అధికారులకు మామూళ్ల కిక్కు..ప్రజలకేదీ దిక్కు!
శ్రీకాకుళం క్రైం:ఈ ఫొటోలు చూశారా?.. రెండూ మద్యం దుకాణాలకు సంబంధించినవే. నిబంధనలకు విరుద్ధంగా, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూనో.. తప్పుదోవ పట్టించో ఏర్పాటు చేసినవే. వీటిలో ఒక జనావాస ప్రాంతాల మధ్యలో ఉంటే.. ఇంకొకటి 30 పడకల ప్రైవేట్ ఆస్పత్రి పక్కనే ఉంది. .. బడి, గుడి, ఆస్పత్రి, జనావాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు నిషిద్ధం. దుకాణాల ఏర్పాటు సమయంలోనే ఎక్సైజ్ అధికారులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అయితే కొందరు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో పడి.. దుకాణదారులకు లబ్ధి చేకూర్చేందుకు తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రెండు, సోంపేటలో పలు షాపుల ఏర్పాటులో జరిగిన తంతే దీనికి నిదర్శనం. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు జూన్ నెలలోనే పూర్తి అయ్యింది. మొత్తం 232 షాపులకుగాను ఐదు మినహా మిగతావన్నీ ఏర్పాటయ్యాయి. అయితే షాపుల ఏర్పాటులో పాటించాల్సిన నిబంధనలను కొందరు తుంగలో తొక్కారు. దీనిపై ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోయింది. కొంత మంది ఎక్సైజ్ అధికారులు ముడుపులు స్వీకరించి షాపుల నిర్వాహకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
30 పడకల ఆస్పత్రి పక్కనే..
శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ సమీపంలో ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే 30 పడకల ద్వారకామాయి ప్రైవేటు ఆస్పత్రి ఉంది. 30 పడకల ప్రైవేట్ ఆస్పత్రులకు వంద మీటర్ల దూరంలోపూ మద్యం షాపుల ఏర్పాటుకు నిబంధనలు అనుమతించవు. అయితే ఓ ఎక్సైజ్ అధికారి ద్వారకామాయి ఆస్పత్రి అసలు 30 పడకల ఆస్పత్రే కాదని తప్పుడు రికార్డులు సృష్టించి, దాని పక్కనే షాపు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. కానీ అది 30 పడకల ఆస్పత్రేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. దీనిపై కొందరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా, సాక్షాత్తు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది.
కలెక్టరు ఆదేశాలు బేఖాతరు
కాగా శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంతం పూర్తిగా జనావాసాలతో నిండి ఉంది. అయినా ఇక్కడ మద్యం షాపు ఏర్పాటుకు సదరు ఎక్సైజ్ అధికారి అనుమతి ఇచ్చేశారు. మద్యం దుకాణం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకోలు కూడా చేసి గ్రీవెన్స్ సెల్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. రాత్రివేళల్లో మందుబాబుల ఆగడాలతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. పగటి వేళల్లో కూడా విద్యార్థినులను మద్యం సేవించిన ఆకతాయిలు వేధిస్తున్నారని, మద్యం సేవించిన కొందరు తనపై దాడికి పాల్పడ్డారని ఓ రిటైర్డ్ తహశీల్దార్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆ దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న దుకాణాలను వేరే చోటుకు మార్పించే అధికారం కలెక్టర్‌కు ఉంది. ఆయన ఆదేశాలనే ధిక్కరిస్తూ ఎక్సైజ్ అధికారులు రోజులు గడుస్తున్నా దుకాణం తరలింపునకు చర్యలు తీసుకోవడం లేదు.
సోంపేటలో టాస్క్‌ఫోర్స్ విచారణ
మరోవైపు సోంపేట పరిధిలో అడ్డదారిలో పలు దుకాణాలు కేటాయించారంటూ స్థానికులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ వ్యవహారంపై రహస్య విచారణ సాగిస్తున్నారు. అసలు ఏయే దుకాణాలకు సింగల్ టెండర్లు పడ్డాయి, ఏవి బినామీల పేరుతో నడుస్తున్నాయన్నదానిపై విచారణ సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట కాశీబుగ్గలోని ఓ హోటల్‌లో ఫిర్యాదుదారుల నుంచి ర హస్యంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. శ్రీకాకుళంలోని దుకాణాల కేటాయింపుపైన కూడా రెండు మూడు రోజుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరుపనున్నట్టు ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి.
మెమోలు జారీ చేశాం
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన దుకాణాలను తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. శ్రీకాకుళం పట్టణంలో అంబేద్కర్ జంక్షన్, జిల్లా పరిషత్‌ల వద్ద ఉన్న మద్యం దుకాణాలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించాం. ఈ రెండింటికి సంబంధించి మెమోలు కూడా జారీ చేశాం. త్వరలోనే ఇవి అమలయ్యేలా చర్యలు చేపడతాం.
-నాగలక్ష్మి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్