సాక్షి, హైదరాబాద్: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయాన్ని అందుకున్నాడు. సెర్బియా గ్రాండ్‌మాస్టర్ అలెక్సీ సరానాతో గురువారం చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో 21 ఏళ్ల అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ర్యాంకింగ్స్‌లో 2805.8 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానా 2805 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.
2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన భారత ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. లైవ్ రేటింగ్స్ అనేవి ప్రతి టోర్నీలో రౌండ్ రౌండ్‌కూ మారుతుంటాయి.
ప్రతి నెలా ఒకటో తేదీన ‘ఫిడే’ ప్రచురించే అధికారిక ర్యాంకింగ్స్‌నే ప్లేయర్ తుది ర్యాంక్‌గా పరిగణిస్తారు. గత నెలలో సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ఐదో రౌండ్ తర్వాత లైవ్ రేటింగ్స్‌లో అర్జున్ తొలిసారి 2800 పాయింట్లను అందుకున్నాడు.
ఈ ఘనత సాధించిన 16వ చెస్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే అదే టోర్నీలోని ఆరో రౌండ్‌లో, ఏడో రౌండ్‌లో అర్జున్ తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అతని లైవ్ రేటింగ్ 2800లోపు వచ్చింది.
నవంబర్ 1న ‘ఫిడే’ అధికారికంగా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2799 రేటింగ్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌గా ఉన్నాడు. చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలోని మిగిలిన నాలుగు రౌండ్లలో అర్జున్ రాణిస్తే డిసెంబర్ 1న విడుదలయ్యే తదుపరి ర్యాంకింగ్స్ లో అధికారికంగా 2800 రేటింగ్ పాయింట్లతో మూడు లేదా రెండో ర్యాంక్‌లో నిలుస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment