‘రీజినల్ రింగురోడ్డు’లో కీలక పరిణామం
ఉత్తరభాగం పనులు ప్రారంభం కాగానే..
భూముల ధరలు పెరుగుతాయని అంచనా
దక్షిణభాగం ఆలస్యమైతే.. పరిహారం భారీగా పెంచాలనే డిమాండ్ వచ్చే పరిస్థితి
కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా సానుకూల స్పందన
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనుల టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికొచ్చాయి. టెండర్లు కాగానే ఉత్తరభాగం పనులు మొదలవుతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. దీని ప్రభావం దక్షిణ భాగంపై కూడా పడుతుంది. అక్కడా భూముల ధరలు పెరుగుతాయి.
అప్పుడు, దక్షిణభాగంలో తమకు ఇచ్చే పరిహారం చాలదని, దానిని పెంచాలంటూ భూనిర్వాసితుల నుంచి డిమాండ్ వస్తుందన్న సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో దక్షిణభాగంలో జరుగుతున్న జాప్యాన్ని నిలవరించి..అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి తాజాగా కేంద్రం కూడా సమ్మతించినట్టు తెలిసింది.
పనులకు అడ్డంకిగా మారుతుందని..
ప్రస్తుతం ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేస్తారు. దీంతో భూనిర్వాసితుల ఖాతాలో పరిహారం జమ అవుతుంది. సంగారెడ్డి పట్టణ సమీపంలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి ఆర్డీఓ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితుల నుంచి ప్రతిఘటన ఎదురుకాగా, మిగతా ప్రాంతాల్లో సాఫీగానే సాగుతోంది. ఉత్తర భాగానికి సంబంధించి రూ.5200 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున భరించాల్సి ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే, దక్షిణ భాగంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దాని నిడివి మాత్రం ఎక్కువ. దీంతో అక్కడ దాదాపు రూ.6000 కోట్ల వరకు పరిహారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మరో రెండు మూడునెలల్లో ఉత్తర భాగం టెండర్ల దశకు చేరుకుంటుంది. కానీ, దక్షిణభాగం విషయంలో ఇంకా అలైన్‌మెంట్ కూడా ఖరారు కాలేదు.
ఉత్తర భాగం టెండర్లు పూర్తయ్యేనాటికి స్థానికంగా భూముల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనా ఉంది. పనుల్లో జాప్యం జరుగుతున్నా.. దక్షిణ భాగంలో కూడా రింగ్ నిర్మాణం ఎలాగూ ఖరారైనందున, స్థానికంగా కూడా భూముల ధరలు అప్పటికి భారీగా పెరుగుతాయి. దీంతో అప్పటి భూముల ధరలకు తగ్గట్టుగా పరిహారం మొత్తం పెంచాలని దక్షిణ భాగం నిర్వాసితులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
దీంతో ఉత్తర భాగంలో భూముల ధరలు పెరిగేలోపు దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. భూ పరిహార భారం పెరిగితే, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రూ.17 వేల కోట్లతో రెండు భాగాలు పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లకు చేరేలా కనిపిస్తోంది.
పరిహారం మరింత పెంచాల్సి వస్తే నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది. దీంతో మరో మూడు నెలల్లోగా దక్షిణభాగంలో కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment