ప్రదర్శన కోసం ఎడ్ల బండ్లలో ఉంచిన చిరు ధాన్యాలు
జహీరాబాద్: పాతపంటలకు కొత్తకళ వస్తోంది. చిరు ప్రాధాన్యం కలిగిన చిరుధాన్యం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో అందరూ పాతపంటలైన చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో 28 రోజులపాటు 23 గ్రామాల మీదుగా డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో 23వ పాతపంటల జాతర సాగనుంది.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాంగార్‌బౌలి తండా నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్‌నూర్‌లో ముగియనుంది. ఎడ్లబండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీశ్ వివరించారు. సమృద్ధి పోషకాలతో కూడిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, అవగాహన కల్పించేందుకు రైతులు, మహిళలతో ఆయా శాఖల అధికారులు, వ్యవసాయ నిపుణులు సమావేశాలు నిర్వహిస్తారు.
జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సంఘంలో ఐదువేల మంది మహిళారైతులు సజ్జ, కొర్ర, తైద, సామ, పెసర, మినుము, అవిశ తదితర 30 నుంచి సుమారు 50 రకాల చిరుధాన్యాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరుధాన్యాల ఆవశ్యకత, సేంద్రియ విధానంలో సాగు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని 70 గ్రామాల్లో డీడీఎస్ కొంతకాలంగా అవగాహన కల్పిస్తోంది. ఝరాసంగం మండలం మాచ్‌నూర్‌లో 50 నుంచి 60 రకాల విత్తనాలతో చిరుధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతులు పండించిన పంటలో నాణ్యమైనవాటిని విత్తనంగా సేకరించి నిల్వచేసి వానాకాలం, యాసంగిలో సాగు చేస్తున్నారు.
పాతపంటల జాతర షెడ్యూల్
ఈ నెల 14వ తేదీన మొగుడంపల్లి మండలం జాంగార్‌బౌలి తండాలో పాత పంటల జాతర ప్రారంభం అవుతుంది. 16న మన్నాపూర్, 17న ఉప్పర్‌పల్లి తండా, 18న జాడీ మల్కాపూర్, 19న లచ్చునాయక్ తండా, 20న జీడిగడ్డ తండా, 21న అర్జున్‌నాయక్ తండా, మోడ్ తండా, 23న జహీరాబాద్, 24న శేఖాపూర్ తండా, జంలైతండా, 25న శేఖాపూర్, 26న కోహీర్ మండలం గొటిగార్‌పల్లి, 27న బిలాల్‌పూర్, 28న ఝరాసంగం మండలం చిల్కెపల్లి, 30న బిడకన్నె, ఫిబ్రవరి 1న ఝరాసంగం, 2న పొట్‌పల్లి, 3న న్యాల్‌కల్ మండలం రేజింతల్, 4న హూసెళ్లి, గుంజోటి, 6న శంశల్లాపూర్, 8న న్యాల్‌కల్‌లో జాతర సాగుతుంది. 11న ఝరాసంగం మండలం మాచ్‌నూర్‌లోని డీడీఎస్ పచ్చసాలెలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment