సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోలాహలం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సర్కారు బడులు కొత్త విద్యార్థుల చేరికతో సందడిగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోయి అడ్మిషన్లు ఇవ్వలేమని చెప్పేదాకా వెళ్లిపోయాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు–మన బడి’తో ప్రైవేటుకు దీటుగా మెరుగుపర్చడంతోనే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా కొత్త విద్యార్థులు చేరారని అంటున్నాయి. బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తే.. భారీగా అడ్మిషన్లు అవుతాయని పేర్కొంటున్నాయి.
30 వేల పాఠశాలలు.. 30లక్షల విద్యార్థులు
రాష్ట్రంలో 30వేల వరకు ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వాటి పరిధిలో 30 లక్షల మంది చదువుతున్నారు. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు మినహాయిస్తే.. 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 23.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఏటా 25 శాతం పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా రూ.12 వేల కోట్లు కేటాయించింది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు కూడా మొదలయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు.
పలుచోట్ల ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గత పదిహేను రోజుల్లో ఏకంగా 1,50,826 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వేర్వేరు తరగతుల్లో ప్రవేశాలు పొందారు. అంటే రోజుకు సగటున 10వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లెక్క.
అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని.. ఇందులో కనీసం నెల రోజుల పాటు రోజూ పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు కొనసాగే అవకాశం ఉందని విద్యా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విధానాన్ని ఇంటర్, డిగ్రీ స్థాయిల్లోనూ అమలు చేస్తే.. పదో తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదవుతున్న ప్రవేశాల్లో అత్యధికం పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. రెండేళ్లుగా కోవిడ్–19 ప్రభావంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజులను అడ్డగోలుగా పెంచేశాయి. ఆ భారం మోయలేని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు పిల్లలను ఆంగ్ల మాధ్యమం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు.
► ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు జీవనోపాధి కోసం ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో.. నగర శివార్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చేరికలు ఉంటున్నాయి. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిలతోపాటు హన్మకొండ, సిద్దిపేట, ఇతర జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు జిల్లాల్లోనూ గణనీయంగానే అడ్మిషన్లు ఉంటున్నాయి.
► సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ ఈ మధ్య నిర్వహించిన సర్వేలో కరోనా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణమైందని.. చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తేల్చింది. తమ పిల్లలను మంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపించలేని స్థితికి జారిపోయాయని తమ నివేదికలో పేర్కొంది కూడా.
ఇంగ్లిష్ మీడియం కలిసి వస్తోంది
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం కలిసి వస్తున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెరగడం, కోవిడ్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడా కారణమే. ఉపాధ్యాయుల కొరత తీర్చడం, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిస్తే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతాయి.
– చావా రవి, టీఎస్‌టీయుఎఫ్ ప్రధాన కార్యదర్శి
స్కూళ్లు నిండిపోతున్నాయి
రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే విద్యార్థులు ఎక్కువైపోయి.. నో అడ్మిషన్స్ బోర్డులు పెడుతున్నారు. రాబోయే కాలంలో అలాంటి స్కూళ్లు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మన ఊరు–మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల తల్లితండ్రులు ఆకర్షితులవుతున్నారు.
– రాజ భాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు
తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను స్వాగతిస్తున్నాం. తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరగడమే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం. ప్రైవేటు ఫీజుల భారం కూడా దీనికి కారణమవుతోంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడితే బాగుంటుంది.
– జి.సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు
జోరుగా అడ్మిషన్లు
► తెలంగాణ ఏర్పాటు నుంచి ఏటా సగటున లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుంటారు. అదికూడా జూన్ రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు కూడా అడ్మిషన్లు జరుగుతుంటాయి.
► ఈసారి అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈ లెక్కన మొత్తంగా అడ్మిషన్లు ముగిసే నాటికి మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల మంది వరకు కొత్తగా చేరే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు– మన బడి’తో సదుపాయాల కల్పనే దీనికి కారణమని చెప్తున్నారు.
► ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధి వేగంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కూడా దీనికి కారణమని అంచనా.
► ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు పెంచడం, కరోనాతో కుటుంబాల ఆదాయం తగ్గడం వల్ల కూడా.. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు తరలడానికి కారణం అని విద్యా రంగ నిపుణులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment