యువ చెస్ క్రీడాకారుల్లో నూతనోత్తేజం
బాల్యం నుంచే రాణిస్తున్న చిన్నారులు
గుకేశ్ విజయంపై హర్షాతిరేకాలు
‘సాక్షి’తో అభిప్రాయాలను పంచుకున్న క్రీడాకారులు
సరదాగా స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు చేసే వయస్సులో చెస్‌లో జగజ్జేతగా నిలిచాడు. 18 సంవత్సరాల అతి పిన్న వయస్సులో కలలో కూడా ఊహించని చరిత్రను తిరగరాశాడు. భారత ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తి చేశాడు. కుర్రాడిగా పావులు కదుపుతూ సీనియర్ క్రీడాకారుడిని ఖంగుతినిపించి ప్రపంచ మేధావుల దృష్టిని ఆకర్శించాడు. అతనెవరో కాదు దొమ్మరాజు గుకేశ్. ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా.. చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్ గురించే చర్చ. ఈ నేపథ్యంలో గుకేశ్ ఆటలో ఎత్తుగడలు, విజయం సాధించిన తీరు, తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా చెస్ క్రీడాకారులు, క్రీడాభిమానుల మనోగతం ‘సాక్షి’ పాఠకుల కోసం.
ఆరేళ్లకు ఎలో రేటింగ్
రెండు సంవత్సరాలుగా చెస్ నేర్చుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన చెస్ టోర్నీలో ర్యాపిడో విభాగంలో దేశవ్యాప్తంగా 1,485వ ఎలో రేటింగ్ వచ్చింది. మా అమ్మనాన్న చాలా సంతోషపడ్డారు. ఈ రోజు పేపర్లలో గుకేశ్ ఫొటోలు చూపించి, అతని గురించి వివరిస్తుంటే.. నేను కూడా ప్రపంచ విజేత కావాలనే ఆకాంక్ష పెరిగింది. రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న దేవాన్ష్ రెడ్డి, ఆరేళ్ల వయస్సులోనే జాతీయ స్థాయి రేటింగ్ రావడం విశేషం.
–దేవాన్ష్ రెడ్డి, రాంనగర్
గుకేశ్ ఆటతీరు నచ్చింది
పదేళ్లుగా చెస్‌లో శిక్షణ పొందుతున్నాను. చాలా మంది గ్రాండ్ మాస్టర్ల ఆటను చూసేవాడిని. విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ టోర్నమెంట్లను చూశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్, గుకేశ్ స్టైల్ కళ్లు తిప్పుకోకుండా చేసింది. ఆయన ఆడిన టోర్నమెంట్ వీడియోలు చూసూ్తనే ఉన్నాను. ఆయన స్ఫూర్తితో ఉన్నతస్థాయి టోర్నమెంట్లలో విజేతగా నిలిచేందుకు శ్రమిస్తా.
– బి.విశ్వజిత్‌సాయి, హనుమకొండ
నేనే ఆడినట్లుగా టెన్షన్ పడ్డాను
ప్రపంచ స్థాయి వేదికగా గుకేశ్ ఆడుతుంటే నేనే అక్కడ కూర్చుని ఆడినట్లుగా టెన్షన్ పడ్డాను. ఆటముగిసే వరకు మా స్నేహితులం ప్రతిక్షణం ఆసక్తిగా వీక్షించాం. నాలుగు గంటలకు పైగా సాగిన ఆ ఆటలో గుకేశ్ విజయం సాధించడం నేను ఎన్నటికీ మరిచిపోలేను. గుకేశ్ ఆట తీరు, ఆయన ఆత్మవిశ్వాసం నాకెంతో స్ఫూర్తిని అందించాయి.
– సూర్యప్రతాప్‌కోటి, 8వ తరగతి, వరంగల్
అద్భుత విజయం
అతి చిన్న వయస్సులో గుకేశ్ ప్రపంచ విజేతగా నిలవడం అసాధారణ విషయం. మాలాంటి క్రీడాకారులకు స్ఫూర్తిని అందించాడు. విశ్వవిజేతగా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేశ్ సాధించిన విజయం మాటల్లో చెప్పలేని అద్భుతం. గుకేశ్ ఆట తీరును చాలా సార్లు దగ్గరి నుంచి చూశాను. ప్రపంచ రికార్డు సమయంలో ఆడిన ఆట అందుకు భిన్నంగా ఉంది. వేసే ప్రతి అడుగు ప్రత్యర్థిని ఇరుకున పెట్టేలా ఉంది. గుకేశ్ ఆత్మవిశ్వాసం, ఆట తీరు నాలో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలను నింపాయి.
– వేల్పుల సరయు, మొండ్రాయి, వరంగల్, అంతర్జాతీయ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment