విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న భూపతి
పళ్లిపట్టు (తమిళనాడు): ప్రైవేటు పాఠశాలల దాటికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న క్రమంలో.. ఉన్న కొద్ది పాఠశాలలనైనా కాపాడుకోవాలని, ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషను విద్యార్థులకు అందజేయాలని తమిళనాడులోని ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం చేశాడు.
బడిలో చేరిన పిల్లలకు సొంత డబ్బులతో బంగారు కానుక ఇవ్వాలని నిర్ణయించాడు. పళ్లిపట్టు మండలంలోని వడకుప్పం తెలుగువారు ఎక్కువగా ఉన్న గ్రామం. ఈ గ్రామంలో ప్రభుత్వ తెలుగు ప్రాథమిక పాఠశాల ఉంది. 20 మందికి పైగా ఇక్కడ చదువుతున్నారు. ప్రస్తుతం ఆంగ్లంపై మక్కువతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అనేక తెలుగు పాఠశాలలు మూతపడిన క్రమంలో ఉన్న బడినైనా కాపాడుకోవాలనే ఆశయంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి కృషి చేస్తున్నారు.
గ్రాము బంగారం: వడకుప్పం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పిల్లలను చేర్పిస్తే గ్రాము బంగారు కాయిన్ బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment