టెండర్ షెడ్యూళ్లలో డూప్లికేటు డీడీలు
ధరావత్తు లేకుండానే పనులు
అడ్డగోలుగా కొట్టేసే ప్రయత్నం
ఎస్‌ఈ పరిశీలనలో బయటపడ్డ వ్యవహారం
అమలాపురం మున్సిపాలిటీలో
రూ.2.13 కోట్ల పనుల టెండర్లు రద్దు
అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపాలిటీలో టెండర్ల వండర్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపంతో కొందరు కాంట్రాక్టర్లు టెండర్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్ డూప్లికేట్ డీడీలతో టెండర్ షెడ్యూళ్లు దాఖలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అమలాపురం మున్సిపాలిటీలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.13 కోట్లతో ఈ వేసవిలో ఆరు మేజర్ డ్రెయిన్ పనులను అత్యవసరంగా చేపట్టాలని కౌన్సిల్ తీర్మానించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఇందులో పదిమంది వరకూ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
సాధారణంగా టెండర్ షెడ్యూళ్లలో ధరావత్తు కోసం చెల్లించే మొత్తాలకు సంబంధించి కాంట్రాక్టర్లు బ్యాంకు డీడీలు జత చేయడం పరిపాటి. షెడ్యూళ్లను ఇంజనీర్లు ఆమూలాగ్రం పరిశీలించి టెక్నికల్ శాంక్షన్ కోసం ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈకి పంపిస్తారు. ఈసారి ఓ కాంట్రాక్టర్ నాలుగు అభివృద్ధి పనులకు టెండర్లు వేశారు. ఆ సందర్భంగా రెండు పనులకు ఒరిజినల్ డీడీలు.. మరో రెండు పనులకు అవే డీడీల డూప్లికేట్‌లను జత చేశారు. తద్వారా ధరావత్తు చెల్లించకుండానే రెండు పనులు అడ్డగోలుగా కొట్టేయడానికి స్కెచ్ వేశారు. ఈ టెండర్ల షెడ్యూళ్లను, డీడీలను మున్సిపల్ డీఈఈ, డ్రాఫ్ట్స్‌మన్‌లు క్షుణ్ణంగా పరిశీలించాలి. తరువాతే టెక్నికల్ శాంక్షన్ కోసం ఎస్‌ఈకి పంపించాలి.
అయితే ఇంజనీర్లు కనీసంగా కూడా టెండర్లను పరిశీలించకుండా నేరుగా ఎస్‌ఈకి పంపించేశారు. ఈ టెండర్లను రాజమహేంద్రవరం ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ రంగనాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా డూప్లికేటు డీడీల బాగోతాన్ని ఆయన గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపాన్ని, కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూ మొత్తం రూ.2.13 కోట్ల పనుల టెండర్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని, ఆ పనులకు షార్ట్ టెండర్లు పిలవాలని కమిషనర్ శ్రీనివాస్‌కు లిఖిత పూర్వకంగా సూచించారు.
ఈ వ్యవహారంపై సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ చిక్కాల గణేష్ ఇంజనీర్లను నిలదీయడంతో కౌన్సిల్‌కు డీఈఈ ప్రసాద్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘మీరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్నారా? లేక కాంట్రాక్టర్లకు భయపడుతున్నారా?’ అంటూ ఇంజనీర్లను కౌన్సిల్ తీవ్రంగా ప్రశ్నించింది.
నకి‘లీలలు’!
Published Wed, Mar 30 2016 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement