grandmaster
-
కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద ‘చెక్’
స్టావెంజర్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. గతంలో చెస్‌లోని మూడు ఫార్మాట్లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్) ఏకకాలంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద సంచలన విజయం నమోదు చేశాడు.కార్ల్సన్ సొంతగడ్డలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నీ పురుషుల విభాగం మూడో రౌండ్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ అద్భుతం చేశాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చాడు. గతంలో ఆన్లైన్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో కార్ల్‌సన్‌పై భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్ గెలిచినా... క్లాసికల్ ఫార్మాట్లో మాత్రం ప్రజ్ఞానంద తొలిసారి కార్ల్‌సన్‌ను ఓడించాడు. టైమ్ లిమిట్ ఉండని క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్ ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ అయ్యాక అతడిని ఓడించిన రెండో భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. అంతకుముందు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు. వైశాలి, హంపి గెలుపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. మూడో రౌండ్లో వైశాలితోపాటు భారత స్టార్ కోనేరు హంపి కూడా అర్మగెడాన్ గేమ్‌లలో గెలిచారు. క్లాసికల్ ఫార్మాట్లో వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 50 ఎత్తుల్లో... హంపి–లె టింగ్లీ (చైనా) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌లు నిర్వహించగా... హంపి తెల్లపావులతో ఆడి 49 ఎత్తుల్లో లె టింగ్లీపై నెగ్గగా... అనా ముజిచుక్‌తో నల్ల పావులతో ఆడిన వైశాలి 70 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. అర్మగెడాన్ నిబంధనల ప్రకారం నల్లపావులతో ‘డ్రా’ చేసుకున్న ప్లేయర్‌ను విజేతగా ఖరారు చేస్తారు. -
భారత నంబర్‌వన్‌గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్‌గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత కొత్త నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్‌వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్‌లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్ కుర్రాడు అశ్వథ్ కౌశిక్ (8 ఏళ్ల 6 నెలల 11 రోజులు) రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన బర్గ్డార్ఫర్ స్టాడస్ ఓపెన్ టోర్నీ నాలుగో రౌండ్లో అశ్వథ్ 45 ఎత్తుల్లో పోలాండ్‌కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ జేసెక్ స్టోపాపై గెలిచాడు. ఈ క్రమంలో లియోనిడ్ (సెర్బియా; 8 ఏళ్ల 11 నెలల 7 రోజులు) పేరిట ఉన్న రికార్డును అశ్వథ్ బద్దలు కొట్టాడు. -
ఆలగడప బాలుడు.. భారత గ్రాండ్‌మాస్టర్
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల ప్రణీత్ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ సాధించాడు. భారతదేశం నుంచి ఈ గణత సాధించిన 82వ ఆటగాడిగా ప్రణీత్ నిలిచాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం నుంచి 5వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు ఎలో రేటింగ్ పాయింట్లు 2500 దాటాలి. అయితే అజర్బైజాన్లో జరిగిన బకూ ఓపెన్‌లో టోర్నీలో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గ్రాండ్‌మాస్టర్ హోదాకు కావాల్సిన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించిన ప్రణీత్ 15 ఏళ్ల వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఉమ్మడి జిల్లా నుంచి తొలిసారి గ్రాండ్‌మాస్టర్ ఘనత సాధించిన ప్రణీత్‌కు పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు, ఆలగడప గ్రామస్తులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసచారి, ధఽనలక్ష్మి దంపతుల కుమారుడు ప్రణీత్. శ్రీనివాసచారి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీఓ)గా, ధనలక్ష్మి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కొనేళ్లు క్రితం వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆలగడపలో వీరికి సొంత ఇల్లు, భూ ములు ఉన్నాయి. ప్రతి పండుగకు, శుభకార్యాలకు, సెలవుల్లో స్వగ్రామానికి వస్తుంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణీత్ చెస్‌లో రాణిస్తున్నాడు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చినా.. కుమారుడి కెరీర్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో వారు ఫ్లాట్‌ను సైతం విక్రయించి ప్రణీత్ చెస్‌లో రాణించేందుకు అండగా నిలిచారు. విదేశాల్లో టోర్నీల శిక్షణ కోసం ఎంతో ఖర్చు పెడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఓటమి ఎదురై ప్రణీత్‌కు నిరాశ కలిగినా.. పట్టుదలతో విజయాల వైపు సాగిపోయాడు. 2021 వరకు రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్, ప్రస్తుతం ఇజ్రాయిల్‌కు చెందిన కోచ్ విక్టర్ మెకలెవిస్కి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రణీత్ సాధించిన విజయాలు ► అండర్–7లో రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచాడు. ► 2015లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ జీఎం టోర్నీలో 220 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి ఒకే ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పాయింట్లు గెలిచిన ఆటగాడిగా జాతీయ రికార్డు సృష్టించాడు. ► అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. ► 2018లో అండర్–11లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు. ► 2021లో అండర్–14 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ► ఆసియా దేశాల ఆన్లైన్ చెస్ టోర్నీలో స్వర్ణం సాధించాడు. ఎంతో సంతోషంగా ఉంది చెస్‌ను ఆన్లైన్లో ఆడడం కంటే, నేరుగా బోర్డుపై ఆడడానికే ప్రాధాన్యమిస్తా. బిల్జ్, ర్యాపిడ్ కంటే క్లాసికల్ విభాగం అంటేనే నాకిష్టం. బలమైన ప్రత్యర్థిపై గెలుపుతో పాటు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కింది. గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐదున్నరేళ్ల వయస్సులోనే చెస్ ఆడటం మొదలెట్టా. చిన్నప్పుడు టెన్నీస్ ఆడేవాడిని. ఈతలోను ప్రవేశం ఉంది కానీ ఓ రోజు నాన్న చెస్ ఆడతుండగా చూసి ఆసక్తి కలిగింది. నా ఇష్టాన్ని గమనించి అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. కార్ల్‌సన్‌ను ఆరాధిస్తా. ఇక నా రేటింగ్‌ను 2800కు పెంచుకునేందుకు కృషి చేస్తున్నా. ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఒలింపిక్‌లో దేశానికి పతకం అందించడమే నా లక్ష్యం. – ఉప్పల ప్రణీత్, గ్రాండ్ మాస్టర్ -
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ జైత్రయాత్ర
అల్మాటీ (కజకిస్తాన్): తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్సన్తో తలపడిన అర్జున్ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్ కార్ల్సన్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నాలుగు గేముల్లో అర్జున్... సరాసి డెరిమ్ (కొసొవో), రౌనక్ (భారత్), వహప్ సనల్ (టర్కీ), రిచర్డ్ రపొర్ట్ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు. మహిళల ఈవెంట్లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్ హంపి ఎన్క్తూల్ అల్తాన్ (మంగోలియా), మరియమ్ (ఆర్మేనియా), గోంగ్ క్విన్యున్ (సింగపూర్)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. -
అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించాడు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఇందులో 43 మంది గ్రాండ్‌మాస్టర్లు, 35 మంది అంతర్జాతీయ మాస్టర్లు, ఏడుగురు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, ముగ్గురు మహిళా అంతర్జాతీయ మాస్టర్లు ఉండటం విశేషం. -
‘గ్రాండ్‌మాస్టర్’ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ప్రతి చెస్ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రితి్వక్ అందుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వెజెర్కెప్జో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్లో 17 ఏళ్ల రాజా రితి్వక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటాడు. బుడాపెస్ట్‌లోనే గత వారం జరిగిన టోరీ్నలో రితి్వక్ విజేతగా నిలిచి మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. అయితే అప్పటికి అతని ఎలో రేటింగ్ 2496గా ఉండటంతో గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారు కాలేదు. ఈనెల 15న మొదలైన వెజెర్కెప్జో టోర్నీలో 2496 ఎలో రేటింగ్‌తో బరిలోకి దిగిన రితి్వక్ నాలుగో రౌండ్లో ఫినెక్ వచ్లావ్ (చెక్ రిపబ్లిక్)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో అతని ఖాతాలో ఐదు ఎలో పాయింట్లు చేరి రేటింగ్ 2501కు చేరింది. ఫలితంగా ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లను సాధించిన రితి్వక్ జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 రేటింగ్‌ను కూడా అందుకోవడంతో భారత్ తరఫున 70వ గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా రిత్విక్ ఆరేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడయ్యాడు. రితి్వక్ తండ్రి ఆర్.శ్రీనివాసరావు యూనివర్సిటీ స్థాయిలో చెస్ ఆడారు. తొలుత వరంగల్‌లో స్థానిక కోచ్ బొల్లం సంపత్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్ ఆ తర్వాత హైదరాబాద్‌లోని కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని భవాన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు. పతకాల పంట... 2012లో కామన్వెల్త్ చాంపియన్íÙప్లో అండర్–8 విభాగంలో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రితి్వక్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్ టోరీ్నలో.. 2018లో ఆసియా యూత్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2017 జూన్‌లో జాతీయ అండర్–13 చాంపియ న్íÙప్లో చాంపియన్‌గా అవతరించిన రిత్విక్ అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన జాతీయ అండర్–17 చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా రితి్వక్ ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజ తాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్‌తో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను. 2600 ఎలో రేటింగ్ అందుకోవడమే నా తదుపరి లక్ష్యం. భవిష్యత్‌లో ఏనాటికైనా వరల్డ్ చాంపియన్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. –రాజా రిత్విక్ తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్ అయిన మూడో ప్లేయర్ రిత్విక్. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్ ఈ ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్ రిత్విక్. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు, కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. -
స్వదేశీ కోచ్‌లపై కేంద్రం చిన్నచూపు
చెన్నై: దేశవాళీ కోచ్‌ల విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) మాజీ చీఫ్ సెలక్టర్, గ్రాండ్‌మాస్టర్ ఆర్బీ రమేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు అందించే క్రీడాకారులను తయారుచేసినప్పటికీ జాతీయ అవార్డుల విషయంలో స్వదేశీ కోచ్‌లను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ప్రస్తుతం చెస్‌లో అద్భుతాలు చేస్తోన్న ఆర్. ప్రజ్ఞానంద, వైశాలి, జాతీయ చాంపియన్ అరవింద్ చిదంబరం, కార్తికేయన్ మురళీ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన రమేశ్... భారత కోచ్‌ల జీతాల విషయంలోనూ కేంద్రం తీరును విమర్శించారు. ‘భారత కోచ్‌లు కేంద్రం అందించే అవార్డుల గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. 15 ఏళ్లలో భారత్. 34 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ పతకాలు, 40 ఆసియా యూత్, 5 ఆసియా సీనియర్, 23 కామన్వెల్త్ పతకాలు, చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం సాధించింది. కానీ కేంద్రం నుంచి లభించిన అవార్డులు సున్నా. అసలు క్రీడా పాలసీ అనేది ఉందా? భారత జట్టు చెస్ కోచ్‌కు ఒక్క రోజుకు లభించే జీతమెంతో ఎవరూ ఊహించలేరు. చెప్పినా నమ్మరు కూడా! కానీ విదేశీ కోచ్‌లకు 10 రెట్లు అధికంగా చెల్లింపులు ఉంటాయి’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
భారత చెస్ 66వ గ్రాండ్‌మాస్టర్ ఆకాశ్
చెన్నై: భారత చెస్‌లో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల జి.ఆకాశ్ భారత్ తరఫున 66వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) కౌన్సిల్ సమావేశంలో ఆకాశ్‌కు అధికారికంగా జీఎం హోదా ఖరారు చేశారు. 2012లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆకాశ్ 2014లో ఇంజినీరింగ్ విద్య కోసం చెస్ నుంచి నాలుగేళ్లపాటు విరామం తీసుకున్నాడు. 2018లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెస్‌లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం 2495 ఎలో రేటింగ్ కలిగిన ఆకాశ్ నాలుగు జీఎం నార్మ్‌లను సంపాదించి గ్రాండ్‌మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. ‘భారత్ నుంచి జీఎం జాబితాలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకం. మున్ముందు మరింత కష్టపడి నా ఎలో రేటింగ్‌ను 2600కు పెంచుకుంటాను’ అని ఆకాశ్ అన్నాడు. -
విజేత ఉషెనినా
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ చాంపియన్‌షిప్ తొలి అంచె టోర్నీలో ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అనా ఉషెనినా విజేతగా నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఉషెనినా 7–4తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఉషెనినాకు 12 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 3 వేల డాలర్ల (రూ. 2 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున హంపి, వైశాలి బరిలోకి దిగారు. -
జీఎం టైటిల్‌కు చేరువలో హర్ష
ఇస్తాంబుల్ (టర్కీ): గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా ఖరారు చేసుకోవడానికి తెలంగాణ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి మరింత చేరువయ్యాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు దక్కించుకున్న హర్ష ఎలో రేటింగ్ 2500 లేకపోవడంతో జీఎం టైటిల్ ఇంకా లభించలేదు. శనివారం ముగిసిన ప్రపంచ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్ష ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 7.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు గేముల్లో గెలిచిన అతను, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్లతో ఆడిన హర్ష... అలెన్ పిచోట్ (అర్జెంటీనా), సునీల్‌దత్ లైనా నారాయణన్ (భారత్), లియాంగ్ అవండర్ (అమెరికా)లపై గెలుపొంది... అలెగ్జాండర్ డాన్‌చెంకో (జర్మనీ)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పర్హామ్ మగ్సూద్లు (ఇరాన్), ఆమిన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఓవరాల్‌గా ఈ ప్రదర్శనతో హర్ష 18 పాయింట్లు సంపాదించి తన ఓవరాల్ ఎలో రేటింగ్‌ను 2492కు పెంచుకున్నాడు. తదుపరి టోర్నీల్లో హర్ష మరో ఎనిమిది పాయింట్లు సాధిస్తే అతనికి అధికారికంగా జీఎం టైటిల్ ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత్‌కే చెందిన అభిమన్యు పురాణిక్ రజత పతకం సాధించాడు. 8.5 పాయింట్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన పర్హామ్ మగ్సూద్లు 9.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. -
హారికకు పదో స్థానం
ఖాంటీమన్సిస్క్ (రష్యా): ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పదో స్థానంలో నిలిచింది. 34 మంది క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఈ పోటీల్లో నిర్ణీత 30 రౌండ్లు ముగిశాక హారిక 16.5 పాయింట్లు సాధించింది. చివరిరోజు సోమవారం హారిక ఒక్క గేమ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 23 పాయింట్లు సాధించిన అనా ముజిచుక్ (స్లొవేనియా) విజేతగా నిలిచింది. నానా జాగ్నిజ్దె (జార్జియా-20.5 పాయింట్లు) రజతం... తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా-20 పాయింట్లు) కాంస్యం గెలిచారు.