సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్‌లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి.. అత్యల్పంగా నిర్మల్ నుంచి దాఖలయ్యాయి. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా.. రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. తద్వారా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లయ్యింది
రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 79 వేల దరఖాస్తులు రాగా, గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు పెరిగాయి.
చదవండి: కాంగ్రెస్ రూట్‌లో కమలం.. సర్‌ప్రైజ్ అందుకే!
ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పడుతోంది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి.
టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మాణాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని, వెంటనే టెండర్లు నిలిపి వేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ కోరారు. రేపటి వరకు ప్రభుత్వం సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు.. రేపటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment