వానాకాలం చదువులు! | Standards falling in private schools | Sakshi
Sakshi News home page

వానాకాలం చదువులు!

Published Thu, Jan 17 2019 2:16 AM | Last Updated on Thu, Jan 17 2019 2:16 AM

Standards falling in private schools - Sakshi

రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో తల్లిదండ్రులు అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. వారంతా వాటిల్లోనే విద్యను కొనసాగించట్లేదు. పై తరగతులకు వెళ్తున్న కొద్దీ క్రమంగా ప్రైవేటు పాఠశాలలకు దూరం అవుతున్నారు. కొంతమంది పూర్తిగా బడి మానేస్తున్నారు. ప్రమాణాల్లోనూ ప్రైవేటు పాఠశాలలు వెనుకబడిపోతున్నాయి. 2018లో ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థులు 54.4 శాతం మంది ఉంటే, 8వ తరగతి విద్యార్థులు 24.7 శాతమే ఉన్నారు. 2010లో 44 శాతమే 2వ తరగతి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరితే ప్రస్తుతం వారి సంఖ్య అదనంగా 10 శాతానికిపైగా పెరిగింది. 2010లో 8వ తరగతి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో 29 శాతం ఉంటే ఇప్పుడు 24.7 శాతానికి తగ్గింది. కాగా, పదాలు, వ్యాక్యాలు చదవగలిగే విద్యార్థుల సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (అసర్‌) వెల్లడిం చింది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రమాణాలు ఎక్కువగా పడిపోయినట్లు తేల్చింది. తీసివేతలు, గుణకారం చేయగలిగే విద్యార్థుల సంఖ్య 2016 సంవత్సరంతో పోల్చితే 2018లో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే పడిపోయింది.    
– సాక్షి, హైదరాబాద్‌

దేశవ్యాప్త సర్వే.. 
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సర్వే నిర్వహించిన ప్రథమ్‌ సంస్థ తమ నివేదికను (అసర్‌–2018) మంగళవారం ఢిల్లీలో విడుదల చేసింది. 596 జిల్లాల్లోని 3 నుంచి 16 ఏళ్ల వయసున్న 5,46,527 మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది. 2007తో పోలిస్తే బడిలో చేరని పిల్లల సంఖ్య 3 శాతం తగ్గింది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే బడిలో ఉన్న పిల్లల్లో ప్రమాణాలు 2.8 శాతం పడిపోయినట్లు పేర్కొంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. 5వ తరగతి చదివే విద్యార్థుల్లో 2వ తర గతి స్థాయి పాఠ్యాంశాలు చదవగలిగే విద్యార్థులు 2016లో 47.1 శాతం ఉంటే 2018 నాటికి అది 43.6 శాతానికి పడిపోయింది. 8వ తరగతి విద్యార్థుల్లో 2వ తరగతి స్థాయి పాఠ్యాం శాలు చదవగలిగే విద్యార్థులు 2016 సంవత్సరంలో 76.1%  ఉంటే 2018 నాటికి అది 69.5 శాతానికి పడిపోయింది. 

ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి.. 
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణా ల స్థాయి 2016 కంటే ఇప్పుడు మరింత తగ్గిపోయాయి. 2012లో 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం చదవగలిగిన 8వ తరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో 83.6%  ఉండగా వారి సంఖ్య 2018లో 63.1 శాతానికి పడిపోయింది. ఇదీ జాతీయ సగటు 73%  కంటే తక్కువ. ప్రైవేటు పాఠశాలల్లో 92.2 శాతం నుంచి 88.9 శాతానికి తగ్గిపోయింది. 

1–9 నంబర్లను గుర్తించలేని వారు ఎక్కువే.. 
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో నంబర్లను గుర్తించలేని విద్యార్థులు ఎక్కువే ఉన్నారు. 1 నుంచి 9 లోపు సంఖ్యలను గుర్తించలేని విద్యార్థులు 1వ తరగతిలో 20 శాతం మంది ఉంటే రెండో తరగతిలో 9.2 శాతం మంది ఉన్నారు. మూడో తరగతిలో 4.9 శాతం మంది, 4వ తరగతిలో 3.3 శాతం మంది, 5వ తరగతిలో 1.8 శాతం, 6వ తరగతిలో 1.6 శాతం, 7వ తరగతిలో 2.7 శాతం, 8వ తరగతిలో 1.1 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. 

వారు ప్రైవేటులోనే అధికం.. 
మూడో తరగతిలో తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగింది. అదీ ప్రైవేటు పాఠశాలల్లో వాటిని చేయగలిగిన వారి సంఖ్య భారీగా తగ్గింది. 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 42.2 శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 34.5 శాతానికి పడిపోయింది. తీసివేతలు చేయగలిగిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 2016లో 30.7 శాతం ఉంటే 2018లో 30.6 శాతం ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా ప్రైవేటు పాఠశాలల్లోనే 54.6 శాతం నుంచి 38.9 శాతానికి పడిపోయింది. గుణకారం చేయగలిగిన విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4 శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 27.3 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 26 శాతం నుంచి 26.7 శాతానికి పెరగ్గా, ప్రైవేటు పాఠశాలల్లో 37.6 శాతం నుంచి 28 శాతానికి తగ్గిపోయింది. 8వ తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థులు 2016లో 54.9 శాతం ఉంటే ఇపుడు 48.7 శాతానికి తగ్గిపోయారు. 8వ తరగతిలో మాత్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రమాణాలు పడిపోయాయి. 2016లో 8వ తరగతి విద్యార్థుల్లో 51.4 శాతం మంది లెక్కలు చేయగలిగిన వారు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 43 శాతానికి పడిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement