జహీరాబాద్ చేరిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ రైలు
- 6 నుంచి 21వ తేదీ వరకు ఉచిత వైద్య సేవలు
- అత్యాధునిక వసతులతో ఆపరేషన్లు
జహీరాబాద్ : జిల్లాలో మొదటి సారిగా లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా వైద్య శిబిరం నిర్వహించేందుకు రైల్వే శాఖ తలపెట్టింది. జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం సహకారంతో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 6 నుంచి 21వ తేదీ వరకు జహీరాబాద్ రైల్వేస్టేషన్‌లో మారుమూల గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు ప్రత్యేక రైలు బోగీలు స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. ప్రత్యేక రైలులో అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు.
జహీరాబాద్‌లో నిర్వహించేది 155వ ఉచిత వైద్య శిబిరం అవుతుందని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. శిబిరంలో ఆర్థోపెడిక్, కంటి, చెవి, పంటి, గ్రహణమొర్రి, మూర్చ రోగాలకు వైద్య సేవలందించనున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తామని అధికారులు చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా వైద్య సేవలను ప్రారంభించిందని తెలిపారు. రైళ్ల రాకపోకలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వీలుగా గూడ్స్ రైళ్లను నిలిపే ప్లాట్‌ఫాంపై ప్రత్యేక రైలును నిలిపి రోగులకు వైద్య సేవలందించనున్నారు.
వైద్య శిబిరం నిర్వహణ ఏర్పాట్లను మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం ప్రతినిధులు గిల్‌రాయ్, ప్రదీప్‌గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ శిబిరంలో ఆపరేషన్లు నిర్వహించేందుకు రోగులకు గుర్తించేందుకు ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. 6వ తేదీన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.