డిసెంబర్ చివరి నాటికి టెండర్లు కష్టమే...
ఇప్పటికీ రోడ్డుకు జారీ కాని నంబరు
అది రాకుంటే పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం
ఆ అనుమతులు వస్తేనే నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగానికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో మాత్రం స్పష్టత రావటం లేదు. టెండర్లు పిలిచే నాటికే పరిహారం అందిస్తారని ఆశించినా, అందుకు కనీసం మరో రెండుమూడు నెలల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
పరిహారం అందించిన తర్వాతే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి స్పష్టంగా ఆదేశించారు. కానీ, ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్ పరిహారం విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది.
జాప్యమెందుకు?
ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ చేపడు తున్న విషయం తెలిసిందే. ఈ భాగానికి టెండర్లు పిలిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవలే కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసి ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది. డిసెంబరు చివరికల్లా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలుస్తారని ఓ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఉత్తర భాగానికి అటవీ అనుమతులు కూడా వచ్చాయని ఆయన అధికారికంగా వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు మాత్రం రాలేదు.
అవి రాకుండా అవార్డులు పాస్ చేసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు రావాలంటే, ఆ రోడ్డుకు నంబరు కేటాయించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కేటగిరీలో నిర్మిస్తున్నందున దానికి ఎక్స్‌ప్రెస్ వే నంబరు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నంబరు కేటాయించలేదు.
ఉన్నతస్థాయి కమిటీ భేటీ అయితేనే...
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలకు నంబర్లు కేటాయించాలంటే నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అనుమతివ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ కమిటీ ఇంకా భేటీ కాలేదు. దాదాపు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న రోడ్లన్నింటికి సంబంధించి ఒకేసారి నంబర్లు కేటాయించే కసరత్తు చేస్తున్నందున, అన్నింటికి కలిపి ఒకేసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.
ఈ నంబరు కేటాయింపులో జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు పరిహారం చెల్లింపులో ఆలస్యానికి కారణమైంది. ప్రస్తుతం అటవీ శాఖకు సంబంధించి ప్రాథమిక అనుమతి లభించింది. సేకరించే అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు ఇది అనుమతిస్తుంది. దీని కాలపరిమితి ఏడాది మాత్రమే. ఈలోపు అటవీశాఖకు పరిహారం, ప్రత్యామ్నాయ భూకేటాయింపు, అక్కడ చెట్ల పెంపకానికి అయ్యే వ్యయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కసరత్తు జరిగితేనే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి.
అటవీశాఖ పూర్తి అనుమతులు, పర్యావరణ అనుమతులు రాకుండా కూడా టెండర్లు పిలిచుకునే వీలుంటుంది. కానీ, టెండర్లు తెరవాలంటే మాత్రం ఆ అనుమతులు వచ్చి ఉండాలి. ఇక పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటే మాత్రం విధిగా పర్యావరణ అనుమతులు వచ్చి ఉండాలి. దాని విషయంలో జాప్యం పరిహారం అందకుండా చేస్తోంది.
ఇప్పటికిప్పుడు రోడ్డు నంబరు కేటాయించినా, ఆ తర్వాత పర్యావరణ అనుమతుల జారీ కసరత్తు పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెరసి మరో రెండుమూడు నెలల సమయం పట్టే వీలుందని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment