జహీరాబాద్, న్యూస్‌లైన్: బండెనకబండి కట్టి పదహారు బండ్లుకట్టి... అన్నట్లుగా ఎద్దులబండ్లు, పల్లెపడుచుల నృత్యాలు, జానపద కళాకారుల ఆటపాటలు, చెక్కభజన, బుర్రకథ...వెరసి పచ్చని పల్లె సంస్కృతి సాక్షాత్కరించింది. చిరుధాన్యాల ప్రాధాన్యం, జీవవైవిధ్యాన్ని ప్రజలకు వివరించేందుకు డీడీఎస్(డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ) ప్రతి సంవత్సరం నిర్వహించే పాతపంటల జాతరలో ఈ దృశ్యం కనిపించింది. నెలరోజుల పాటు 50 గ్రామాల్లో నిర్వహించే ఈ వేడుకలు మంగళవారం జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు పాతపంటల ప్రాధాన్యత గురించి వివరించారు. జాతర సందర్భంగా నిర్వాహకులు 16 ఎద్దులబండ్లను అందంగా అలంకరించి ఊరేగించి వాటిల్లో పలు రకాల పాత పంటల ధాన్యాలను ప్రదర్శించారు. వాటి ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి ఈ సందర్భంగా మహిళా రైతులు వివరించారు. పాత పంటలపై రూపొందించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. పాత పంటలతో తయారు చేసిన వంటకాలు, చెట్లతో తయారు చేసిన మందులు, చిరు ధాన్యాలు, సేంద్రీయ ఎరువులను తయారు చేసుకునే విధానం, చిరు ధాన్యాల విక్రయశాలలతో కూడిన స్టాళ్లను సందర్శకులు పరిశీలించారు. జాతర సందర్భంగా ప్రదర్శించిన బుర్ర కథ, చెక్కభజన, కోలాటం ఆటలు ఆకట్టుకున్నాయి. పాత పంటల జాతర విశిష్టత గురించి డీడీఎస్ డెరైక్టర్ పీవీ సతీష్ వివరించారు. కార్యక్రమంలో జీవవైవిధ్య మండలి రాష్ట్ర చైర్మన్ హంపయ్య, సభ్య కార్యదర్శి ఎస్.ఎన్.జాదవ్, అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ స్టేట్ జాయింట్ డెరైక్టర్ కల్పన శాస్త్రి, గ్రామ సర్పంచ్ గౌతంరెడ్డి, ప్రొఫెసర్ టి.ఎన్.ప్రకాష్, సీనియర్ సైంటిస్ట్ అనిశెట్టిమూర్తిలు పాల్గొన్నారు.