సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించాడు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు.
చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఇందులో 43 మంది గ్రాండ్‌మాస్టర్లు, 35 మంది అంతర్జాతీయ మాస్టర్లు, ఏడుగురు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, ముగ్గురు మహిళా అంతర్జాతీయ మాస్టర్లు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment