నాన్నే లేనప్పుడు.. మేమెందుకు?
- తల్లీ కుమారుని ఆత్మహత్య
- ‘సివిల్స్’ లక్ష్యం నెరవేరకుండానే కుమారుని మృతి
కమలాపురం: ఇంటిపెద్ద లేని బతుకు వృథా అని భావించిన ఓ తల్లీ, కుమారుడు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నారు. ఈ విషాద సంఘటన వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన చావలి ప్రసాద్‌రెడ్డి అనారోగ్యంతో గత ఏప్రిల్ పదిన కన్నుమూశారు. ఆయన మరణాన్ని భార్య గౌరి(45), కుమారుడు ఇంద్రారెడ్డి తట్టుకోలేకపోయారు. మానసికంగా కుంగిపోయారు. జీవితంపై విరక్తి చెందారు. జీవితం చాలించాలని నిర్ణయానికి వచ్చారు. సోమవారం రాత్రి తమ నివాసంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చన్న భావంతో ఇరుగుపొరుగున ఉన్నవారు మంగళవారం అంతగా పట్టించుకోలేదు. బుధవారం సైతం ఇంటి నుంచి అలికిడి లేకపోవడంతో అనుమానమొచ్చి తలుపు తట్టారు. అయితే తలుపు తెరిచే ఉండడంతో లోనికి వెళ్లి చూడగా.. తల్లీ, కుమారుడు శవాలుగా పడి ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు వారి బంధువులకు, పోలీసులకు తెలియజేశారు. ఎర్రగుంట్ల సీఐ శ్రీనువాసులరెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్ రఫీ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో.. వారు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వైవీయూలో పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న ఇంద్రారెడ్డి సివిల్స్ మెయిన్స్ రెండుసార్లు అటెంప్ట్ చేయడం విశేషం. ఐఏఎస్ సాధించడం తన లక్ష్యమని పలువురితో చెప్పేవాడు. అయితే తండ్రి మరణం అతన్ని కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా పురికొల్పింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంద్రారెడ్డి అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.