fide rating
-
Arjun Erigaisi: ప్రపంచ రెండో ర్యాంకర్‌గా..
సాక్షి, హైదరాబాద్: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయాన్ని అందుకున్నాడు. సెర్బియా గ్రాండ్‌మాస్టర్ అలెక్సీ సరానాతో గురువారం చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో 21 ఏళ్ల అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ర్యాంకింగ్స్‌లో 2805.8 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానా 2805 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన భారత ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. లైవ్ రేటింగ్స్ అనేవి ప్రతి టోర్నీలో రౌండ్ రౌండ్‌కూ మారుతుంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ‘ఫిడే’ ప్రచురించే అధికారిక ర్యాంకింగ్స్‌నే ప్లేయర్ తుది ర్యాంక్‌గా పరిగణిస్తారు. గత నెలలో సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ఐదో రౌండ్ తర్వాత లైవ్ రేటింగ్స్‌లో అర్జున్ తొలిసారి 2800 పాయింట్లను అందుకున్నాడు.ఈ ఘనత సాధించిన 16వ చెస్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే అదే టోర్నీలోని ఆరో రౌండ్లో, ఏడో రౌండ్లో అర్జున్ తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అతని లైవ్ రేటింగ్ 2800లోపు వచ్చింది. నవంబర్ 1న ‘ఫిడే’ అధికారికంగా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2799 రేటింగ్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌గా ఉన్నాడు. చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలోని మిగిలిన నాలుగు రౌండ్లలో అర్జున్ రాణిస్తే డిసెంబర్ 1న విడుదలయ్యే తదుపరి ర్యాంకింగ్స్ లో అధికారికంగా 2800 రేటింగ్ పాయింట్లతో మూడు లేదా రెండో ర్యాంక్‌లో నిలుస్తాడు. -
సంచలన విజయం.. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర
చెన్నై చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనందన్‌ను దాటుకుని మరీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా.. చైనాకు చెందిన లిరెన్‌తో బుధవారం జరిగిన పోటీ సందర్భంగా ప్రజ్ఞానంద ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నంబర్ 1 ప్రజ్ఞానంద ప్రస్తుత ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద ఖాతాలో 2748.3 పాయింట్లు ఉండగా.. విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో 2748 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించిన ప్రజ్ఞానంద వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో భారతీయ క్రీడాకారుడిగా రికార్డు అంతేకాదు.. లిరెన్‌పై విజయం సాధించడం ద్వారా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్‌లో వరల్డ్ చాంపియన్‌ను ఓడించిన భారత రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్ చాంపియన్‌పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు. అదానీ, సచిన్ ప్రశంసలు కాగా భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రశ్రేణి వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరులు ఎక్స్ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ‘‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ కితాబులిచ్చారు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
చాంపియన్ సాయి బస్వంత్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో సాయి బస్వంత్ సత్తా చాటాడు. నాచారంలోని శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 10 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో సాయి బస్వంత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. షేక్ ఫయాజ్, సురేశ్ చెరో 8 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఫయాజ్ రన్నరప్‌గా నిలిచాడు. సోమవారం జరిగిన చివరి రౌండ్లో సాయి బస్వంత్ (9) అనురాగ్ కురువాడ (7)పై, షేక్ ఫయాజ్ (8) ఎస్.ఖాన్ (7.5)పై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ టి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన సాయి బశ్వంత్‌కు రూ. 20,000 ప్రైజ్‌మనీ లభించగా, ఫయాజ్‌కు రూ.15,000, సురేశ్‌కు రూ. 10,000 ప్రైజ్‌మనీగా అందింది. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి, హెచ్‌డీసీఏ అధ్యక్షులు కేఎస్ ప్రసాద్, ఏఐసీఎఫ్ సభ్యుడు ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు. పదో రౌండ్ ఫలితాలు సురేశ్ (8) నిఖిల్ (7)పై, ఎస్కే భాషా (7.5) అరవింద్ (6.5)పై, శరత్ చంద్ర (7) ఉమేశ్ (6.5)పై గెలిచారు. సాయి అక్షయ్ (7.5), స్పందన్ (7.5)... నరసింహా రవీంద్ర (7.5), ధరణి శ్రీనివాస్ (7.5)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. -
చదరంగంలో చిచ్చరపిడుగులు
చెస్‌లో రాణిస్తున్న చిన్నారులు చిన్నతనం నుంచే ప్రత్యేక శిక్షణ మహబూబ్‌నగర్ క్రీడలు: చిన్నతనం నుంచే చిన్నారులు చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల సహకారం, కోచ్‌ల ప్రత్యేక శిక్షణతో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వరకే పరిమితమైన చదరంగం ఇప్పుడిప్పుడే జిల్లాలకు విస్తరిస్తోంది. రాష్ట్రస్థాయి టోర్నీలు ఎక్కడ జరిగినా తమ పిల్లలు పాల్గొనేలా వారి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చెస్‌లో అమోఘం ప్రతిభ కనబరుస్తున్న కొంతమంది చిన్నారులు ఫిడే రేటింగ్‌ను సాధించి, ముందుకు సాగుతున్నారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి చెస్ టోర్నీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు.. ఎనిమిదేళ్లకే స్టాలిన్‌కు ఫిడే రేటింగ్ నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎనిమిదేళ్ల స్టాలిన్ చిన్నవయస్సులోనే 1100 ఫిడే (వరల్డ్ చెస్ ఫెడరేషన్) రేటింగ్ సాధించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నీలో ఐదుగురు అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులతో తలపడి ఫిడే రేటింగ్ పొందాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిడే సాధించిన చెస్ క్రీడాకారుల్లో స్టాలిన్ అత్యంత చిన్నవాడు కావడం విశేషం. జాతీయస్థాయిలో గతేడాది చెన్నైలో జరిగిన చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. రాష్ట్రస్థాయిలో గతేడాది హైదరాబాద్‌లో గురుకుల ఆణిముత్యం లయ జడ్చర్ల సాంఘిక గురుకులం స్కూల్‌కు చెందిన లయ చెస్‌లో దూసుకెళుతోంది. మూడేళ్ల నుంచి చెస్‌లో శిక్షణ తీసుకుంటోంది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి గురుకుల స్పోర్ట్స్ మీట్లో చెస్‌లో చాంపియన్‌షిప్‌ను సాధించింది. గత నెల 7న జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి టోర్నీలో మహిళ విభాగంలో విజేతగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. చెస్‌లో మెరుగైన ప్రదర్శించి త్వరలోనే ఫిడే రేటింగ్ సాధిస్తానని లయ దీమా వ్యక్తం చేస్తోంది. తొలిసారి రాష్ట్రస్థాయి టోర్నీకి.. మెదక్‌కు చెందిన కౌషిక్ తొలిసారి రాష్ట్రస్థాయి అండర్–17 చెస్ టోర్నీలో పాల్గొంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రెండేళ్ల నుంచి చెస్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చెస్ ఆడుతానని, భవిష్యత్‌లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదుగుతానన అంటున్నాడు కౌషిక్. గ్రాండ్ మాస్టరే ధ్యేయంగా.. ప్రణవ్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రణవ్ చెస్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. రెండుసార్లు ఇంటర్నేషల్ ఫిడే రేటింగ్ పాల్గొని సత్తాచాటాడు. ప్రస్తుతం 1189 ఫిడే రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. రెండుసార్లు అండర్–13స్థాయిల్లో విజేతగా నిలిచిన ప్రణవ్ భవిష్యత్‌లో గ్రాండ్‌మాస్టర్ అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎస్జీఎఫ్ చెస్ విజేత భానుమహేష్ నల్లగొండ జిల్లాకు చెందిన భానుమహేష్ గతేడాది అండర్–17 ఎస్జీఎఫ్ చెస్‌లో విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు ఐదుసార్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాల్గొన్న ఇతను చెస్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతో చెస్‌లో రాణిస్తున్నానని, ఫిడే రేటింగ్ సాధించడమే ధ్యేయంగా ఆడుతున్నట్లు తెలిపాడు.