వర్షాకాలంలో పంట పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకొనేందుకు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వచ్చిన కొందరు సందర్శకులకు డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్‌తండా, ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామాల్లో సహజ ఆకుకూరల ప్రాధాన్యం గురించి వివరించారు.
అవి ఏ మేరకు ఆరోగ్యాన్ని అందిస్తాయో సభ్యులు చెప్పారు. వర్షాకాల పంటల్లో పలు రకాల కలుపు మొక్కలు వస్తాయని.. వాటిని రైతులు తొలగిస్తుంటారని.. కానీ వాటిలోనూ ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు కలిగి ఉన్నాయని సందర్శకులకు మహిళా రైతులు చిందిబాయి, రాజీబాయి తెలియజేశారు. కలుపు మొక్కల్లో వందకుపైగా రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకోవచ్చని చెప్పారు. – జహీరాబాద్
ప్రదర్శన ద్వారా అవగాహన
పొలాల్లో సహజంగా పండే ఆకుకూరల గురించి సందర్శకులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు డీడీఎస్ సభ్యులు వారిని పొలాల్లో తిప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఏయే ఆకుకూరలో ఎలాంటి పోషకాలు ఉంటాయనే అంశాన్ని వివరించారు.
చక్కెర వ్యాధి నివారణకు ఉపయోగపడే ఆకుకూరలతోపాటు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఎలాంటి ఆకుకూరలు తినాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణిరావు, రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు అనితకుమారి, సంస్థ సభ్యులు మంజుల, పెద్ద నర్సమ్మ, చిన్న నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, మాణిక్యం, రోజా, మయూరి పాల్గొన్నారు.
నోరూరించిన వంటకాలు
పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరలతో వంట లు వండారు. ఆయా వంటకాలను సందర్శకులకు వడ్డించారు. మార్కెట్లో లభించే ఆకుకూరల కంటే ఇవి రుచిగా ఉన్నాయని పలువురు అన్నారు.
కలుపు మొక్కలుగాభావిస్తున్న వాటిలో కొన్ని...
అత్తిలి, పిట్టకూర, సన్న పాయలు, బంకంటికూర, చెన్నంగి, ఎన్నాద్రి, ఉత్తరేణి, గునుగు, బుడ్డకాశ, గోరిమడి, తెల్లగజ్జర, తకడదొబ్బుడు, జొన్న చెంచలి, పుల్లకూర, తగరంచ, ఎలుకచెవుల కూర, అంగిబింగి, పప్పుకూర, అడవి మెంతెంకూర, తుమ్మికూర, గురిమాసి, అడవి పొన్నగంటి అలం, నల్లకాశ, దూసరి, తలాయిలా, రేలపప్పు, తెల్లవార్జంపువ్వు, గురిమాసిగడ్డ, చిత్రమాలం, పొనగంటి, పల్లెరుకాయ, పొలపత్రం, బంకటి ఇలా అనేక రకాల ఆకు కూరలు సహజంగా లభిస్తాయి.
ఆకుకూరల్లో పోషక విలువలు...
ఆకుకూరలు ఆరోగ్య సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు అన్ని ఆకుకూరల్లో క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్–సి, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
సహజ ఆరోగ్యం పొందవచ్చు
రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజంగా ఆకు కూరలు లభ్యమవుతాయి. ఇవి సేంద్రియ విధానంలో వస్తున్నందున మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. – నర్సింహారావు, రిటైర్డ్ ఉద్యోగి, హైదరాబాద్
ఎన్నో ఆకుకూరల గురించి తెలుసుకున్నాం
ఆకుకూరల్లో ఇన్ని రకాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు. కలుపు మొక్కలుగా భావిస్తున్న ఆకుకూరల్లో అనేక పోషకాలు నిండి ఉన్నాయనే విషయం ఇప్పుడే తెలిసింది. వీటి గురించి తగిన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. – లిఖిత, బీటెక్ విద్యార్థిని, హైదరాబాద్
ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిసింది
సహజంగా వచ్చే ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. వాటి గురించి తెలుసుకునేందుకే వచ్చా. – స్వప్న, గృహిణి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment