మద్యం దుకాణాల కేటాయింపునకు రంగం సిద్ధం
మద్యం దుకాణాల కేటాయింపునకు రంగం సిద్ధం
Published Wed, Jun 25 2014 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
శ్రీకాకుళం క్రైం: జిల్లాలోని 232 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి సర్వం సిద్ధం చేశామని ఎక్సైజ్‌శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుకాణాల ఏర్పాట్లు తదితర విషయాలపై ఆమె మాట్లాడారు. పదివేల లోపు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల లెసైన్సు ఫీజును రూ. 32.5 లక్షలుగా కేటాయించారు. పది వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు రూ. 36 లక్షలుగా, పట్టణ ప్రాంతంలోని దుకాణాలకు రూ. 45 లక్షలుగా లెసైన్సు ఫీజును నిర్ణయించినట్టు వివరించారు. గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరుగుతోందన్నారు.
మొత్తం దుకాణాలకు సంబంధించి అసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను తమ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలన్నారు. 28వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో అంబేద్కర్ అడిటోరియంలో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయిస్తామన్నారు. జిల్లాలో 14 సర్కిళ్లు ఉండగా, వాటిలో శ్రీకాకుళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఏడేసీ సర్కిళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 134 , పలాస పరిధిలో 98 దుకాణాలు ఉన్నట్టు వివరించారు. మొత్తం 232 దుకాణాలకు సంబంధించి గతంలో రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఐదు దుకాణాలకు అసలు టెండర్లే పడలేదని, వాటిని ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో కేటాయించటం జరుగుతుందన్నారు.
జిల్లా పరిషత్‌కు సమీపంలో ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రెండు, డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలో రెండు దుకాణాలను కేటాయించనున్నట్టు వెల్లడించారు. అసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఒక్కో దుకాణానికి రూ. 25 వేలు చలానా తీయాల్సి ఉంటుందని, అలాగే రూ. ఐదు లక్షలకు సంబంధించిన డీడీని దరఖాస్తుతో జత చేయాలన్నారు. ఏ-1, ఏ-2, ఏ-3 డిక్లరేషన్లతో పాటు ఆరు ఫొటోలను దరఖాస్తుకు జత చేయాలన్నా. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు. కాగా బార్లకు సంబంధించి 50 వేల జనాభా దాటి ఉన్న ప్రాంతాల్లో లెసైన్సు ఫీజులు పెంచారు. శ్రీకాకుళం సమీపంలోని పది బార్లకు సంబంధించి గతంలో రూ. 35 లక్షల లెసెన్స్ ఫీజు ఉండగా ప్రస్తుతం మరో మూడు లక్షల రూపాయలు పెంచుతూ 38 లక్షల రూపాయలుగా నిర్ణయించామన్నారు. సమావేశంలో శ్రీకాకు ళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె.ఏసుదాసు, ఎస్.సుకేష్‌లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement