ఆదేశాలు కరువు: తెలంగాణ ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా? | Department Of Education To Direct Online Teaching In Public Schools | Sakshi
Sakshi News home page

Schools Reopen In Telangana: ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలు కరువు.. ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా?

Published Tue, Aug 31 2021 2:59 AM | Last Updated on Tue, Aug 31 2021 8:09 AM

Department Of Education To Direct Online Teaching In Public Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ప్రత్యక్ష బోధన చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలిచ్చిన విద్యాశాఖ, ప్రైవేటు స్కూళ్ల విషయంలో ఈ సాహసం చేయలేకపోతోంది. సెప్టెంబర్‌ ఒకటి నుంచి అంతా ప్రత్యక్ష తరగతులే ఉంటాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా, మార్గదర్శకాలేవీ ఇప్పటివరకూ జారీ కాలేదని, అలాంటప్పుడు ప్రైవేటు స్కూళ్లను ఆఫ్‌లైన్‌ పెట్టాలని తామెలా కట్టడి చేయగలమని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యక్ష విద్యాబోధనపై విద్యామంత్రి సోమవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కోవిడ్‌ నిబంధనల అమలుపై జరుగుతున్న కసరత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే స్కూళ్లలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్లాసులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రోజు విడిచి రోజుగానీ, సెక్షన్లు పెంచిగానీ విద్యాబోధన చేయబోతున్నట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. క్లాసురూంలో ఎక్కువమందికి కోవిడ్‌ నిర్ధారణ అయితే తాత్కాలికంగా స్కూల్‌ నిర్వహణ ఆపి, పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే పునఃప్రారంభించాలని పేర్కొన్నట్టు తెలిసింది. 

ప్రైవేటు రూటే వేరు.. 
ప్రైవేటు స్కూళ్ల గురించిన పలు విషయాలను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రైవేటు స్కూళ్లు ఇప్పటికే సగానికిపైగా సిలబస్‌ పూర్తిచేశాయని, కార్పొరేట్‌ స్కూళ్లు చాలావరకూ ఫీజులు వసూలు చేశాయని, దీంతో ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్‌లైన్‌ విధానం కొనసాగుతుందని అవి చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్‌లోనూ ఆఫ్‌లైన్‌ మాత్రమే ఉండాలన్న కచ్చిత నిబంధన పెడితే బాగుంటుందని అధికారులు మంత్రికి తెలిపినట్టు సమాచారం.

దీనిపై మంత్రి స్పందించలేదని తెలిసింది. ఓ వారంపాటు ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌లో బోధన చేసినా పెద్దగా పట్టించుకోవద్దన్న అభిప్రా యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లలో ఆఫ్‌లైన్‌ కచ్చితమని చెప్పి, ప్రైవేటు స్కూళ్లకు వెసులుబాటు ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు.  

కాలేజీ విద్యార్థులకు వ్యాక్సిన్‌ ధ్రువీకరణ 
ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులు టీకా వేయించుకున్నట్టు ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని నిర్ణ యించారు. హాస్టల్‌ విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలు చేయించి ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. హాజరుశాతం తప్పనిసరి అనే నిబంధన ఉండబోదని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి పేర్కొన్నారు. విద్యాసంస్థలు మొదలైన వారం తర్వాతే వాస్తవ పరిస్థితిని అంచనా వేయవచ్చని మంత్రి, విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, క్లాసు రూంల శుభ్రతపై పారిశుధ్య కార్మికులు విముఖత వ్యక్తం చేస్తున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 

కాగా, కోవిడ్‌ నిబంధనలకు లోబడి సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లను ప్రారంభించేలా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని విద్యా శాఖ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో  పేర్కొంది. జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షిస్తూ నివేదికలు పంపాలని పేర్కొంది. సామాజిక దూ రం పాటించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరింది.   

తల్లిదండ్రుల మనోభావాలకే ప్రాధాన్యం : సబిత  
విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం వివరాలను ఆమె మీడియాకు వివరిస్తూ, రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ నిబంధనల అమలులో అలసత్వాన్ని ప్రభుత్వం సహించబోదన్నారు. పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్‌ పూర్తి చేసేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లు వెంటనే సమీపంలోని పీహెచ్సీకి తీసుకువెళ్లి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కోవిడ్‌ నిర్ధారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సందీప్‌ సుల్తానియా, దేవసేన తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement