ఆ దీక్షాదక్షతలే అండ | Sabitha Indra Reddy Personal Interview | Sakshi
Sakshi News home page

ఆ దీక్షాదక్షతలే అండ

Published Sun, Dec 22 2013 12:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Sabitha Indra Reddy Personal Interview

  •  ఇంద్రారెడ్డి ఆదర్శాల సాధనకే రాజకీయాల్లోకి వచ్చా
  •       ఆయన హఠాన్మరణం తర్వాత మూడ్రోజులకే ఉప ఎన్నికల నోటిఫికేషన్  
  •       కష్టాల కడలి నుంచి రాజకీయరంగంలోకి ప్రవేశించా
  •       జనం సమస్యలే అజెండాగా ముందుకు సాగుతున్నా
  •       వైఎస్సార్ తన తోబుట్టువులా ఆదరించారు
  •       మనవరాలే నా ప్రపంచం
  •       రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
  •   అమ్మమ్మ ఇంట్లోనే అక్షరాభ్యాసం
     నాన్న మహిపాల్‌రెడ్డి, అమ్మ వెంకటమ్మ. పుట్టినిల్లు తాండూరు మండలం కోటబాస్పల్లి కంటే అమ్మమ్మ ఊరు మెదక్ జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లితోనే అనుబం దం ఎక్కువ. రైతు కుటుంబమే అయినా నాన్న కాంట్రాక్టులు చేసేవారు. లారీలు కూడా ఉండేవి. ఇంటికి పెద్ద కూతురుని నేనే. నాతోపాటు చెల్లి సౌజన్య, తమ్ముడు నర్సింహారెడ్డి.  మేనమామ గోపాల్‌రెడ్డికి సంతానం లేకపోవడంతో చిన్నతనంలో వారింట్లోనే పెరిగా. అక్కడే అక్షరాభ్యాసం చేశా. ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం నన్ను తాండూరులోని మిషనరీ స్కూల్‌లో చేర్పించారు. అక్కడే థర్డ్ వరకు చదివా. కానీ నా మనస్సంతా అమ్మమ్మ ఇంటి చుట్టే తిరిగేది. ఇది గమనించిన నాన్న నన్ను మళ్లీ అమ్మమ్మ ఇంటికి పంపారు. 3 నుంచి 5వ తరగతి వరకు మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని మిషనరీ స్కూల్‌లో చదువుకున్నా. అక్క డే గది తీసుకొని మరీ విద్యాభ్యాసం కొనసాగించా. అక్కడి నుంచి మకాం మలక్‌పేటకు మార్చాం. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 5, 6 తరగతులు చదివిన తర్వాత.. చాదర్‌ఘాట్‌లోని భాగ్య మెమోరియల్ స్కూల్‌లో టెన్త్ పూర్తి చేశా.
     
     రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్..
     నారాయణగూడ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీలో చేరా. చదువులో యావరేజీ స్టూడెంట్‌నే.. తె లుసుకోవాలనే జిజ్ఞాస మాత్రం మెండుగా ఉండేది. అక్కడి నుంచి డిగ్రీ వనితా కాలేజీలో చేశా. డిగ్రీ ద్వితీయ సంవత్సరంలోనే నా వివాహం జరిగింది. దాంతో చదువుకు ఫుల్‌స్టాప్ పడింది.
     
     అలా కుదిరింది

     నా పెళ్లి విచిత్రంగా కుదిరింది. ఇంద్రారెడ్డిగారి బావ  శర్వారెడ్డి మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్. ఆయనతో నాకు మ్యాచ్ చూడమని నాన్న చెప్పారట. దాంతో సంబంధాలను వెతుకుతున్న శర్వారెడ్డి ఈ విషయాన్ని ఇంద్రారెడ్డి చెవిన వేశారట. ఆయన కూడా తన ఫ్రెండ్స్‌లో సరిజోడిని చూసే పని లో పడ్డారట. ఈ సమయంలో ఓ ఫ్రెండ్ అన్న మాట మా వివాహానికి దారితీసింది. ‘ఎవరినో చూడడం ఎందుకు ను వ్వే చేసుకోవచ్చు గదా’ అన్నారట. దీంతో ఈ విషయా న్ని చెప్పేందుకు కామన్ ఫ్రెండ్ ద్వారా నన్ను కలిశారు. అప్పటికే ప్రగతిశీల భావాలు కలిగిన నేతగా, ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపిన వ్యక్తిగా ఆయన గురించి విన్నా. అప్పుడు ‘లా’ సెకండ్ ఈయర్ చదువుతున్న ఇంద్రారెడ్డి తన ఇష్టాయిష్టాలను నాతో పంచుకున్నారు. ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామని... కష్టమైతే ఎవరి దారి వారిదేనని చెప్పారు. సమాజంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆయన పట్టుదల చూసి కాదనలేకపోయా. నా అభీష్టానికి పెద్దలు కూడా అంగీకరించారు. లా పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం.  ఈ రెండేళ్లలో ఆయన వ్యక్తిత్వాన్ని ఆర్థం చేసుకున్నా.
     
     డాషింగ్.. డేరింగ్
     11 మంది సభ్యులు గల ఆ ఇంటికి చిన్న కోడలుగా వెళ్లినా..పెద్దతరహా బాధ్యతలు నిర్వర్తించా. ఇంద్రారెడ్డిది ముక్కుసూటితనం. కోపం వచ్చినా... సంతోషం వచ్చినా తట్టుకునేవారు కాదు. కొన్నిసార్లు బయటి ఒత్తిళ్లను మాపై చూపేవారు. ఆ కోపం నీటి బుడగలాంటిదే. నిమిషం తర్వాత కూల్ అయ్యేవారు. ‘సారీ.. ఈ రోజు ఫలానా సంఘటన జరిగింది. ఆ కోపాన్ని మీ మీద చూపాను. ఏమీ అనుకోవద్దనేవారు. ఆయన మనసెరిగిన మేం కూడా సీరియస్‌గా తీసుకునేవాళ్లం కాదు.

    ఆయన మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి
     ఎదురుపడిన ప్రతివారికీ నమస్కారం పెడుతుంటే మా వారిని టీజ్ చేసేదాణ్ని. ముక్కూ మొహం తెలియని వారిందరికీ దండాలు పెట్టడమేమిటీ? ఇదేం ఖర్మ అనే దానిని. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ‘రాజకీయాల్లో ఉన్న మజా అనుభవిస్తేనే తెలుస్తుంది. పేదోళ్ల దీవెనలు పొందడం కన్న జీవితంలో ఇంతకంటే తృప్తేం ఉంటుంది’ అనేవారు. అదీ నా మనస్సులో ఇప్పటికీ మెదులుతూ ఉంటుంది.
     
     ఆ పద్నాలుగు రోజులు
     మావారి హఠాన్మరణం నన్ను కుంగదీసింది. ఆయన చనిపోయిన మూడోరోజే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. ఇది మరింత బాధించింది. 14 రోజుల వ్యవధిలో రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి రావడం మనోవేదనకు గురిచేసింది. ఒకవైపు అంతులేని విషాదం.. మరోవైపు ఏ పార్టీలో చేరాలనే మీమాంసతో తీవ్ర మానసిక వ్యధను అనుభవించా. టీడీపీ తరపున దేవేందర్, హరీశ్వర్‌రెడ్డి తదితరులు పరామర్శకు వచ్చి... ఏ నిర్ణయమైనా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకో అమ్మా. మీకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ మరుసటి రోజు వచ్చిన అప్పటి సీఎల్‌పీ నేత వైఎస్సార్ ‘నా కుడిభుజం విరిగింది. తక్కువ సమయంలోనే ఇంద్రారెడ్డితో ఎక్కువ అనుబంధం ఏర్పడింది. నువ్వు మాతో ఉం టే చెల్లెలుగా చూసుకుంటా.అన్నగా అడుగుతున్నా. నిర్ణ యం నీదే’నని అన్నారు. రాజకీయ ప్రవేశాన్ని తొలుత నా ఇష్టానికే వదిలేసిన సమీప బంధువులు చివ రకు నిర్ణయా న్ని మార్చుకున్నారు. టీడీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో మా అత్తయ్య నాకు సపోర్ట్‌గా నిలిచారు.
     
     పిల్లలను కూడా అడిగా..
     రాజకీయ ప్రవేశంపై పిల్లల అభిప్రాయం కూడా తీసుకున్నా. అప్పటివరకూ గహిణి బాధ్యతల్లో ఉన్న నేను.. రాజకీయాల్లోకి వెళితే పిల్లల బాగోగులు పట్టించుకునేదెవరని.. వారి మనోగతాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నా. అత్తయ్య, నాన్న, అమ్మను కూర్చోబెట్టి పిల్లలు కార్తీక్, కౌశిక్, కళ్యాణ్‌లతో మాట్లాడా. వారి అంతరంగాన్ని తెలుసుకున్నాకే నామినేషన్ వేశా.
     
     అన్నలా ఆదరించారు
     వైఎస్ నన్ను తోబుట్టువులా ఆదరించారు. ‘చేవెళ్ల చెల్లెమ్మ.. సబితమ్మా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఏ కార్యక్రమమైనా చేవెళ్ల నుంచే మొదలుపెట్టేవారు. ఆయనతోనే నాకు ఈ గుర్తింపు, ప్రాధాన్యత లభించాయి. అడిగిన పనిని కాదనకుండా చేసి నా పెద్దన్నలా వ్యవహరించేవారు. అందుకే ప్రతి రక్షాబంధన్‌కూ నా తమ్ముడితోపాటు వైఎస్‌కూ రాఖీ కట్టేదాణ్ని.  
     
     మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నా
     వైఎస్ మరణంతో శూన్యం ఆవహించినట్లయింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కూడా నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో శాంతిభద్రతలు కాపాడే అంశంపై మానసిక ఒత్తిడి అనుభవించా. తెలంగాణ కోసం పోరాడిన భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమాన్ని నిలువరించలేక.. శాంతి భద్రతలను అదుపు తప్పకుండా చూడాల్సిన పరిస్థితుల్లో అంతులేని మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నా.
     
     అంతా విధిరాత..
     నేనొక్క పల్లెటూరు అమ్మాయిని. నేనేంటి.. మంత్రి పదవిని చేపట్టడమేమిటి అని ఊహించుకుంటే విధి వింత నాటకమేనని అనిపిస్తుంది. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు కూడా ఒత్తిడికి లోనయ్యా. రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ సర్వసాధారణమేనని సర్దుకుపోతున్నా.
     
     పాపను పెంచుకున్నాం..
     మాకు కూతురు లేకపోవడంతో మేనమామ కుమార్తెను పెంచుకున్నాం. చిన్నప్పుడు నన్ను సాకిన మేనమామ కుమార్తె మనీషాను కూతురులా చూసుకోవడమేగాకుండా పెళ్లి చేసి ఆయనతో రుణం తీర్చుకున్నా. ఈ విషయంలో మావారి గొప్ప హృదయానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.  అసెంబ్లీ రికార్డుల్లో తనపై ఆధారపడినవారి జాబితాలో మనీషాను కూతురుగా నమోదు చేయడం ఆయన ఉదార మనస్తత్వానికి నిదర్శనం.
     
     సినిమాలు బాగా చూసేదాణ్ని
     కాలేజీ రోజుల నుంచి సినిమాలకు తెగ వెళ్లేదాణ్ని. రాజకీయాల్లోకి రాకముందే సినిమాలు, పాటలతోనే కాలక్షే పం. ఎప్పుడైతే రాజకీయాల్లో బిజీ అయ్యానో సినిమాలకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రత్యేకంగా అభిమాన నటులంటూ ఎవరూ లేకపోయినా.. మంచి సినిమాలను వీక్షించేదాణ్ని. షాపిం గ్‌కు కూడా దూరమయ్యా. కిచెన్ వైపు కూడా వెళ్లలేదు. రా త్రిపూట డిన్నర్ మాత్రం కుటుంబసభ్యులమంతా కలిసే చేస్తాం.
     
     సందడే సందడి
     ముగ్గురు కుమారులు కార్తీక్,  కౌశిక్, కళ్యాణ్. కోడలు స్రవంతి, మనవరాలు అక్షయని. 30 ఏళ్ల తర్వాత మనవరాలి రూపంలో మా ఇంట్లోకి ఆడ పిల్ల  రావడం మా కుటుంబంలో సంతోషాన్ని నింపింది. 15 నెలల అక్షయని చేసే అల్లరిచేష్టలు అన్నీఇన్నీ కావు.
     
     సంతోషం కలిగింది
     చేవెళ్లలో విత్తనాల కోసం ధర్నా చేసిన రైతులపై  పోలీసులు ఫైరింగ్ జరపడంతో కౌకుంట్లకు చెందిన ఓ రైతు చనిపోయారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ను అభ్యర్థించాను. ఎప్పుడో చనిపోయిన కుటుంబానికి భూమి ఎందుకు అని ప్రశ్నించకుండా..తన తొలి పర్యటనలోనే భూ పంపిణీ చేశారు. ఇది నాకు అత్యంత సంతోషాన్ని కలిగించిన సంఘటన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement