
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడిని కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

మరో ఘటనలో వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్‌కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉందని నిర్ధారించుకొని హయత్‌నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్‌నగర్‌లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్‌ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment