నల్లగొండలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం అంతా వారిష్టం. వారి కనుసన్నల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అండతో వారిద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలనలోనూ వారు జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లలోనూ వారిదే పైచేయి. సూపరింటెండెంట్ వారి చేతిలో కీలుబొమ్మలా మారడంతో లక్షల రూపాయల విలువైన ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లను వారికే నామినేషన్‌పై అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, నల్లగొండ: కంచే చేను మేసినట్లుగా ఉంది జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ వ్యవహారశైలి. ఆస్పత్రికి రోజూ ఇన్‌పేషంట్లుగా రెండుమూడొందల మంది, అవుట్‌పేషంట్లుగా ఐదారు వందల మంది వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండడంతో రోగులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తూ వైద్యులు, సిబ్బందిని నిత్యం సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన అధికారి వారందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు.
దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులతో పాటు ఇతర ఉద్యోగులను చులకన భావంగా చూడడం వల్ల వారు మనకెందుకులే అన్న తీరుగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఉద్యోగులు అందించే సలహాలను, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని సమన్వయం చేయాల్సిన అధికారి వ్యవహారశైలిపైఅందరూ గుర్రుగా ఉన్నారని తెలిసింది.
టెండర్లు పిలువకుండానే రూ.50 లక్షల సామగ్రి కొనుగోలు
జీజీహెచ్‌లో రెండు నెలల క్రితం ఆపరేషన్ థియేటర్‌లో రూ.50 లక్షల విలువ చేసే ఎక్విప్‌మెంట్‌తో పాటుగా ఏసీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వాటి కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే వారే కొన్ని సంస్థల పేరుతో టెండర్లు దాఖలు చేసినట్లు సృష్టించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి టెండర్లు వచ్చేలా చేసి కొనుగోలు చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. నాణ్యత లేని పరికరాలు, ఏసీలను కొనుగోలు చేసి ఆస్పత్రి ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెపుతున్నాయి. మందుల కొనుగోలు విషయం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగులకు వేధింపులు
జీజీహెచ్‌లో పనిచేసే ఉద్యోగులపై సూపరింటెండెంట్ వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగిపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహిళా, పురుషులు అనే తేడా లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, ఇతర పదజాలాన్ని వాడడం వల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరడానికి పర్యవేక్షకుడిని ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment