారని.. కానీ వాటిలోనూ ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు కలిగి ఉన్నాయని సందర్శకులకు మహిళా రైతులు చిందిబాయి, రాజీబాయి తెలియజేశారు. కలుపు మొక్కల్లో వందకుపైగా రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకోవచ్చని చెప్పారు. – జహీరాబాద్ ప్రదర్శన ద్వారా అవగాహన పొలాల్లో సహజంగా పండే ఆకుకూరల గురించి సందర్శకులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు డీడీఎస్ సభ్యులు వారిని పొలాల్లో తిప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఏయే ఆకుకూరలో ఎలాంటి పోషకాలు ఉంటాయనే అంశాన్ని వివరించారు. చక్కెర వ్యాధి నివారణకు ఉపయోగపడే ఆకుకూరలతోపాటు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఎలాంటి ఆకుకూరలు తినాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణిరావు, రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు అనితకుమారి, సంస్థ సభ్యులు మంజుల, పెద్ద నర్సమ్మ, చిన్న నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, మాణిక్యం, రోజా, మయూరి పాల్గొన్నారు. నోరూరించిన వంటకాలు పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరలతో వంట లు వండారు. ఆయా వంటకాలను సందర్శకులకు వడ్డించారు. మార్కెట్లో లభించే ఆకుకూరల కంటే ఇవి రుచిగా ఉన్నాయని పలువురు అన్నారు. కలుపు మొక్కలుగాభావిస్తున్న వాటిలో కొన్ని... అత్తిలి, పిట్టకూర, సన్న పాయలు, బంకంటికూర, చెన్నంగి, ఎన్నాద్రి, ఉత్తరేణి, గునుగు, బుడ్డకాశ, గోరిమడి, తెల్లగజ్జర, తకడదొబ్బుడు, జొన్న చెంచలి, పుల్లకూర, తగరంచ, ఎలుకచెవుల కూర, అంగిబింగి, పప్పుకూర, అడవి మెంతెంకూర, తుమ్మికూర, గురిమాసి, అడవి పొన్నగంటి అలం, నల్లకాశ, దూసరి, తలాయిలా, రేలపప్పు, తెల్లవార్జంపువ్వు, గురిమాసిగడ్డ, చిత్రమాలం, పొనగంటి, పల్లెరుకాయ, పొలపత్రం, బంకటి ఇలా అనేక రకాల ఆకు కూరలు సహజంగా లభిస్తాయి. ఆకుకూరల్లో పోషక విలువలు... ఆకుకూరలు ఆరోగ్య సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు అన్ని ఆకుకూరల్లో క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్–సి, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. సహజ ఆరోగ్యం పొందవచ్చు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజంగా ఆకు కూరలు లభ్యమవుతాయి. ఇవి సేంద్రియ విధానంలో వస్తున్నందున మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. – నర్సింహారావు, రిటైర్డ్ ఉద్యోగి, హైదరాబాద్ ఎన్నో ఆకుకూరల గురించి తెలుసుకున్నాం ఆకుకూరల్లో ఇన్ని రకాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు. కలుపు మొక్కలుగా భావిస్తున్న ఆకుకూరల్లో అనేక పోషకాలు నిండి ఉన్నాయనే విషయం ఇప్పుడే తెలిసింది. వీటి గురించి తగిన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. – లిఖిత, బీటెక్ విద్యార్థిని, హైదరాబాద్ ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిసింది సహజంగా వచ్చే ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. వాటి గురించి తెలుసుకునేందుకే వచ్చా. – స్వప్న, గృహిణి, హైదరాబాద్ -
ఊరూరా పాతపంటల జాతర
జహీరాబాద్: పాతపంటలకు కొత్తకళ వస్తోంది. చిరు ప్రాధాన్యం కలిగిన చిరుధాన్యం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో అందరూ పాతపంటలైన చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో 28 రోజులపాటు 23 గ్రామాల మీదుగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో 23వ పాతపంటల జాతర సాగనుంది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాంగార్‌బౌలి తండా నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లో ముగియనుంది. ఎడ్లబండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీశ్ వివరించారు. సమృద్ధి పోషకాలతో కూడిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, అవగాహన కల్పించేందుకు రైతులు, మహిళలతో ఆయా శాఖల అధికారులు, వ్యవసాయ నిపుణులు సమావేశాలు నిర్వహిస్తారు. జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సంఘంలో ఐదువేల మంది మహిళారైతులు సజ్జ, కొర్ర, తైద, సామ, పెసర, మినుము, అవిశ తదితర 30 నుంచి సుమారు 50 రకాల చిరుధాన్యాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరుధాన్యాల ఆవశ్యకత, సేంద్రియ విధానంలో సాగు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని 70 గ్రామాల్లో డీడీఎస్ కొంతకాలంగా అవగాహన కల్పిస్తోంది. ఝరాసంగం మండలం మాచ్నూర్లో 50 నుంచి 60 రకాల విత్తనాలతో చిరుధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతులు పండించిన పంటలో నాణ్యమైనవాటిని విత్తనంగా సేకరించి నిల్వచేసి వానాకాలం, యాసంగిలో సాగు చేస్తున్నారు. పాతపంటల జాతర షెడ్యూల్ ఈ నెల 14వ తేదీన మొగుడంపల్లి మండలం జాంగార్‌బౌలి తండాలో పాత పంటల జాతర ప్రారంభం అవుతుంది. 16న మన్నాపూర్, 17న ఉప్పర్‌పల్లి తండా, 18న జాడీ మల్కాపూర్, 19న లచ్చునాయక్ తండా, 20న జీడిగడ్డ తండా, 21న అర్జున్‌నాయక్ తండా, మోడ్ తండా, 23న జహీరాబాద్, 24న శేఖాపూర్ తండా, జంలైతండా, 25న శేఖాపూర్, 26న కోహీర్ మండలం గొటిగార్‌పల్లి, 27న బిలాల్పూర్, 28న ఝరాసంగం మండలం చిల్కెపల్లి, 30న బిడకన్నె, ఫిబ్రవరి 1న ఝరాసంగం, 2న పొట్పల్లి, 3న న్యాల్కల్ మండలం రేజింతల్, 4న హూసెళ్లి, గుంజోటి, 6న శంశల్లాపూర్, 8న న్యాల్కల్లో జాతర సాగుతుంది. 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లోని డీడీఎస్ పచ్చసాలెలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. -
చిరు ధాన్యం.. ఆరోగ్యభాగ్యం
జహీరాబాద్: అంతరించి పోతున్న చిరు ధాన్యాల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహించడమే లక్ష్యంగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన పాతపంటల జాతర రెండు దశాబ్దాలుగా నిరంతరంగా సాగుతోంది. సోమ వారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్‌నాయక్ తండాలో 20వ పాత పంటల జాతరను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రారంభించారు. జహీరాబాద్ మండలం రంజోల్‌లో 1999లో డీడీఎస్ ఈ జాతరకు శ్రీకారం చుట్టింది. నాటినుంచి ఏటా వివిధ గ్రామాల్లో జాతరను నిర్వహిస్తూ వస్తోంది. ఇలా ఇప్పటికి వంద గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించింది. డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీశ్ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో మహిళలను చిరు ధాన్యాల సాగువైపు ప్రోత్సహిస్తున్నారు. ఎకరం, రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు చిరు ధాన్యాలను సాగు చేస్తూ వస్తున్నారు. ఏడాదిపాటు వారి ఆహార అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వచేసుకుని, మిగతా ‘చిరు’ధాన్యాన్ని డీడీఎస్ సంస్థకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే 20 శాతం ఎక్కువ ధర చెల్లించి ఈ సంస్థ రైతులనుంచి పంటలను కొనుగోలు చేస్తోంది. ధాన్యాన్ని సంస్థ తరఫున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా సైతం అమ్ముతున్నారు. సేంద్రియ వ్యవసాయమే లక్ష్యంగా.. సేంద్రియ వ్యవసాయమే లక్ష్యంగా ఐదువేల మంది మహిళా రైతులు చిరు ధాన్యాలను పండిస్తున్నారు. ఇలా సాగుచేసిన చిరు ధాన్యాల పంటలకు అంతగా తెగుళ్లు సోకవని అంటున్నారు. పెట్టుబడులు అంతగా అవసరం ఉండవని, వర్షాభావాన్ని సైతం తట్టుకుని చిరు ధాన్యాలు పండుతాయని చెబుతున్నారు. చిరు ధాన్యాలను మిశ్రమ పంటలుగా సాగుచేసుకుంటున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 30 రకాల పంటలను కలిపి సాగుచేస్తున్నారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా తమకు అవసరమైన విత్తనాలను నిల్వ చేసి ఉంచుతారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లోని 68 గ్రామాల్లో విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఖరీఫ్‌లో మినుము, పెసర, కంది, సజ్జ, పచ్చజొన్న, రబీ కింద శనగ, తెల్ల కుసుమ, సాయిజొన్న, అవుశ, వాము పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. తైదలు, కొర్రలను కూడా సాగు చేస్తున్నారు. రైతులకు అవగాహన ఈ ఏడాది పాత పంటల జాతర సోమవారం ప్రారంభమైంది. ఉత్సవాలను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ .. చిరు ధాన్యాల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోగ్యాన్నిచ్చే చిరు ధాన్యాలను ప్రతి ఒక్కరూ తినేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇది శుభ పరిణామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 వరకు 24 గ్రామాల్లో జాతరను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు, ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. నిపుణులచేత పంటల సాగు, సేంద్రియ వ్యవసాయంతో కలిగే ఉపయోగాల గురించి వివరిస్తారు. జాతర సందర్భంగా 16 ఎడ్ల బండ్లలో చిరు ధాన్యాలను ప్రదర్శిస్తారు. -
డీడీ కట్టకుంటే రేషన్ డీలర్షిప్ తొలగించండి
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో పాల్గొంటున్న రేషన్ డీలర్లు డిసెంబర్ నెలలో బియ్యం పంపిణీకి డీడీలు కట్టకపోతే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. పేదలకు రేషన్ పంపిణీకి సహకరించని వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా బియ్యం పంపిణీ చేయాలన్నారు. సమ్మె పేరుతో కొంత మంది రేషన్ డీలర్లు డీడీలు కట్టకపోవడంతో డిసెంబర్ నెలలో పేదలకు నిత్యావసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్లో పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్‌లతో ఈ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు 7 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు కట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్నారని, మిగిలిన వారు వేతనాలు పెంచాలని, హెల్త్ కార్డులు అందించాలనే డిమాండ్లతో డీడీలు కట్టలేదని, అక్కడ డిసెంబర్ నెలలో సరుకులు ఇచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా వారు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్... డీడీలు కట్టిన డీలర్లకు సరుకులు య«థావిధిగా సరఫరా చేయాలని, కట్టని డీలర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. డీడీలు కట్టని ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు అందని పరిస్థితి రావద్దని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగించాలని సూచించారు. డీలర్ల సమ్మె పిలుపునకు అర్థం లేదని, అందుకే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. -
నోట్ల మార్పిడిలో రాజకీయ నాయకుల కొత్త ఎత్తులు
ముంబై : బ్లాక్‌మనీపై ఉక్కుపాదం మోపుతూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో, రాజకీయ నాయకులు పాతనోట్ల మార్పిడికి దొడ్డిదారులను ఎంచుకుంటున్నారు. లెక్కకు మించి ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహకార బ్యాంకుల్లో లోపాలను వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. బ్యాంకులు సైతం వారికి సహకరిస్తున్నాయి. పూర్తిగా కంప్యూటీకరణ కానీ సహకార బ్యాంకులు, ఇప్పటికీ ఫిజకల్ లెడ్జర్ బుక్స్ ద్వారానే కార్యకలాపాలు చేస్తున్నాయి.దీన్ని అవకాశంగా మార్చుకున్న కొందరు గడువు అయిపోయిన ఫిక్స్డ్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్ల ద్వారా పాత నోట్లను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా రాజకీయ నాయకులు ఎక్కువగా లబ్దిపొందుతున్నట్టు తెలుస్తోంది. సహకార బ్యాంకుల్లోని ఈ లోపాలే వీరికి అవకాశంగా మారుతున్నట్టు బ్యాంకింగ్ సెక్టార్‌లోని అధికారులంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అన్ని బ్యాంకులు కొత్త నోట్ల జారీలో నిమగ్నమై ఉన్నాయని, కానీ ఈ బ్యాంకులైతే లెక్కలో చూపని నగదు కోసం సహకరిస్తున్నారని కొందరు బ్యాంకర్లు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా వారి దగ్గరున్న పాత నోట్లను ఇతర బ్యాంకుల్లో మార్చుకోవడం కుదరక, సహకార బ్యాంకుల ద్వారా మార్చుకుంటున్నట్టు తెలిపారు. మార్చి 31 తర్వాత కోపరేటివ్ బ్యాంకులు జారీచేసిన డీడీలను, పే ఆర్డర్లను క్యాన్సిల్ చేసి, ఈ హోల్డర్స్‌కు కొత్త నోట్లలో నగదును చెల్లించనున్నట్టు తెలుస్తోంది. -
కొరియర్లో కూరగాయలు!
డీడీఎస్ ఆధ్వర్యంలో వినియోగదారులకు పంపిణీ అందుబాటులో 18రకాల కూరగాయలు, ఆకుకూరలు నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ప్రతి మంగళవారం, శుక్రవారం సరఫరా ప్రయోగాత్మకంగా 200 కుటుంబాలకు అందజేత ఆరునెలల నుంచి విజయవంతంగా సాగుతున్న పథకం నెత్తిన గంపతో వీధుల్లో కేకలు వేస్తూ తిరుగుతూ కూరగాయలు అమ్మేవారిని చూశాం. చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేపట్టే పద్ధతీ చూశాం.. ప్యాకింగ్ చేసి షాపింగ్‌మాల్స్‌లో అమ్మడమూ చూశాం.. కానీ జహీరాబాద్ పట్టణంలో కూరగాయల అమ్మకంలో కొత్త పద్ధతి అమలవుతోంది. ఇంటికి కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నట్టు... కూరగాయలను కూడా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే కొరియర్ సంస్థల్లాగా ఇంటికి తెచ్చి ఇచ్చే విధానం ఇక్కడ సాగుతోంది.అది కూడా సేంద్రియ కూరగాయలు కావడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా పలుకుతోంది. జహీరాబాద్ : సేంద్రియ వ్యవసాయ సాగు విధానంలో పండించడంతో పాటు వాటిని వినియోగదారులకు ‘ఇంటికి సరఫరా’ పథకం విజయవంతంగా సాగుతోంది. జహీరాబాద్ పట్టణంలో ఆరునెలల క్రితం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి డిమాండ్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 150 నుంచి 200 కుటుంబాలకు సరిపడా సేంద్రియ కూరగాయలను సేకరించి సరఫరా చేస్తోంది. ప్రతి మంగళ శుక్రవారాలలో వినియోగదారులకు ఇంటింటికీ మొబైల్ వాహనం ద్వారా సరఫరా చేస్తున్నారు. లోపాలు లేకుండా పర్యవేక్షణ ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు పలువురికి బాధ్యతలు అప్పగించారు. పొలంలో కూరగాయలను సాగుచేసే దగ్గరి నుంచి వినియోగదారులకు చేరేవరకు ఎలాంటి లోపాలు లేకుండా డీడీఎస్ సంస్థ పర్యవేక్షిస్తోంది. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాలు రాకుండా నాణ్యవంతమైన కూరగాయలను సేకరించి అందిస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ, దత్తగిరి కాలనీ, మహీంద్రాకాలనీ, శ్రీనగర్, ఎంఆర్‌హెచ్‌ఎస్ కాలనీల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తోంది. డీడీఎస్‌కు చెందిన వ్యవసాయ పొలంలో 18 రకాల కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. వీరి పొలంలో పండించే కూరగాయలు వినియోగదారులకు సరిపోనందున క్రిష్ణాపూర్, బిడకన్నె, కాశీంపూర్, పస్తాపూర్, కుప్పానగర్, బర్దీపూర్ గ్రామాల్లో ఎంపిక చేసిన 66 మంది రైతుల పొలాల్లో సేంద్రియ విధానంలో కూరగాయలను సాగు చేయిస్తున్నారు. సాగు చేసిన కూరగాయలను రైతుకు మార్కెట్లో లభించే ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు పొలంలో కూరగాయలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాల ఎంపిక దగ్గరి నుంచి సేంద్రియ విధానంలో వేప కషాయం, పంచగవ్య, వర్మీవాష్లను పిచికారీ చేయించి పురుగులు, తెగుళ్లు రాకుండా చూస్తున్నారు. వీటిని సూపర్వైజర్గా ఉన్న కిష్టయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాడు. రైతులు తీసుకువచ్చిన కూరగాయల నాణ్యతను డీడీఎస్ డిప్యూటీ డైరెక్టర్ జయప్ప పరిశీలిస్తాడు. ఒక్కో కుటుంబానికి ఇచ్చే బుట్టలో కిలో టమాటతో పాటు 4 రకాల కూరగాయలు పావు కిలో వంతున, 4 రకాల ఆకు కూరలతో పాటు కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిర్చిని ఇస్తున్నారు. ఒక్కో బుట్టకు రూ.120 నుంచి రూ.140 ధరకు విక్రయిస్తున్నారు. అన్ని కలిపి 9 కిలోల వరకు అందిస్తున్నారు. మార్కెట్లో లభించని ఆకు కూరలైన అవిష కూర, ఓమ కూర, దొగ్గలి, మునగ ఆకు, జొన్న సించలి కూర, గునుగు ఆకు, పప్పు కూర, పాయిలి కూర, పుంటికూరలను కూడా అందిస్తున్నారు. గత ఆరు నెలల కాలంగా డీడీఎస్ వారు అందిస్తున్న కూరగాయలను కొంటున్నా. మంచి నాణ్యంగా ఉంటున్నాయి. వారు ఇంటి వద్దకే తీసుకుని వచ్చి ఇస్తుండడంతో సౌకర్యంగా కూడా ఉంది. బయట లభించని ఆకు కూరలు కూడా ఇస్తున్నారు. నేను బయట కూరగాయలను కొనుగోలు చేయడం పూర్తిగా మానేశా. జి.హేమశ్రీ,, గృహిణి, మహీంద్రా కాలనీ సేంద్రీయ వ్యవసాయంతో పండించిన కూరగాయలు, ఆహారం తీసుకోవడం ద్వారానే మానవుడు మనుగడ సాధిస్తాడు. ప్రస్తుతం ఏది కొనాలన్నా వినియోగదారుడు భయంతోనే కొంటున్నాడు. వాటిలో ఏ మేరకు రసాయనం, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయనేది వారిని భయాందోâýæనలకు గురిచేస్తోంది. వాటి నుంచి బయట పడవేసేందుకే సేంద్రియ కూరగాయలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. పీవీ సతీష్, డీడీఎస్ డైరెక్టర్ -
ఆహారభద్రత పథకం పరిశీలన
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత పథకం అమలవుతున్న విధానాన్ని పథకం సలహాదారు డాక్టర్ కోల్ హట్కర్ పరిశీలించారు. శనివారం అర్జున్ నాయక్ తండాలోని భూములను పరిశీలించారు. ఈ పథకం అమలవుతున్న తీరును చూశారు. రైతులు శేనిబాయి, రాజీబాయి పొలాల్లోని పంటలను పరిశీలించి, ఈ పథకం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్య పంటలైన కొర్ర, సజ్జ, జొన్న, సామ వంటి పంటలను సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న డీడీఎస్ రైతులతో మాట్లాడారు. పంటలను సాగు చేస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పస్తాపూర్‌లోని డీడీఎస్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్ వీపీ సతీష్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట జాతీయ ఆహార భద్రత పథకం జిల్లా సలహాదారు రాజిరెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్, ఏఓ ప్రవీణ, కేవీకే శాస్ర్తవేత్త వరప్రసాద్, డీడీఎస్ మహిళా రైతులు సమ్మమ్మ, చంద్రమ్మ, లక్ష్మమ్మ, అనుసూయమ్మ, అర్జున్‌నాయక్ తండా రైతులు అమీర్బాయి, చాందిబాయి, డీడీఎస్ ప్రతినిధులు తేజస్వి, మంజుల, నర్సమ్మలు పాల్గొన్నారు. -
నకి‘లీలలు’!
టెండర్ షెడ్యూళ్లలో డూప్లికేటు డీడీలు ధరావత్తు లేకుండానే పనులు అడ్డగోలుగా కొట్టేసే ప్రయత్నం ఎస్ఈ పరిశీలనలో బయటపడ్డ వ్యవహారం అమలాపురం మున్సిపాలిటీలో రూ.2.13 కోట్ల పనుల టెండర్లు రద్దు అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపాలిటీలో టెండర్ల వండర్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపంతో కొందరు కాంట్రాక్టర్లు టెండర్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్ డూప్లికేట్ డీడీలతో టెండర్ షెడ్యూళ్లు దాఖలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అమలాపురం మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.13 కోట్లతో ఈ వేసవిలో ఆరు మేజర్ డ్రెయిన్ పనులను అత్యవసరంగా చేపట్టాలని కౌన్సిల్ తీర్మానించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఇందులో పదిమంది వరకూ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. సాధారణంగా టెండర్ షెడ్యూళ్లలో ధరావత్తు కోసం చెల్లించే మొత్తాలకు సంబంధించి కాంట్రాక్టర్లు బ్యాంకు డీడీలు జత చేయడం పరిపాటి. షెడ్యూళ్లను ఇంజనీర్లు ఆమూలాగ్రం పరిశీలించి టెక్నికల్ శాంక్షన్ కోసం ప్రజారోగ్య శాఖ ఎస్ఈకి పంపిస్తారు. ఈసారి ఓ కాంట్రాక్టర్ నాలుగు అభివృద్ధి పనులకు టెండర్లు వేశారు. ఆ సందర్భంగా రెండు పనులకు ఒరిజినల్ డీడీలు.. మరో రెండు పనులకు అవే డీడీల డూప్లికేట్లను జత చేశారు. తద్వారా ధరావత్తు చెల్లించకుండానే రెండు పనులు అడ్డగోలుగా కొట్టేయడానికి స్కెచ్ వేశారు. ఈ టెండర్ల షెడ్యూళ్లను, డీడీలను మున్సిపల్ డీఈఈ, డ్రాఫ్ట్స్మన్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. తరువాతే టెక్నికల్ శాంక్షన్ కోసం ఎస్ఈకి పంపించాలి. అయితే ఇంజనీర్లు కనీసంగా కూడా టెండర్లను పరిశీలించకుండా నేరుగా ఎస్ఈకి పంపించేశారు. ఈ టెండర్లను రాజమహేంద్రవరం ప్రజారోగ్య శాఖ ఎస్ఈ రంగనాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా డూప్లికేటు డీడీల బాగోతాన్ని ఆయన గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపాన్ని, కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూ మొత్తం రూ.2.13 కోట్ల పనుల టెండర్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని, ఆ పనులకు షార్ట్ టెండర్లు పిలవాలని కమిషనర్ శ్రీనివాస్‌కు లిఖిత పూర్వకంగా సూచించారు. ఈ వ్యవహారంపై సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ చిక్కాల గణేష్ ఇంజనీర్లను నిలదీయడంతో కౌన్సిల్‌కు డీఈఈ ప్రసాద్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘మీరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్నారా? లేక కాంట్రాక్టర్లకు భయపడుతున్నారా?’ అంటూ ఇంజనీర్లను కౌన్సిల్ తీవ్రంగా ప్రశ్నించింది. -
‘మద్యం’ దరఖాస్తుదారులకు ఇబ్బందులు!
జంగారెడ్డిగూడెం : మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం వీరంతా ఆదాయ పన్ను పరిధిలోకి వెళ్లటమేనని ఆడిటర్లు చెబుతున్నారు. జూన్ నెలాఖరులో జిల్లాలో 475 మద్యం షాపులకుగాను 428 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ షాపులకు పది వేలకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తు రుసుము, షాపుల గ్రేడులను బట్టి కనీసం రూ.మూడు లక్షలకు డీడీలు తీసి దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారులకు పాన్‌కార్డు తప్పనిసరి. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స వేసి ఉండాలి. ఇదంతా ఆధార్‌తో అనుసంధానం అవుతుంది. మద్యం వ్యాపారులు చాలా వరకు బినామీ పేర్లతో దరఖాస్తులు చేయించారు. ఇందులో ఎక్కువ శాతం మధ్యతరగతి, సామాన్య ప్రజలే ఉన్నారు. కొన్ని షాపులు గిరిజనులకు కేటాయించడంతో వారిలో గిరిజనులు కూడా ఉన్నారు. దీంతో వీరందరికీ ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ వేసేంతగా ఆదాయం ఉందా అనేది ప్రశ్నార్థకం. వీటి ఆధారంగానే ఆదాయ పన్ను అధికారులు భవిష్యత్తులో వారందరికీ నోటీసులు జారీచేసే అవకాశం ఉందని ఆడిటర్ల అభిప్రాయం. చాలా మందికి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స వేసేంత ఆదాయం లేదు. అయినా వాటిని సృష్టించి సిండికేట్లు దరఖాస్తులు చేయించాయి. ఇక్కడ నుంచే వీరందరికీ ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ వీరిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతానికి 2009 నుంచి 2012 వరకు ఒకేసారి పొదుపు ఖాతాలో రూ.రెండు లక్షలు జమ అయిన ఖాతాలు, క్రెడిట్‌కార్డు కలిగి ఉండి రూ.50 వేలు ఒకేసారి కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తున్నట్టు సమాచారం. దీంతో మూడు రూ.లక్షలకుపైగా డీడీలు తీసిన దరఖాస్తుదారులందరికీ అంత డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో లెక్క చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మద్యం దరఖాస్తుల కోసమే తాత్కాలికంగా ఐటీ రిటర్న్స్ వేసినా, వచ్చే ఏడాది నుంచి వీరందరికీ ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్‌లో ఏడాది ఆదాయం కనీసం రూ. రెండు లక్షలుగా చూపిస్తున్నారు. రూ.రెండు లక్షల ఆదాయమున్న వ్యక్తి కుటుంబం తెల్ల రేషన్ కార్డు, ప్రభుత్వ సబ్సిడీలు కోల్పోతుంది. ఇందుకుగాను మద్యం షాపు దరఖాస్తుదారు సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. -
‘ఎక్సైజ్’కు లక్ష్మీ కటాక్షం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మద్యం దుకాణాల కోసం చేసుకున్న దరఖాస్తుల ద్వారా ఇతర జిల్లాలకంటే శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆదాయాన్ని చూసి సంబంధిత శాఖ అధికారులే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మద్యం వినియోగంలోనే కాదు దుకాణాలు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలోనూ జిల్లా వాసులు ముందున్నారు. జిల్లాలో 232 దుకాణాలకు ఏడాదికి సంబంధించి ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియలో మొత్తం 217 దుకాణాలకు దరాఖస్తులు రావడం, లాటరీ తీయడం, కేటాయింపు కూడా జరిగిపోయింది. అయితే పొరుగున ఉన్న విజయనగరం, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలతో పోల్చి చూసుకుంటే దరఖాస్తుల స్వీకరణ ద్వారా ఇక్కడ గణనీయమైన ఆదాయం సమకూరింది. అంటే సిండికేట్ కొద్దిగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగని పాత వ్యక్తులకు దుకాణాలు పెద్దగా దక్కలేదని భావించలేము. విజయనగరం జిల్లాలో సుమారు 202 దుకాణాలకు దరఖాస్తులు పిలిస్తే సుమారు 1500 మంది ఆసక్తి కనబర్చారు. కడపలో 269 దుకాణాలకు 1400 వచ్చాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక్కడ మాత్రం 232 దుకాణాలకు రికార్డు స్థాయిలో 2,564 దరఖాస్తులొచ్చాయి. ఒక్కో దరఖాస్తుకూ రూ.25 వేలు చొప్పున (నాన్ రిఫండబు ల్) సుమారు రూ.6 కోట్ల 42 లక్షల ఆదాయం సమకూరింది. తొలివిడత డిపాజిట్ ద్వారా.. దుకాణాలు దక్కిన మద్యం వ్యాపారులు తొలి విడతగా రూ.5 లక్షల చొప్పున (సరుకు కోసం) డీడీలు తీశారు. దీని ద్వారా మరో రూ. 25 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే జిల్లాలోని మొత్తం 16 బార్ అండ్ రెస్టారెంట్లకు రాజాం మినహా మిగతా చోట్ల దుకాణాలను రెన్యువల్ చేయడం ద్వారా మరో రూ.4 కోట్లు సమకూరింది. దరఖాస్తులు, తొలివిడత డీడీలు, బార్ల రెన్యువల్ ఇలా మొత్తం సుమారు 35 కోట్ల రూపాయల ఆదాయం నెలరోజుల వ్యవధిలో సమకూరడంతో అధికారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ ఏడాది లక్ష్యసాధన లో ఇది తొలిమెట్టుగా చెబుతున్నారు. రాజాం ‘బార్ల’పై హైకోర్టు దృష్టి జిల్లాలో మొత్తం 16 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. ఇందులో రాజాం మున్సిపాలిటీలోనే నాలుగున్నాయి. అయితే పన్ను చెల్లింపు, సరుకు కొనుగోలుకు సంబంధించి జిల్లా అంతటా ఒకే విధానం అమలు చేసినా రాజాం వ్యాపారులు మాత్రం తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెళ్లారు. తమది పేరుకే మున్సిపాలిటీ గానీ నగర పంచాయతీగానే పరిగణించాలని, పన్ను వసూలు, రెన్యూవల్ ప్రక్రియలో గ్రేడ్-3 మున్సిపాలిటీగానే లెక్కిం చాలని కోర్టుతూ పిటీషన్ దాఖలు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజాం మినహా జిల్లాలోని మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకు ఏడాదికి సంబంధించి రెన్యువల్ ప్రక్రియను ముగించారు. రాజాం పరిస్థితిపై పూర్తిస్థాయిలో నివేదిక దాఖలు చేయాలని కోరుతూ హై కోర్టు నుంచి ఇటీవలే జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలందాయి. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనే.. లాటరీ, దుకాణాల కేటాయింపు, రెన్యువల్ ముగియడంతో ఇక అధికారులు బెల్ట్ దుకాణాల నియంత్రణపైనే దృష్టిసారించారు. ఇప్పటికే జిల్లాలో పలు కేసులు నమోదు చేసిన అధికారులు..సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌కు కూడా వెనకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సుమారు 1100 బెల్ట్ దుకాణాలున్నట్టు అంచనా. అయితే కేవలం 40 శాతం దుకాణాలపైనే సిబ్బంది దృష్టిసారించి నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. మిగతా వాటిపై దృష్టిసారించేందుకు రాజకీయ నేతల ఒత్తిళ్లు, వ్యాపారుల పలుకుబడి అడ్డంకిగా మారింది. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ కూడా ఎక్సైజ్ సిబ్బందిపై గుర్రుగా ఉన్నారు. ‘బెల్ట్’ నియంత్రణలో 34 ఏ ఎక్సైజ్ యాక్ట్‌ను బేఖాతర్ చేస్తూ వ్యాపారులకు అండగా నిలుస్తున్న ఇద్దరు సీఐలపైనా అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ‘టైం టూ టైం’ మెమోలజారీ తో పాటు సస్పెన్షన్ తప్పదని అధికారులు హెచ్చరించాల్సి వచ్చింది. జిల్లా సమాఖ్య కమి టీ, మహిళా సంఘాలు, స్థానిక పాలక సంఘా ల సభ్యులు, చైర్మన్లు, ఎస్ఐ, సీఐలు, గ్రామ కమిటీల సహకారంతో బెల్ట్ దుకాణాల నియంత్రణకు పాటుపడుతున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. -
బండెనక బండి కట్టి..
జహీరాబాద్, న్యూస్‌లైన్: బండెనకబండి కట్టి పదహారు బండ్లుకట్టి... అన్నట్లుగా ఎద్దులబండ్లు, పల్లెపడుచుల నృత్యాలు, జానపద కళాకారుల ఆటపాటలు, చెక్కభజన, బుర్రకథ...వెరసి పచ్చని పల్లె సంస్కృతి సాక్షాత్కరించింది. చిరుధాన్యాల ప్రాధాన్యం, జీవవైవిధ్యాన్ని ప్రజలకు వివరించేందుకు డీడీఎస్(డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) ప్రతి సంవత్సరం నిర్వహించే పాతపంటల జాతరలో ఈ దృశ్యం కనిపించింది. నెలరోజుల పాటు 50 గ్రామాల్లో నిర్వహించే ఈ వేడుకలు మంగళవారం జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు పాతపంటల ప్రాధాన్యత గురించి వివరించారు. జాతర సందర్భంగా నిర్వాహకులు 16 ఎద్దులబండ్లను అందంగా అలంకరించి ఊరేగించి వాటిల్లో పలు రకాల పాత పంటల ధాన్యాలను ప్రదర్శించారు. వాటి ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి ఈ సందర్భంగా మహిళా రైతులు వివరించారు. పాత పంటలపై రూపొందించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. పాత పంటలతో తయారు చేసిన వంటకాలు, చెట్లతో తయారు చేసిన మందులు, చిరు ధాన్యాలు, సేంద్రీయ ఎరువులను తయారు చేసుకునే విధానం, చిరు ధాన్యాల విక్రయశాలలతో కూడిన స్టాళ్లను సందర్శకులు పరిశీలించారు. జాతర సందర్భంగా ప్రదర్శించిన బుర్ర కథ, చెక్కభజన, కోలాటం ఆటలు ఆకట్టుకున్నాయి. పాత పంటల జాతర విశిష్టత గురించి డీడీఎస్ డెరైక్టర్ పీవీ సతీష్ వివరించారు. కార్యక్రమంలో జీవవైవిధ్య మండలి రాష్ట్ర చైర్మన్ హంపయ్య, సభ్య కార్యదర్శి ఎస్.ఎన్.జాదవ్, అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ స్టేట్ జాయింట్ డెరైక్టర్ కల్పన శాస్త్రి, గ్రామ సర్పంచ్ గౌతంరెడ్డి, ప్రొఫెసర్ టి.ఎన్.ప్రకాష్, సీనియర్ సైంటిస్ట్ అనిశెట్టిమూర్తిలు పాల్గొన్నారు.