Indian Grandmaster
-
సింగపూర్‌లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్, క్యాండిడేట్స్ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు స్వదేశంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా), చాలెంజర్ గుకేశ్ మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు లభించాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ పోటీపడ్డాయి. బిడ్లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీతో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్‌ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్ ఫార్మాట్లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆనంద్ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు. -
‘సడన్‌డెత్’లో హారిక విజయం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో నిహాల్ సరీన్, విదిత్ సంతోష్ గుజరాతి నాలుగో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మూడో రౌండ్ టైబ్రేక్ పోటీల్లో హారిక 5.5–4.5తో లెలా జవఖి‹Ùవిలి (జార్జియా)పై... నిహాల్ 2.5–1.5తో డేనియల్ బొగ్డాన్ (రొమేనియా)పై... విదిత్ 5–4తో మథియాస్ బ్లూ»ౌమ్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఆదివారం రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో హారిక–లెలా మధ్య విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. వీరిద్దరు ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు ర్యాపిడ్ గేమ్‌లు ఆడారు. రెండూ ‘డ్రా’గా ముగియడంతో 2–2తో సమంగా నిలిచారు. దాంతో 10 నిమిషాలు నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు. ఇందులో చెరో గేమ్‌లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. అనంతరం 5 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు ఆడించగా...రెండూ ‘డ్రా’ కావడంతో స్కోరు 4–4తో నిలిచింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆఖరుగా 3 నిమిషాల నిడివిగల ‘సడన్‌డెత్’ గేమ్‌లు మొదలయ్యాయి. ‘సడన్‌డెత్’లో ‘డ్రా’ అయితే విజేత తేలేవరకు గేమ్‌లు నిర్వహిస్తారు, గెలిస్తే మాత్రం వెంటనే ముగిస్తారు. ఇందులో హారిక, లెలా తొలి గేమ్ ‘డ్రా’కాగా... రెండో గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో నెగ్గి నాలుగో రౌండ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
Meltwater Champions Tour Finals: అర్జున్ ఖాతాలో తొలి విజయం
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ 3–1తో షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. తొలి గేమ్‌ను 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, రెండో గేమ్‌లో 58 ఎత్తుల్లో నెగ్గాడు. మూడో గేమ్‌ను 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన అర్జున్ చివరిదైన నాలుగో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద టోర్నీలో తొలి ఓటమి చవిచూశాడు. ప్రజ్ఞానంద 1–2తో వెస్లీ సో (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఎనిమిది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో, అర్జున్ మూడు పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద మరో సంచలన విజయం.. ఈసారి ఎనిమిదో ర్యాంకర్‌పై..!
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)ను ఓడించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద... రెండో రౌండ్లో ఎనిమిదో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. నేపాల్ సంతతికి చెందిన అనీశ్ గిరితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్ ప్రజ్ఞానంద 2.5–1.5తో నెగ్గాడు. తొలి మూడు గేమ్‌లు ‘డ్రా’ కాగా నాలుగో గేమ్‌లో ప్రజ్ఞానంద 81 ఎత్తుల్లో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్లు (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. రెండో రౌండ్ తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. -
Chess Olympiad: నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: హరికృష్ణ
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ తెలిపాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. గత నెలలో ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన 36 ఏళ్ల హరికృష్ణ తన కెరీర్లో పదోసారి చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘2000 నుంచి నేను చెస్ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్నాను. సుదీర్ఘకాలం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. సీనియర్ ప్లేయర్‌గా మెరుగ్గా రాణించాలనే బాధ్యత ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. ‘ఆతిథ్య దేశం హోదాలో భారత్ ఓపెన్ విభాగంలో మూడు, మహిళల విభాగంలో మూడు జట్లను బరిలోకి దించనుంది. ఇప్పటికైతే పతకాల గురించి ఆలోచించడంలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తే పతకాలు వాటంతట అవే వస్తాయి’ అని ప్రపంచ 25వ ర్యాంకర్ హరికృష్ణ అన్నాడు. -
చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు
చెస్ వరల్డ్ చాంపియన్.. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి షాక్ ఇచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద.. కార్ల్సన్తో తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కార్ల్సెన్ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు. ఇది ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో కార్ల్‌సన్‌కు చెక్ పెట్టిన ప్రజ్ఞా మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్‌సన్‌పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్ స్టేజ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్‌గా చెస్బుల్ మాస్టర్స్‌లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్సన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్సెన్ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదవండి: ప్రపంచ నం.1 ఆటగాడికి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు Magnus Carlsen blunders and Praggnanandhaa beats the World Champion again! https://t.co/J2cgFmhKbT #ChessChamps #ChessableMasters pic.twitter.com/mnvL1BbdVn — chess24.com (@chess24com) May 20, 2022 -
విజేత శశికిరణ్
చెన్నై: ఫాగర్నెస్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్యన్ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్ స్కోరుతో శశికిరణ్కు టైటిల్ దక్కింది. ఆర్యన్ చోప్రాకు రెండో ర్యాంక్ లభించింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్‌లో నిలిచాడు. -
హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: చెసేబుల్ మాస్టర్స్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు మిశ్రమ ఫలితాలు లభించాయి. టోర్నీ రెండో రోజు ఆదివారం హరికృష్ణ ఒక గేమ్‌ను ‘డ్రా’గా ముగించి, మరో గేమ్‌లో గెలిచాడు. తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ ఓడిపోయిన హరికృష్ణ నాలుగో రౌండ్ గేమ్‌లో హికారు నకముర (అమెరికా)తో 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 28 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్న గ్రూప్ ‘ఎ’లో హరికృష్ణ ఒకటిన్నర పాయింట్లతో చివరిస్థానంలో ఉన్నాడు. గ్రూప్ ‘బి’లో మరో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ గేమ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూపుల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. రెండో విడత గేమ్‌లు మిగిలి ఉండటంతో హరికృష్ణకు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. -
హరికృష్ణకు రెండో గెలుపు
మాస్కో గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయం నమోదు చేశాడు. నెపోమ్నియాచి (రష్యా)తో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో హరికృష్ణ 55 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత హరికృష్ణ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి.