Nalgonda government hospital
-
Telangana: మొన్న బాలింత.. నిన్న పసికందు.. నేడు మరొకరు
సాక్షి, నల్గొండ: మొన్న బాలింత, నిన్న నాలుగు రోజుల పసికందు, నేడు మరో వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో మరణాలపై ఇటీవల డీఎంఈ రమేష్‌రెడ్డి విచారణ జరిపినా కూడా వైద్యుల తీరులో మార్పు కనిపించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తికి సకాలంలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందలేదని.. నల్లగొండ పట్టణానికి చెందిన కంది బుచ్చిరాములు (50) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది అతడిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించారు. నిమిషాల వ్యవధిలోనే బుచ్చిరాములు మృతిచెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. సకాలంలో వైద్యం అందకనే బుచ్చిరాములు మృతిచెందాడంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీనాథ్‌తో వాగ్వాదం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని డాక్టర్‌పై దాడిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధులు బహిష్కరించి డాక్టర్ల ఆందోళన సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నా తమపై రోగుల బంధువులు దాడి చేస్తున్నారంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనాథ్‌పై దాడి చేసిన ఓ వ్యక్తి అక్కడికి రాగా, పోలీసుల సమక్షంలోనే అతడిపై వైద్య సిబ్బంది ప్రతిదాడి చేశారు. అతడి వెంట ఉన్న మహిళలు కాళ్లు పట్టుకుంటామని వేడుకున్నా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిదాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం నీలగిరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనితారాణి, కోశాధికారి డాక్టర్ రమేష్, ఇతర వైద్యులు.. ఎస్పీ రెమా రాజేశ్వరిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. -
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే..
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం అంతా వారిష్టం. వారి కనుసన్నల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అండతో వారిద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలనలోనూ వారు జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లలోనూ వారిదే పైచేయి. సూపరింటెండెంట్ వారి చేతిలో కీలుబొమ్మలా మారడంతో లక్షల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ కొనుగోళ్లను వారికే నామినేషన్‌పై అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, నల్లగొండ: కంచే చేను మేసినట్లుగా ఉంది జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ వ్యవహారశైలి. ఆస్పత్రికి రోజూ ఇన్‌పేషంట్లుగా రెండుమూడొందల మంది, అవుట్పేషంట్లుగా ఐదారు వందల మంది వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండడంతో రోగులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తూ వైద్యులు, సిబ్బందిని నిత్యం సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన అధికారి వారందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులతో పాటు ఇతర ఉద్యోగులను చులకన భావంగా చూడడం వల్ల వారు మనకెందుకులే అన్న తీరుగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఉద్యోగులు అందించే సలహాలను, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని సమన్వయం చేయాల్సిన అధికారి వ్యవహారశైలిపైఅందరూ గుర్రుగా ఉన్నారని తెలిసింది. టెండర్లు పిలువకుండానే రూ.50 లక్షల సామగ్రి కొనుగోలు జీజీహెచ్‌లో రెండు నెలల క్రితం ఆపరేషన్ థియేటర్లో రూ.50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్తో పాటుగా ఏసీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వాటి కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే వారే కొన్ని సంస్థల పేరుతో టెండర్లు దాఖలు చేసినట్లు సృష్టించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టెండర్లు వచ్చేలా చేసి కొనుగోలు చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. నాణ్యత లేని పరికరాలు, ఏసీలను కొనుగోలు చేసి ఆస్పత్రి ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెపుతున్నాయి. మందుల కొనుగోలు విషయం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు వేధింపులు జీజీహెచ్‌లో పనిచేసే ఉద్యోగులపై సూపరింటెండెంట్ వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగిపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహిళా, పురుషులు అనే తేడా లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, ఇతర పదజాలాన్ని వాడడం వల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరడానికి పర్యవేక్షకుడిని ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
తండ్రితో కలిసి తల్లిని నరికి చంపాడు
నల్లగొండ క్రైం: ఓ కుటుంబంలో ఆస్తి వివాదం చిచ్చుపెట్టింది. తండ్రితో కలిసి ఓ కుమారుడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ (55), ఆమె భర్త గంగయ్య, కుమారుడు యాదగిరి సోమవారం రాత్రి ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో యాదమ్మ ‘అంతా నా ఇష్టం. నా సోదరుడు పొగాకు శ్రీను చెప్పినట్టే చేస్తా’నని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, కుమారుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో గంగయ్య, యాదగిరి కలిసి గొడ్డలితో యాదమ్మ తలపై వేటువేశారు. కొనఊపిరితో ఉన్న ఆమెను బంధువులు రాత్రి 11 గంటల సమయంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. వివాదానికి కారణమిదీ... సుంకరబోయిన గంగయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె కళావతిని యాదమ్మ తన సోదరుడైన అన్నెపర్తికి చెం దిన పొగాకు శ్రీనుకు ఇచ్చి వివాహం చేసింది. కుమారుడు యాదగిరికి వివాహం కాగా, అతని కుటుంబంలో శ్రీను కారణంగా వివాదాలు తలెత్తి భార్యాభర్తలు విడిపోయారు. యాదగిరికి మరోసారి వివాహ ప్రయత్నాలు చేస్తుండగా.. శ్రీను వాటిని చెడగొట్టేవాడు. దీంతోపాటు వ్యవసాయ భూమిలో వాటా కోసం శ్రీను కోర్టులో కేసు వేశాడు. తర్వాత వాటా కు అంగీకారం కుదరడంతో కేసు విరమించుకున్నాడు. నల్లగొండలో ఉన్న ప్లాట్‌ను యాదమ్మ తన పెద్ద కుమార్తె కుటుంబసభ్యులకు ఇచ్చింది. తర్వాత ఆమె భర్త వద్ద ఉండకుండా పెద్ద కుమార్తె అత్తగారితో కలసి ఉంటోంది. కుమారుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడ టం.. సోదరుడివైపే ఒత్తాసు పలుకుతుండటంతో కుటుంబం కలహాలు తలెత్తాయి. ఈక్రమంలో భూమిని అమ్మే విషయమై వివాదం చెలరేగడంతో భర్త, కుమారుడు కలిసి యాదమ్మను చంపేశారు. తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారని చిన్న కుమార్తె రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా మంజూరు చేసిన మెడికల్ కళా శాలలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళాశాల భవన ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులను పూర్తి చేసిన అధికారులు పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో 237 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాలలో 32 విభాగాలు.. మెడికల్ కళాశాలలో 32 విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో అటానమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, ఎఫ్ఎం, కమ్యూనిటీ మెడిసిన్, ఆర్‌హెచ్‌టీసీ, యూహెచ్‌టీసీ, సైకియాట్రి, పిడియాట్రిక్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఓపీటీహెచ్, ఓబీజీ, రేడియో డయాగ్నొస్టిస్, అనస్తీషియా, బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ రికార్డ్, సెంట్రల్‌లైబ్రరీ, మెడికల్ ఎడ్యుకేషన్,సెంట్రల్ ఫొటోగ్రఫిక్ కమ్ ఆడియో విజువల్, సీఎస్ఎస్డీ, లాండ్రీ, సెంట్రల్ వర్క్‌షాప్, హాస్పిటల్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్, ఈఎండీ, మార్చురి, ప్రిన్సిపాల్ ఆఫీస్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీసుల్లో పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులు భర్తీ చేయడానికి జీఎఎంఎస్ నం.77ను ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. దీనికి అవసరమైన అన్ని అనుమతులను ఆర్థికశాఖ నుంచి పొందింది. ఔట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయనున్న పోస్టులు ఔట్సోర్సింగ్ పద్ధతిని నియమించే పోస్టుల్లో ముఖ్యంగా డిసెక్షన్ ఆల్ అటెండెన్స్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెన్స్, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, రికార్డు కీపర్, ఆఫీస్ సబార్డినేట్, వ్యాన్ డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, స్టెనో టైపిస్ట్, డార్క్‌రూం అసిస్టెంట్స్, బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్స్, స్టోర్ కీపర్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్, బుక్ బేరర్, హెడ్ దోబీ, దోబీ, ప్యాకర్, కార్పెంటర్స్, బ్లాక్‌స్మిత్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్ ఫోర్మన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, ఏసీమెకానిక్, మాలి, మానిఫోల్డ్ సూపర్వైజర్, టెలిఫోన్ ఆపరేటర్స్, గ్యాస్ ఆపరేటర్స్, స్ట్రెచర్ బేరర్స్, రిసెప్షనిస్ట్ కం క్లర్క్, వార్డు బాయ్స్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి భర్తీకి త్వరలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు టెండర్లకు కాల్ ఫర్చేసి ఫోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పోస్టుల భర్తీకి జరిగే టెండర్లలో పాల్గొనడానికి అనేక ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. జూన్‌లో పోస్టుల భర్తీకి అవకాశం.. జూన్‌లో ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు మెడికల్ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభించే అవకాశం ఉండడంతో అంతకు ముందుగానే పోస్టులు భర్తీ చేయనున్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. -
ఆరుబయట నరకయాతన
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రాస్పత్రిలో రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించారు. కానీ రోగులవెంట వచ్చే సహాయకుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా నివారించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సకల సదుపాయాలతో 150 పడకల సామర్థ్యంగల ఎంసీహెచ్‌ను నిర్మించారు. రోజూ 300 నుంచి 500 వరకు గర్భిణులు ఓపి సేవలు పొందుతున్నారు. ప్రసవాల కోసం జిల్లా నలుమూలలనుంచి సమారు 100 నుంచి 150 మంది గర్భిణులు ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఇంతటి తాకిడి ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి రోగులవెంట వచ్చే సహాయకులకు కనీస సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సహాయకుల కోసం గతంలో తడకలతో షెడ్డును నిర్మించారు. ఆది కాస్త గాలికి కూలిపోవడంతో ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది. ఎంసీహెచ్‌లో గర్భిణుల సహాయం కోసం ఒక్కరిని మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. మిగిలిన వారంతా ఉదయం, రాత్రి పూట ఆరుబయట ఎండకు, చలికి ఇబ్బందులు పడాల్సిందే. కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతులు లేకపోవడం వలన నేలపై, బెంచీలపై నిద్రించాల్సి వస్తుందని పలువురు సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుబయటే ఎండకు కూర్చుని భోజనం చేయాల్సి వస్తుందని, కనీసం తాగడానికి తాగునీటి వసతి కూడా లేకపోవడంతో రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కోనుక్కుంటున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన నీటిట్యాంకు చిన్నది కావడంతో సహయకుల వాడకానికే సరిపోతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంసీహెచ్‌ను నిర్మించిన పాలకులకు కనీసం సహాయకుల కోసం విశ్రాంతి షెడ్డును నిర్మించాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే షెడ్డును నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. చలికి వణికి పోతున్నాం లోపల పడుకోనివ్వకపోవడంతో ఆరుబయటే నిద్రిస్తున్నాం. చలికి వణికిపోతున్నాం,. కనీసం ఉండడానికి షెడ్డు కూడా లేకపోవడం అన్యాయం. గర్భిణులకు సహాయంగా వచ్చిన వారు ఎక్కడ ఉండాలి. – పుల్లమ్మ, నార్కట్‌పల్లి తాగునీరు కొనాల్సి వస్తుంది కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం దారునం. రెండు లీటర్ల నీటిని రూ.5 చెల్లించి కొనుక్కుంటున్నాం. పడుకోవడానికి, కూర్చోవడానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – యాదమ్మ, రాములబండ -
నల్గొండలో దారుణం..చెట్టు కిందే గర్భిణీ ప్రసవం
-
వైద్యుల నిర్లక్ష్యం.. చెట్టు కిందే ప్రసవం
సాక్షి, నల్గొండ : నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఆస్పత్రి ఆవరణలోని చెట్టు కిందే ప్రసవించింది. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెంకు చెందిన ఓ గర్భిణీ రెండో కాన్పు కోసం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో రక్తం తెస్తే ట్రీట్మెంట్ చేస్తామని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో అప్పటికే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే చెట్టుకింద ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఆస్పత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైద్యులు తీరుకు నిరసనగా ఆమె బంధువువలు ఆందోళనకు దిగారు. దీంతో మహిళను ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. -
‘బాహుతల్లి’కి వందనం
♦ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత ♦ ‘సాక్షి’ కథనాన్ని అభినందించిన జేసీ సత్యనారాయణ ♦ రుషితకు జేసీ రూ. 20వేలు, మరో దాత రూ. ఐదువేల ఆర్థిక సాయం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరాతలంలోని ధన్వంతరుల కీర్తి ధన్యమయ్యేలా నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు అహర్నిశలు శ్రమించి కాపాడిన చిన్నారి రుషిత తల్లిదండ్రుల చెంతకు చేరింది. 4 నెలలుగా ఆసుపత్రి సిబ్బంది ఆలనా పాలనలో పెరిగి పెద్దదై 650 గ్రాముల నుంచి 1.60 కిలోలకు చేరిన ఈ చిన్నారి ఇప్పుడు తన ఇంటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ చేతులు మీదుగా ఆసుపత్రి వైద్యులు చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వైద్యుల సంరక్షణలో ప్రాణాలను పోసుకుని ఇప్పుడు స్వతంత్రంగా బతికే శక్తి కూడగట్టుకున్న చిన్నారి రుషితను చేతుల్లోకి తీసుకున్న క్షణం ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ చిన్నారిని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు చేసిన కృషిని, డాక్టర్. దామెర యాదయ్య బృందాన్ని అభినందించారు. చిన్నారి రుషిత 4 నెలల వీరోచిత ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రచురించిన ‘బాహుతల్లి’ కథనాన్ని ఆసక్తిగా చదివిన ఆయన ‘సాక్షి’కి అభినందనల వర్షం కురిపించారు. రుషితకు జేసీ.. తన వేతనం నుంచి రూ. 20 వేలు ఆర్థిక సాయంగా ప్రకటించారు. స్థానిక రైతు, మానవతా వాది చిలుక విద్యాసాగర్‌రెడ్డి కూడా చిన్నారికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చదివి పాపకు సాయం చేయాలని వచ్చానని, ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విరక్తి వైఖరి విడనాడాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ‘సాక్షి’ ప్రచురించిన కథనాన్ని ఆసుపత్రి ఆవరణలో ఉంచడంతో చిన్నారి బంధువులు, ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తిలకించి చిన్నారి గురించి, ఆమె మృత్యుంజయురాలు అయ్యేందుకు జరిపిన పోరాటం గురించి చర్చించుకోవడం కనిపించింది. ఆసుపత్రిని సందర్శించిన వీవీపీ కమిషనర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎన్ఐసీ) యూనిట్‌ను శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) కమిషనర్ వీణాకుమారి, ఫెసిలిటీ బేస్డ్ న్యూ బోర్న్ కేర్ (ఎఫ్బీఎన్సీ) ట్రైనింగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమాసింగ్లు కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్ఐసీలో అందుతున్న సేవలను, డాక్టర్. దామెర యాదయ్య నేతృత్వంలోని ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. -
బాహుతల్లి
ప్రభుత్వ ఆసుపత్రులంటే కొంతమందికి గౌరవం ఉండదు. అది వారి అనుభవాల నుంచి వచ్చిన విరక్తే... అంతేకాకుండా మీడియాలో తరచూ వచ్చే కథనాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని మసకబార్చాయి. ఈ జబ్బుకు నల్లగొండ డాక్టర్లు చికిత్స చేశారు. ఆ జిల్లాకే కీర్తిని తెచ్చారు. లాంగ్ లివ్ ద స్పిరిట్ ఆఫ్ నల్లగొండ! బాహువులు అంటే భుజాలు. అవి బలంగా ఉంటే ఎంత బాధ్యతనైనా మోయగలం. బాహువులు బలంగా ఉండడానికి కావలసింది కండలు కాదు... కమిట్మెంట్! నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి నిజంగా బాహుబలి. అసలైన బాహుతల్లి! ఆరున్నర నెలల గర్భిణికి హైబీపీ వచ్చింది. హుటాహుటిన ఆ ఊళ్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి వైద్యులు పాపను ఈలోకంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ చిన్నారి బరువెంతో తెలుసా? కేవలం 650 గ్రాములు. మనం వాడుకున్న సెల్‌ఫోన్ కంటే కొంచెం ఎక్కువ బరువు. అంతే. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే తమ వల్ల కాదు పొమ్మన్నారు అక్కడి వైద్యులు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్దామంటే లక్షల్లో ఖర్చు. అయినా బతుకుతుందన్న గ్యారంటీ లేదు. ఏమైతే అదవుతుందిలే! పాపను రక్షించుకునేందుకు తమ పరిధిలో ప్రయత్నిద్దామని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ పాప తల్లిదండ్రులు. ఆ పాప పేరు రుషిత. ఆ చిన్నారి తల్లి పేరు మమత, తండ్రి శంకర్. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరిక కొండారం వాళ్ల ఊరు. వాళ్ల ఆర్థిక స్థాయికి అక్కడి నుంచి పాపతో జిల్లా కేంద్రానికి రావడమే గగనం. హైదరాబాద్‌కు వెళ్లడమనే మాటే వాళ్లకు గగనకుసుమం. అందుకే గగన కుసుమాన్ని జిల్లా కేంద్రంలోనే పూయించారు అక్కడి డాక్టర్లు. దాంతో ఇప్పుడా సుమసౌరభాలు ఇప్పుడు నల్లగొండ నుంచి నలుదిక్కులకూ వ్యాపించాయి. త్వరగా లోకం చూసిన ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రభుత్వ వైద్యులు పడిన ప్రయాసతో వారి ప్రతిభ, అంకితభావం లోకానికి వెల్లడయ్యాయి. త్వరపడి జగతికి వచ్చిన చిన్నారిని రక్షించేందుకు... ఈ భూమి మీదనే ఉంచేందుకు... భూమ్యాకాశాలను ఏకం చేసేంతగా శ్రమించారు సర్కారీ వైద్యులు. వారు పడ్డ శ్రమ ధరాతలంలో ధన్వంతరుల కీర్తి ధన్యమయ్యేలా చేసింది. ప్రభుత్వ డాక్టర్ల పట్ల మరింత గౌరవం పెంపొందేలా చేసింది. రుషితను బతికించుకున్న వైద్యసిబ్బంది బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దామెర యాదయ్య తాము ఆ చిన్నారి ప్రాణాలను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఇలా వివరిస్తున్నారు. బిడ్డ ఉండే కాల వ్యవధి తొమ్మిది నెలలు. వారాల్లో చెప్పాలంటే 36 వారాలు. ఇలా పూర్తి కాలం కడుపులో ఉండి, ఆ తర్వాత ప్రసవం అయితే దాన్ని ఫుల్ టర్మ్ డెలివరీ అంటారు. కొందరిలో మమత లాంటి కారణాలతో ఈ లోపే ప్రసవం జరగవచ్చు. దాన్ని ‘ప్రీ మెచ్యూర్ డెలివరీ’ అనీ, ఈ బిడ్డలను ‘ప్రి మెచ్యూర్ బేబీస్’ అని అంటారు. సాధారణంగా పూర్తిగా నెలలు నిండాక పుట్టిన పిల్లలు... కనీసం 2,500 గ్రాముల బరువుకు కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. అలాకాకుండా 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను ‘లో బర్త్ వెయిట్ బేబీస్’ గా పరిగణిస్తారు. రుషిత పుట్టినప్పుడు బరువు కేవలం 650 గ్రాములు మాత్రమే. పైగా ఆ బిడ్డ కడుపులో ఉన్నది కేవలం ఆరున్నర నెలలు మాత్రమే. పాప బతుకుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే కన్నవాళ్లూ నమ్మకం పెట్టుకోలేదు. ఇక్కడే వదిలారు. మొదటి మూణ్ణాలుగు రోజులూ మేమూ సాధారణ చికిత్స మాత్రమే చేశాం. కానీ ఆ చికిత్సకే పాప అసాధారణంగా స్పందించింది. తన మనుగడను సుసాధ్యం చేసుకుంది. ఎంత కష్టం... మరెంత ప్రయాస... ఇలా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు ఆహారం తీసుకోవడం కష్టం. పైగా ఫార్ములా పాలు వాళ్లకు సరిపడవు. పుట్టిన పాపలకు చనుబాలకు మించిన ఆహారం లేదు. ఆ పిల్లను బతికించుకోడానికి డాక్టర్లుగా మేం ఎంతగా యాతన పడ్డామంటే... తోటి తల్లులు తమ బిడ్డకు పాలు పట్టాక మిగిలినవి సేకరించాం. ఉగ్గుతో ఓరిమితో పాలు పట్టాం. అలా రుషితకు ఎందరో తల్లులు కూరిమితో తమ చనుబాలిచ్చి ఆ చిన్నారి తనువు నిలిపారు. ఒకదశలో పాలు పట్టడం కష్టమైతే ఆమైనో ఆసిడ్స్, లిపిడ్స్ వంటివి అందించాం. శ్వాసకు ఇబ్బంది కాకుండా ఉండటం కోసం ఇంజక్షన్‌గా కెఫీన్. మొదట్లో తల్లి మమతకు నేరుగా చనుబాలివ్వడం సాధ్యపడలేదు. గోమాత నుంచి పితికినట్లుగా తల్లి నుంచి పాలు పిండి సేకరించాం. గొట్టాలతో కడుపులోకి పంపించాం. తొలుత ఎంత పాలుపట్టేవాళ్లమో తెలుసా? కేవలం 2 - 5 ఎం.ఎల్. మాత్రమే. క్రమంగా 15-20 ఎం.ఎల్. పాలను రెండుగంటలకోసారి, ఆ తర్వాత గంటకోసారి తాగే వరకు పాప పెరిగింది. కొద్దికొద్దిగా అలవాటు చేసి ఇప్పుడు తల్లిలో మురిపాలతో పాటు ముర్రుపాలూ ఊరేలా చేశాం. అవి బిడ్డకు అందేలా చూశాం. కంటిచూపునూ కాపాడారు... నెలలు నిండకుండానే పుట్టిన ఆ బిడ్డను కంటిపాపలా కాపాడుకునే సమయంలోనే బిడ్డ కంటికి ఏదో సమస్య ఉందని తెలిసింది. ఏమాత్రం ఆలసించినా రేపుమాపు ఆ బిడ్డకు చూపు కరవవుతుందని అర్థమైంది. కారణం... ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్న రెటీనా నరాలు. వాటితో పాటు పోటీగా పెరుగుతున్న మా టెన్షన్! మా దగ్గర ఉన్న డాక్టర కస్తూరి చందు పరీక్షలు చేసి పాపను పరిశీలించారు. అంతటి చిన్న బిడ్డను హైదరాబాద్‌కు తీసుకెళ్లే పరిస్థితి లేదు.తల్లి మమత పొత్తిళ్లలో చిన్నారి రుషిత దాంతో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి లేఖ రాశాం. అక్కడి డాక్టర్ సుభద్ర జలాలే తక్షణం స్పందించారు. మర్నాడు వచ్చేశారు. ఒక్కొక్క కంటికి రెండున్నర గంటల ఆపరేషన్. లేజర్‌తో మేజర్ చికిత్స. అలా పెద్ద డాక్టర్లనే పాప దగ్గరికి రప్పించాం. చికిత్స ఇప్పించాం. డాక్టర్ సుభద్ర పాపపై తన చూపు నిలిపారు. పాప చూపును నిలిపారు. ఇప్పుడా బిడ్డ తాను త్వరపడి వచ్చిన ఈ లోకాన్ని చూస్తోంది. అలా మేం ఆ పాపను చూస్తుంటే మాకు ఆనందం. కను కొనలలో, కనుల కొలనులలో నీరు నిలవనంత సంతోషం. ఆపరేషన్ గ్లౌజులే వాటర్‌బెడ్... మొదట్లో పాప అటూ ఇటూ కదిలేది కాదు... మరి ఎటూ కదలకపోతే పుండ్లు పడి పాపకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశ ం ఉంది. రోజూ స్పాంజ్ బాత్ చేయించినా పాపకు ఏమయినా అవుతుందా అనే భయం ఉండేది. అందుకే వాటర్‌బెడ్‌లో ఉంచాలనుకున్నాం. కానీ, ఈ వయసు పాపకు వాటర్బెడ్లుండవు. అందుకే ఆపరేషన్ చేసే గ్లౌజ్లలో నీళ్లు పోసి ఆ పాపకు వాటర్‌బెడ్ చేయించాం. ఆ నీళ్లు కదిలినప్పుడల్లా పాప అటూ ఇటూ కదిలేది. అభిమన్యుడికి పూర్తి వ్యతిరేకం ఈ పాప వాస్తవానికి ఏ పిల్లలయినా తల్లి గర్భంలో ఉన్నప్పుడే బాహ్య ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటారు. అది కూడా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటేనే జరుగుతుంది. అభిమన్యుడు అలాగే పద్మవ్యూహంలోనికి వెళ్లడం తెలుసుకున్నాడంటారు. కానీ, ఈ పాప అభిమన్యుడికి వ్యతిరేకం. ఆరున్నర నెలలకే బాహ్యప్రపంచంలోనికి రావడంతో పాపకు ఏమీ తెలియడం లేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సమయంలో మా ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఏ.వీ. శ్రీనివాసరావు అమెరికా వెళ్లినప్పుడు తెచ్చిన సౌండ్స్పా గుర్తుకు వచ్చింది. నల్లగొండ ఆసుపత్రిలో రుషితకు చికిత్స అందిస్తున్న డా.యాదయ్య ఆ పరికరాలను ఉపయోగించి చికిత్స చేయడాన్ని ‘డెవలప్మెంటల్ సపోర్టివ్ కేర్’ అంటారు. ఆ పరికరం ద్వారా పాపకు గాలి పీల్చినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది... వర్షం వస్తే ఎలా ఉంటుంది... సెలయేళ్లలో నీరు ఎలా పారుతుంది... సముద్రపు అలల శబ్దం ఎలా ఉంటుంది... రాత్రి పూట ఎలాంటి శబ్దం వ స్తుంది...ఉరుములు, మెరుపులు ఎలా ఉంటాయి..? ఇలా అన్ని రకాల శబ్దాలు వినిపించి ఆమెకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వినికిడి శక్తిని కలిగించాల్సి వచ్చింది. పిలిస్తే పలికింది... ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత మాకు ఈ పాపపై పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చింది. 80-90 రోజుల వరకు ఆ పాప మా మాట వినేది కాదు. ఆ తర్వాత మాత్రం పిలిస్తే పలికింది... అమ్మ వచ్చింది అటు చూడు అంటే చూసింది. ఇన్ని రోజులు తిరిగిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆ పాప బరువు 1.60 కిలోలు... ఇంకో విషయమేమిటంటే... పాప పుట్టినప్పుడు 650 గ్రాములుంటే... 15-20 రోజుల తర్వాత 520 గ్రాములకు చేరుకుంది. అక్కడి నుంచి ఇప్పుడు 1.60 కిలోలకు చేరింది. ఇప్పుడు పాప స్వతంత్రంగానే బతకగలదనే నమ్మకం వచ్చింది.పాపను కంటికి రెప్పలా చూసుకున్న ఆసుపత్రి సిబ్బంది స్పర్శ, వాసన, వినికిడి, రుచి, చూపు అనే ఐదు సెన్స్లను ఆమె పసిగడుతోంది. ఈ పాపను ఎంత స్పెషల్‌గా చూశామంటే... ఈమెకు షిఫ్ట్కో ప్రత్యేక సిస్టర్. వార్డు మొత్తానికి ఒక సిస్టర్ ఉంటే... ఈమెకు మాత్రమే ఓ సిస్టర్... అది కూడా షిఫ్ట్‌కు ఒకరు, రోజుకు ముగ్గురు.. అలా వైద్యులుగా మేము, ఆసుపత్రి సిబ్బంది, సిస్టర్లు, పరికరాలు, మా విజ్ఞానం, ఆధునిక సౌకర్యాలు, తెలివి, అవకాశాలు, పరిశ్రమ.. అన్నీ కలిపి ఈ పాపను బతికించాయి. ఈ రోజు అంటే శుక్రవారం ఉదయం (ఈనెల 29న) పాపను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నాం. థ్యాంక్స్ టు రుషిత... అన్నారు డాక్టర్ దామెర యాదయ్య ఆనంద బాష్పాలు నిండిన కళ్ళలో. ప్రీ టెర్మ్ బేబీస్... అపోహలు: ఇలా నెలలు పూర్తిగా నిండకముందే పుట్టిన పిల్లలు - పూర్తికాలం గర్భంలో ఉన్నవారితో పోలిస్తే కొంత మందకొడిగా ఉంటారనీ, అంతగా చురుగ్గా ఉండరనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఐన్‌స్టీన్, మార్క్‌టై్వన్, విన్స్టన్ చర్చిల్, పికాసో... వీళ్లంతా నెలలు నిండకముందే పుట్టారు. వాళ్ల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పాప సైతం ఏ ప్రతిభ చూపనుందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు నల్లగొండ డాక్టర్లు. - మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, నల్లగొండ. మన్నించగలరు : ఇవ్వాళ్ల రుషిత డిశ్చార్జ్ చేస్తున్న సందర్భంగా నల్లగొండ ఆసుపత్రి డాక్టర్లు వేడుక చేసుకుంటున్నారు. ఈ మహోన్నతమైన, ఆదర్శవంతమైన కార్యక్రమానికి సలాం చేస్తూ ఇవ్వాళ్ల ఫ్యాషన్ పేజీకి బదులు ఈ కథనం ప్రచురిస్తున్నాం. పాఠకులు దయ ఉంచి మన్నించగలరు. ఈ వేడుకలో పాలుపంచుకోగలరు.