ఉత్తరభాగం పనులు కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో
దక్షిణభాగం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..
ఇటీవల సీఎం రేవంత్, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ మధ్య చర్చల్లో ప్రస్తావన
కేంద్రం నుంచి తుదినిర్ణయం వెల్లడయ్యాక తదనుగుణంగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు పనుల నిర్వహణ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చూసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టెండర్ల దశకు చేరువలో ఉన్న ఉత్తరభాగాన్ని కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ఇక అలై న్‌మెంట్ దశలోనే ఆగిపోయిన దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించాలన్న అంశాన్ని కేంద్రం పరిశీ లిస్తోంది.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో నిర్వహించిన భేటీలో చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
భారత్‌మాల పరియోజనలో చోటు దక్కకపోవటంతో..
రీజినల్‌రింగ్ రోడ్డులో 162.4 కి.మీ నిడివి ఉండే ఉత్తరభాగాన్ని, 189.2 కి.మీ. నిడివి ఉండే దక్షిణభాగాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగం భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డులు పాస్ చేసే దశలో ఉంది. మరో రెండుమూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ జరగనుంది. కానీ, దక్షిణభాగానికి ఏడాది క్రితం అలైన్‌మెంట్ పూర్తయినా, ఇప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఆ భాగానికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరగటం లేదు.
నిజానికి ఈ రెండు భాగాలను భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో చేర్చాల్సి ఉంది. ఉత్తర భాగాన్ని గతంలోనే ఆ జాబితాలో చేర్చారు. కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించటం, భూసేకరణ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించే విషయంలో అగాధం ఏర్పడటంతో రోడ్డు ప్రక్రియలో జాప్యం జరిగింది. భారత్‌మాల పరియోజనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవటంతో రీజినల్ రింగురోడ్డును దాని నుంచి మినహాయించారు. దీంతో మిగిలిపోయిన 7500 కి.మీ. నిడివి గల ఎక్స్‌ప్రెస్‌వే పనులతోపాటు మరో 5000 కి.మీ. ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులను చేరుస్తూ 2047 సంవత్సరం లక్ష్యంతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.
భారత్‌మాల పరియోజనలో చోటు దక్కిన వాటిని ముందు నిర్వహించి, రెండో ప్రోగ్రామ్‌లో ఉన్న వాటిని తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే నిధుల కేటాయింపు ఉంటుంది. రింగు ఉత్తరభాగాన్ని తొలుత భారత్‌మాలలో చేర్చినందున, దానిని అలాగే కొనసాగిస్తూ దక్షిణభాగాన్ని రెండో ప్రోగ్రామ్‌లో చేర్చారు. ఫలితంగా దక్షిణ భాగం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలే లేవు. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ భాగాన్ని మరో రకంగానైనా చేపట్టాలని కోరారు.
దీనిపై అధికారులతో చర్చించిన మీదట, పీడబ్ల్యూడీ ద్వారా నిర్వహించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ రహదారుల విభాగం(ఎన్‌హెచ్)ను పీడబ్ల్యూడీకి స్థానిక ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తున్నది. ఈ విభాగం ద్వారా నిర్వహించే రోడ్డు పనులకు కేంద్రమే నిధులు సమకూరుస్తున్నా, పనుల నిర్వహణ మాత్రం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి.
భారత్‌మాల పరియోజన కింద కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం, రాష్ట్రప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండే ఎన్‌హెచ్ విభాగం ఆధ్వర్యంలో దక్షిణభాగం పనుల నిర్వహణ ఉంటుందన్నమాట. దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చాక తదుపరి కార్యాచరణ ఉంటుంది. అదే జరిగితే ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ఉత్తరభాగం పనులు ప్రారంభమైన వెంటనే ఎన్‌హెచ్ ఆధ్వర్యంలో దక్షిణభాగం పనులు పట్టాలెక్కుతాయి.
ఆ విభాగానికి పెద్ద టాస్కే..
రింగురోడ్డు దక్షిణ విభాగం పనుల అంచనా దాదాపు రూ.19 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్‌హెచ్ విభాగం ఇంత పెద్ద పనులు చేపట్టలేదు. దాదాపు 2500 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తక్కువ నిడివి ఉండే జాతీయ రహదారులను ఆ విభాగం చేపడుతూ వచ్చింది. ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు బాధ్యత వస్తే ప్రత్యేకంగా అంతర్గతంగా కొన్ని విభాగాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు సిబ్బందిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment