పాతవారికే మద్యం కిక్కు! | Liquor Shops Allocation process in srikakulam | Sakshi
Sakshi News home page

పాతవారికే మద్యం కిక్కు!

Published Sun, Jun 29 2014 2:26 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

పాతవారికే మద్యం కిక్కు! - Sakshi

పాతవారికే మద్యం కిక్కు!

 శ్రీకాకుళం క్రైం : మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ శనివారం అర్ధరాత్రి దాటిన వరకు కొనసాగుతూ వచ్చింది. లాటరీ ఫలితాలు వెల్లడించిన పేర్లలో అధికమంది పాతవారే ఉండడం గమనార్హం. పక్కా ప్రణాళికతో ఒక్కో దుకాణానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసి మద్యం దుకాణాలు కైవసం చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలో 232 మద్యం దుకాణాల లెసైన్సులు పొందేందుకు ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియాల్సి ఉండగా అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు కొనసాగింది. మొత్తం 232 దుకాణాల్లో 203 దుకాణాలకు 2,567 దరఖాస్తులు దాఖలయ్యాయి. 29 దుకాణాలకు దరఖాస్తులు దాఖలు కాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో 35 దుకాణాలకు సింగల్ దరఖాస్తులు పడ్డాయి.
 
 అయితే, దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.6,41,75,000 ఆదాయం వచ్చింది. గతంలో సుమారు 2000 దరఖాస్తుల వరకు దాఖలుకాగా, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 2567 వచ్చాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రభుత్వ రెవెన్యూ పెంచడంలో విజయం సాధించారు. వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. లాటరీ తీసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసరికి సాయంత్రం అయ్యింది. లాటరీ విధానాన్ని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా సహాయ కలెక్టర్ అధ్వైత్‌కుమార్ సింగ్, ఏజేసీ మహ్మద్ షరీఫ్‌లు పర్యవేక్షించారు. జేసీ టెండర్ బాక్సులకు ఉన్న సీల్‌లను కట్ చేసి దరఖాస్తులను బయటకు తీశారు. ఏజేసి మహ్మద్ షరీఫ్, ఎక్సైజ్ డీసీ టి.నాగలక్ష్మి దుకాణాల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి లాటరీ విధానాన్ని చివరి వరకు దగ్గరుండి పర్యవేక్షించారు.
 
 అర్ధరాత్రి దాటినా...
 శనివారం అర్ధరాత్రి దాటిన వరకు దుకాణాల కేటాయింపు కొనసాగుతూనే ఉంది. లాటరీ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లాటరీ ప్రక్రియలో జాప్యంతో దరఖాస్తుదారులు అంబేద్కర్ ఆడిటోరియంలోని కుర్చీల్లోనే నిరీక్షించారు. ఉత్కంఠతో ఎదురు చూశారు. మొత్తం 203 దుకాణాలకు సంబంధించిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దుకాణాలను కైవసం చేసుకున్న వారిలో చాలామంది పాత వ్యాపారులే ఉండ టం గమనార్హం.
 
 దుకాణాలు కైవసం చేసుకున్నవారిలో...
 శ్రీకాకుళం పట్టణంలోని కొన్ని దుకాణాలను కైవసం చేసుకున్నవారిలో గజెట్ నెంబరు వరు స క్రమం ప్రకారం  ఎస్.నాగమణి, జి.భాస్కరరావు, ఎం.కనకమ్మ, ఎస్.గాంధీభరత్‌నాయు డు, పి.రాజారావు, పి.శ్రీరాములు, పి.బి. రామకృష్ణ, జి.రాజకుమారి, ఎస్.గోపాలరావు, సి.హెచ్.వెంకటకృష్ణారెడ్డి, ఎస్.అనూష, బి.వెం కటరావు, ఎం.సర్సింహమూర్తి, కె.అప్పారావు, ఓ.రాధ,ఆర్‌ఆర్‌డి.శ్వేత, బి.వి.రమణ, సిమ్మ వైకుంఠరావు, ఎం.శ్రీనివాసరావు, పైడి గోవిం దరావు, ఎస్.అప్పలరాజు, బి.ప్రవీణ్‌కుమార్, ఎం.నర్సింగరావు, వై.జగదీష్, కె.గోవింద్, బి.సాయిరాం, బి.అప్పలస్వామి, ఎం.రమణ, ఎం.మెహర్‌శంకర్ ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement