మాంచి కిక్ ఇస్తున్న.. టెన్షన్
శ్రీకాకుళం క్రైం: ఇంతవరకు లాభాల కిక్‌తో జోష్ మీదున్న మద్యం వ్యాపారులు ఇప్పుడు టెన్షన్ కిక్‌తో ఊగిపోతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బెల్ట్ షాపులను మూయిస్తామని.. తమిళనాడు తరహా మద్యం పాలసీ తీసుకొస్తామని ప్రభుత్వం చేస్తున్న రకరకాల ప్రకటనలకు తోడు జూన్ నెల సగం గడిచిపోయినా టెండర్ల ఊసెత్తకపోవడం మద్యం షాపులు, బార్ నిర్వాహకులను టెన్షన్‌కు గురి చేస్తోంది. బెల్ట్ షాపులు మూసేస్తే మద్యం వ్యాపారం కష్టమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 232 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి.
మద్యం దుకాణాలకు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే టెండర్లు ఖరారు చేసి షాపులు కేటాయించేవారు. బార్లకు మాత్రం గతం కంటే లెసైన్స్ ఫీజు కొంత శాతం పెంచి జూన్ నుంచి జూలై మొదటి వారంలోగా రెక్యూవల చేసేవారు. 2012లో మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించారు. 2013లో వాటినే రెన్యూవల్ చేశారు. అయితే 29 మంది నిర్వాహకులు వ్యాపారం సరిగ్గా సాగక తమ షాపులను రెన్యూవల్ చేసుకోకుండా విడిచిపెట్టారు. అప్పట్నుంచి పలుమార్లు వాటి నిర్వహణకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో గత ఏడాదంతా 203 మద్యం షాపులే వ్యాపారం నిర్వహించాయి.
కొత్త పాలసీ ఎలా ఉంటుందో?
ఇప్పటి వరకు మద్యం వ్యాపారం సాఫీగానే సాగినా.. ఇక ముందు ఎలా ఉంటుందోనని వ్యాపారులు
ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు చేస్తామని చెబుతున్నా.. అదేమిటో ఇంతవరకు బయటకు రాకపోవటమే వారి ఆందోళనకు కారణం. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు మూయించేస్తామని టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని పునరుద్ఘాటించింది. బెల్ట్ షాపులు లేకపోతే వ్యాపారం లాభదాయకం కాదని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు.
అలాంటప్పుడు లక్షల రూపాయల డిపాజిట్లు కట్టి షాపులు తీసుకోవడం దండగన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తమిళనాడు తరహా మద్యం పాలసీ అమలు చేస్తారని వస్తున్న వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ, వాటిలో పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించడం ఈ పాలసీ విశేషం. అయితే దీన్ని అమలు చేయడం అంత సులభం కాదని ఎక్సైజ్ అధికారులే చర్చించుకుంటున్నారు. ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నా.. అసలు కొత్త పాలసీ ఏమిటో.. ఎప్పుడు ప్రకటిస్తారో తెలియక మద్యం వ్యాపారులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఒకటిరెండు రోజుల్లోనే ప్రభుత్వం కొత్త పాలసీ ప్రకటించవచ్చని తెలుస్తోంది.