ఎనిమిదేళ్లకే రెండు ప్రపంచ టైటిల్స్ సాధించిన తెలంగాణ చిన్నారి దివిత్ రెడ్డి
ర్యాపిడ్, క్లాసికల్ ఫార్మాట్‌లలో విశ్వవిజేతగా నిలిచిన ఘనత
పిన్న వయసు గ్రాండ్‌మాస్టర్ హోదా దిశగా అడుగులు
మాటలు రాకముందే ఆటల వైపు ఆకర్షితుడైన ఆ చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు... మెదడుకు పదును పెంచేందుకు పజిల్స్‌ను పరిచయం చేశారు. సులభమైన పజిల్స్‌ను పక్కన పెట్టిన ఆ బుడ్డోడు... సంక్లిష్టత పెరుగుతున్నకొద్దీ వాటిని ఆస్వాదించడం ప్రారంభించాడు. కుమారుడి ఉత్సాహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడికి చదరంగాన్ని పరిచయం చేయగా... అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగాడు.
ఆరేళ్ల వయసులోనే భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్‌లాంటి మేటి స్టార్స్‌ను తన ప్రతిభతో కట్టిపడేసిన ఆ బుడతడు... ఎనిమిదేళ్ల వయసులోనే క్యాడెట్ విభాగంలో అండర్–8 ప్రపంచ ర్యాపిడ్, క్లాసికల్ ఫార్మాట్ చెస్ చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచి అబ్బురపరిచాడు. చదరంగంలో సంచలనాలు సృష్టిస్తున్న తెలంగాణ కుర్రాడు ఆదుళ్ల దివిత్ రెడ్డి ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
సాక్షి క్రీడావిభాగం
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆదుళ్ల దివిత్ రెడ్డి... చిన్నప్పటి నుంచే చదరంగంలో చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ క్యాడెట్స్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–8 ఓపెన్ కేటగిరీలో విజేగా నిలిచిన దివిత్ రెడ్డి.. అంతకుముందు వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే 1784 ఎలో రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న దివిత్ రెడ్డి... భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాడు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశితో తలపడి తన ఎత్తులతో ఆకట్టుకున్న దివిత్ వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం డింగ్ లిరెన్ (చైనా)తో పోటీ పడుతున్న గుకేశ్... ‘ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు. ఇతడి ఎత్తులకు ఆశ్చర్యం కలుగుతోంది’ అని కితాబు ఇచ్చాడంటే దివిత్ ప్రతిభ ఎలాంటిదో ఊహించుకోవచ్చు.
తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను కూడా అలవోకగా ఓడిస్తున్న దివిత్... భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లైన తల్లిదండ్రులు పసిప్రాయం నుంచి దివిత్‌ను ప్రోత్సహించగా... వారి కృషికి తగ్గ ఫలితం దక్కినటైంది.
‘చిన్నప్పుడు దివిత్ పజిల్స్ నింపడాన్ని ఇష్టపడేవాడు. ఎంతో క్లిష్టమైన పజిల్స్ ఇచ్చినా సునాయాసంగా పూర్తి చేసేవాడు. దీంతో అతడిని స్థానికంగా ఒక పజిల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించాం. అక్కడ కూడా ప్రతిభ చాటుకున్నాడు. దీంతో ఆన్‌లైన్ చెస్ కోచింగ్ ప్రారంభించాం’ అని దివిత్ తండ్రి మహేశ్ రెడ్డి వెల్లడించారు.
విశాఖపట్నంకు చెందిన చెస్ కోచ్ పోలవరపు రామకృష్ణ శిక్షణలో మరింత రాటుదేలిన దివిత్... జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాడు. ఆరేళ్ల ప్రాయంలోనే దివిత్ అండర్–8 జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ‘నేను అతడిలో ప్రపంచ చాంపియన్‌ను చూశాను. ప్రోత్సహిస్తే ఫలితం ఉంటుందని ఆలోచించి... చదువుతో పాటు శిక్షణకు తగిన సమయం కేటాయించేలా చేశా. దీని కోసం నా భార్య ఉద్యోగాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో దివిత్‌కు చేదోడుగా నిలిచింది.
కోవిడ్–19 కారణంగా వచ్చిన లాక్‌డౌన్ ఒక విధంగా మాకు మేలు చేసింది. చిన్న వయసులోనే అతడి ఎత్తులు చాలా వ్యూహాత్మకంగా ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే వాళ్లు. దాన్నే కొనసాగిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. గ్యారీ కాస్పరోవ్ అంటే దివిత్‌కు చాలా ఇష్టం. కాస్పరోవ్ తరహాలోనే అటాకింగ్ ఆటను ఇష్టపడతాడు. దాదాపు ఓడిపోయే స్థితి నుంచి కూడా తిరిగి పుంజుకోవడం దివిత్‌కు బాగా అలవాటు’ అని మహేశ్ రెడ్డి వివరించారు.
ఈ ఏడాది 10 అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్న దివిత్ రెడ్డి సమీప భవిష్యత్తులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకోవడం ఖాయమే అని మహేశ్ అన్నారు. అమెరికాకు చెందిన భారత సంతతి కుర్రాడు అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలవగా... ఇప్పుడు ఆ రికార్డును దివిత్ బద్దలు కొడతాడని మహేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment