సిండి‘కేటు’కే కిక్కు!
శ్రీకాకుళం క్రైం: బెల్ట్ షాపులు మూసేస్తాం.. బెల్ట్ షాపులు నిర్వహించినా, వాటికి మద్యం సరఫరా చేసినా సంబంధిత మద్యం షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. అవన్నీ అమలవుతాయన్న నమ్మకం మాత్రం కలగడం లేదు. కొత్తగా షాపులు పొందినవారిలో అత్యధిక శాతం పాతవారే కావడంతో 2011 మాదిరిగా సిండికేట్ అవుదామన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. జిల్లాలో మద్యం షాపులను శనివారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు కేటాయించారు. ఈ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 232 దుకాణాలకుగాను 203 షాపులకు 2,567 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6,41,75,000 ఆదాయం వచ్చింది.
29 దుకాణాలకు దరకాస్తులు దాఖలు కాకపోవడంతో వాటికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. కాగా 203 దుకాణాలను కైవసం చేసుకున్న వారిలో చాలా వరకు పాత వ్యాపారులే కావడం గమనార్హం. కొంతమంది పాత వ్యాపారులు పెట్టుకున్న బినామీలకు కూడా పెద్ద సంఖ్యలోనేషాపులు దక్కాయి. పాతవారు, వారి బినామీలు కలిసి 150కి పైగా షాపులు చేజిక్కించుకున్నారని సమాచారం. పక్కా ప్రణాళికతో దరఖాస్తులు దాఖలు చేసి వారు ఈ విషయంలో విజయం సాధించారు. గత కొన్నేళ్లుగా మద్యం వ్యాపారంలో పాతుకుపోయిన వీరికి ఏ దుకాణానికి ఎంత ఆదాయం వస్తుంది.. అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయన్నదానపై పూర్తి అవగాహన ఉంది. ఆ అంచనాతోనే పక్కాగా వ్యూహం రూపొందించుకుని ఒక్కో మధ్యం వ్యాపారి 5 నుంచి 15 దుకాణాలకు దరఖాస్తు చేశారు. తమ బినామీల పేరుతో కూడా అదే స్థాయిలో దరఖాస్తు చేయించారు.
సిండికేట్‌కు రంగం సిద్దం
ఉహించిన విధంగానే పాత వ్యాపారులకే షాపులు దక్కడం, ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేస్తే లాభాలు రావని భావిస్తున్న వీరు సిండికేట్‌గా ఏర్పడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బెల్ట్ దుకాణాల మూసివేస్తే అసలు ఆదాయం ఉండదని, అందువల్ల సిండికేట్ అయ్య మద్యం ధరలను తామే నిర్ణయించాలని దరఖాస్తు చేసిన సమయంలోనే కొందరు వ్యాపారులు మంతనాలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుంగా పరస్పరం పోటీ పడకుండా ఒక అవగాహనతో దరఖాసులు దాఖలు చేశారు. అయితే సిండికేట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో సిండికేట్ లీడర్‌గా వ్యవహరించిన ఓరుగంటి ఈశ్వరరావు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దీంతో కొత్తవారు ముందుకొస్తున్నారు. ఆదివారం ఉదయం కొంత మంది వ్యాపారులు సమావేశమై చర్చించుకోగా.. రాజకీయ అండదండలు ఉన్న మరికొంత తాము లీడ్ చేస్తామంటూ ముందుకు వచ్చినట్టు తెలిసింది.
బెదిరింపుల పర్వం మొదలు
సిండికేట్ అయ్యేందుకు పాత మధ్యం వ్యాపారులు సన్నాహాలు చేస్తుండగా కొత్తగా దుకాణాలు కైవసం చేసుకున్న వారుదానితో ప్రమేయం లేకుండా షాపులు నడుపుకోవాలని భావిస్తున్నారు. అయితే వారిని నయానో.. భయానో ఒప్పించాలని సిండికేట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. దానికి రెండు మార్గాలు అనుసరిస్తున్నారు. షాపు పొందిన వ్యక్తికి గుడ్‌విల్ ఇచ్చి దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఒక పద్ధతి కాగా, అంగీకరించకుంటే బె దిరింపులకు దిగి తమ దారిలోకి తెచ్చుకోవాలని రెండో పద్ధతిగా అనుసరిస్తున్నారు. ఇప్పటికే కొందరు కొత్త వ్యాపారులను కలిసి మంతనాలు జరపడంతో ఎందుకొచ్చిన గొడవ.. గుడ్‌విల్ తీసుకుని తప్పుకుందామని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.