జంగారెడ్డిగూడెం : మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం వీరంతా ఆదాయ పన్ను పరిధిలోకి వెళ్లటమేనని ఆడిటర్లు చెబుతున్నారు. జూన్ నెలాఖరులో జిల్లాలో 475 మద్యం షాపులకుగాను 428 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ షాపులకు పది వేలకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తు రుసుము, షాపుల గ్రేడులను బట్టి కనీసం రూ.మూడు లక్షలకు డీడీలు తీసి దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారులకు పాన్‌కార్డు తప్పనిసరి. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్‌న్స వేసి ఉండాలి. ఇదంతా ఆధార్‌తో అనుసంధానం అవుతుంది.
మద్యం వ్యాపారులు చాలా వరకు బినామీ పేర్లతో దరఖాస్తులు చేయించారు. ఇందులో ఎక్కువ శాతం మధ్యతరగతి, సామాన్య ప్రజలే ఉన్నారు. కొన్ని షాపులు గిరిజనులకు కేటాయించడంతో వారిలో గిరిజనులు కూడా ఉన్నారు. దీంతో వీరందరికీ ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ వేసేంతగా ఆదాయం ఉందా అనేది ప్రశ్నార్థకం. వీటి ఆధారంగానే ఆదాయ పన్ను అధికారులు భవిష్యత్తులో వారందరికీ నోటీసులు జారీచేసే అవకాశం ఉందని ఆడిటర్ల అభిప్రాయం. చాలా మందికి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్‌న్స వేసేంత ఆదాయం లేదు. అయినా వాటిని సృష్టించి సిండికేట్‌లు దరఖాస్తులు చేయించాయి. ఇక్కడ నుంచే వీరందరికీ ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ వీరిపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
ప్రస్తుతానికి 2009 నుంచి 2012 వరకు ఒకేసారి పొదుపు ఖాతాలో రూ.రెండు లక్షలు జమ అయిన ఖాతాలు, క్రెడిట్‌కార్డు కలిగి ఉండి రూ.50 వేలు ఒకేసారి కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తున్నట్టు సమాచారం. దీంతో మూడు రూ.లక్షలకుపైగా డీడీలు తీసిన దరఖాస్తుదారులందరికీ అంత డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో లెక్క చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మద్యం దరఖాస్తుల కోసమే తాత్కాలికంగా ఐటీ రిటర్న్స్ వేసినా, వచ్చే ఏడాది నుంచి వీరందరికీ ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్‌లో ఏడాది ఆదాయం కనీసం రూ. రెండు లక్షలుగా చూపిస్తున్నారు. రూ.రెండు లక్షల ఆదాయమున్న వ్యక్తి కుటుంబం తెల్ల రేషన్ కార్డు, ప్రభుత్వ సబ్సిడీలు కోల్పోతుంది. ఇందుకుగాను మద్యం షాపు దరఖాస్తుదారు సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు.
‘మద్యం’ దరఖాస్తుదారులకు ఇబ్బందులు!
Published Mon, Aug 17 2015 2:49 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM
Advertisement