‘ఎక్సైజ్’కు లక్ష్మీ కటాక్షం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మద్యం దుకాణాల కోసం చేసుకున్న దరఖాస్తుల ద్వారా ఇతర జిల్లాలకంటే శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆదాయాన్ని చూసి సంబంధిత శాఖ అధికారులే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మద్యం వినియోగంలోనే కాదు దుకాణాలు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలోనూ జిల్లా వాసులు ముందున్నారు. జిల్లాలో 232 దుకాణాలకు ఏడాదికి సంబంధించి ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియలో మొత్తం 217 దుకాణాలకు దరాఖస్తులు రావడం, లాటరీ తీయడం, కేటాయింపు కూడా జరిగిపోయింది. అయితే పొరుగున ఉన్న విజయనగరం, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలతో పోల్చి చూసుకుంటే దరఖాస్తుల స్వీకరణ ద్వారా ఇక్కడ గణనీయమైన ఆదాయం సమకూరింది. అంటే సిండికేట్ కొద్దిగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగని పాత వ్యక్తులకు దుకాణాలు పెద్దగా దక్కలేదని భావించలేము. విజయనగరం జిల్లాలో సుమారు 202 దుకాణాలకు దరఖాస్తులు పిలిస్తే సుమారు 1500 మంది ఆసక్తి కనబర్చారు. కడపలో 269 దుకాణాలకు 1400 వచ్చాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక్కడ మాత్రం 232 దుకాణాలకు రికార్డు స్థాయిలో 2,564 దరఖాస్తులొచ్చాయి. ఒక్కో దరఖాస్తుకూ రూ.25 వేలు చొప్పున (నాన్ రిఫండబు ల్) సుమారు రూ.6 కోట్ల 42 లక్షల ఆదాయం సమకూరింది.
తొలివిడత డిపాజిట్ ద్వారా..
దుకాణాలు దక్కిన మద్యం వ్యాపారులు తొలి విడతగా రూ.5 లక్షల చొప్పున (సరుకు కోసం) డీడీలు తీశారు. దీని ద్వారా మరో రూ. 25 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే జిల్లాలోని మొత్తం 16 బార్ అండ్ రెస్టారెంట్లకు రాజాం మినహా మిగతా చోట్ల దుకాణాలను రెన్యువల్ చేయడం ద్వారా మరో రూ.4 కోట్లు సమకూరింది. దరఖాస్తులు, తొలివిడత డీడీలు, బార్ల రెన్యువల్ ఇలా మొత్తం సుమారు 35 కోట్ల రూపాయల ఆదాయం నెలరోజుల వ్యవధిలో సమకూరడంతో అధికారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ ఏడాది లక్ష్యసాధన లో ఇది తొలిమెట్టుగా చెబుతున్నారు.
రాజాం ‘బార్ల’పై హైకోర్టు దృష్టి
జిల్లాలో మొత్తం 16 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. ఇందులో రాజాం మున్సిపాలిటీలోనే నాలుగున్నాయి. అయితే పన్ను చెల్లింపు, సరుకు కొనుగోలుకు సంబంధించి జిల్లా అంతటా ఒకే విధానం అమలు చేసినా రాజాం వ్యాపారులు మాత్రం తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెళ్లారు. తమది పేరుకే మున్సిపాలిటీ గానీ నగర పంచాయతీగానే పరిగణించాలని, పన్ను వసూలు, రెన్యూవల్ ప్రక్రియలో గ్రేడ్-3 మున్సిపాలిటీగానే లెక్కిం చాలని కోర్టుతూ పిటీషన్ దాఖలు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజాం మినహా జిల్లాలోని మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకు ఏడాదికి సంబంధించి రెన్యువల్ ప్రక్రియను ముగించారు. రాజాం పరిస్థితిపై పూర్తిస్థాయిలో నివేదిక దాఖలు చేయాలని కోరుతూ హై కోర్టు నుంచి ఇటీవలే జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలందాయి.
నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనే..
లాటరీ, దుకాణాల కేటాయింపు, రెన్యువల్ ముగియడంతో ఇక అధికారులు బెల్ట్ దుకాణాల నియంత్రణపైనే దృష్టిసారించారు. ఇప్పటికే జిల్లాలో పలు కేసులు నమోదు చేసిన అధికారులు..సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌కు కూడా వెనకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సుమారు 1100 బెల్ట్ దుకాణాలున్నట్టు అంచనా. అయితే కేవలం 40 శాతం దుకాణాలపైనే సిబ్బంది దృష్టిసారించి నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. మిగతా వాటిపై దృష్టిసారించేందుకు రాజకీయ నేతల ఒత్తిళ్లు, వ్యాపారుల పలుకుబడి అడ్డంకిగా మారింది. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ కూడా ఎక్సైజ్ సిబ్బందిపై గుర్రుగా ఉన్నారు. ‘బెల్ట్’ నియంత్రణలో 34 ఏ ఎక్సైజ్ యాక్ట్‌ను బేఖాతర్ చేస్తూ వ్యాపారులకు అండగా నిలుస్తున్న ఇద్దరు సీఐలపైనా అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ‘టైం టూ టైం’ మెమోలజారీ తో పాటు సస్పెన్షన్ తప్పదని అధికారులు హెచ్చరించాల్సి వచ్చింది. జిల్లా సమాఖ్య కమి టీ, మహిళా సంఘాలు, స్థానిక పాలక సంఘా ల సభ్యులు, చైర్మన్లు, ఎస్‌ఐ, సీఐలు, గ్రామ కమిటీల సహకారంతో బెల్ట్ దుకాణాల నియంత్రణకు పాటుపడుతున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.