out sourcing staff
-
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే..
వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం అంతా వారిష్టం. వారి కనుసన్నల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) కొనసాగుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అండతో వారిద్దరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాలనలోనూ వారు జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లలోనూ వారిదే పైచేయి. సూపరింటెండెంట్ వారి చేతిలో కీలుబొమ్మలా మారడంతో లక్షల రూపాయల విలువైన ఎక్విప్మెంట్ కొనుగోళ్లను వారికే నామినేషన్‌పై అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, నల్లగొండ: కంచే చేను మేసినట్లుగా ఉంది జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ వ్యవహారశైలి. ఆస్పత్రికి రోజూ ఇన్‌పేషంట్లుగా రెండుమూడొందల మంది, అవుట్పేషంట్లుగా ఐదారు వందల మంది వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండడంతో రోగులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తూ వైద్యులు, సిబ్బందిని నిత్యం సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన అధికారి వారందరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులతో పాటు ఇతర ఉద్యోగులను చులకన భావంగా చూడడం వల్ల వారు మనకెందుకులే అన్న తీరుగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఉద్యోగులు అందించే సలహాలను, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుని సమన్వయం చేయాల్సిన అధికారి వ్యవహారశైలిపైఅందరూ గుర్రుగా ఉన్నారని తెలిసింది. టెండర్లు పిలువకుండానే రూ.50 లక్షల సామగ్రి కొనుగోలు జీజీహెచ్‌లో రెండు నెలల క్రితం ఆపరేషన్ థియేటర్లో రూ.50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్తో పాటుగా ఏసీలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వాటి కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే వారే కొన్ని సంస్థల పేరుతో టెండర్లు దాఖలు చేసినట్లు సృష్టించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టెండర్లు వచ్చేలా చేసి కొనుగోలు చేసినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. నాణ్యత లేని పరికరాలు, ఏసీలను కొనుగోలు చేసి ఆస్పత్రి ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆస్పత్రి వర్గాలే బాహాటంగా చెపుతున్నాయి. మందుల కొనుగోలు విషయం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు వేధింపులు జీజీహెచ్‌లో పనిచేసే ఉద్యోగులపై సూపరింటెండెంట్ వేధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఒక ఉద్యోగిపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ఆందోళన చేసి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహిళా, పురుషులు అనే తేడా లేకుండా ఏకవచనంతో మాట్లాడడం, ఇతర పదజాలాన్ని వాడడం వల్ల మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరడానికి పర్యవేక్షకుడిని ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
ఇంత అణిచివేతనా!
పశ్చిమగోదావరి, చింతలపూడి: ప్రభుత్వం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను నిలువునా దగా చేస్తోంది. జీఓ 12ను జారీ చేయడం ద్వారా వారి హక్కులను హరించాలని చూస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఒకపక్క పనిభారం, మరో పక్క చాలీచాలని వేతనాలతో ఉద్యోగులుఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఉద్యోగ భద్రత కల్పించకుండా తాత్సారం చేస్తోంది. ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేసిన ప్రతి సారీ వారి కళ్లనీళ్లు తుడవడానికి అన్నట్లు ఒక జీఓ విడుదల చేసి ఉద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుపై భ్రమలు తొలగిపోయాయి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అటు ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చి ఆశలపల్లకిలో ఊరేగేలా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై పెట్టుకున్న భ్రమలు తొలగి పోయాయి. రాష్ట వ్యాప్తంగా 3 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 60 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 2.40 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి సుమారు 3 లక్షల మంది పని చేస్తున్నారు. ఇక జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 23 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే సుమారు 3వేల మందికి పైగా ఉన్నారు. వీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ రాత పరీక్ష ద్వారా 2003లో ఎంపికయ్యారు. వీరంతా తమ ఉద్యోగాల రెగ్యులైజేషన్ కోసం 15ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ 2015 మినిమం టైంస్కేలును ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేస్తూ విడుదల చేసిన జీఓ నంబర్ 12 సవరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 9వ పీఆర్సీ ప్రకారం కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ను వర్తింపచేస్తూ గత ప్రభుత్వం జీఓ నంబర్ 3ను జారీ చేసింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం జీఓ 12 ద్వారా ఆర్థిక శాఖ ఆమోదంతో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తింపజేయడం దుర్మార్గమైన చర్య అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ జీఓ వల్ల ఉద్యోగులకు ఉన్న హక్కును హరించడంతోపాటు 10,12 వేల మందికి మాత్రమే టైమ్ స్కేలు వర్తింప చేస్తామనడం రాష్ట్రంలోని 3 లక్షల మంది ఉద్యోగులను వంచించడమే అవుతుందని అంటున్నారు. 2005 నుంచి 2015 వరకు అమలవుతున్న టైంస్కేల్‌ను తెలుగుదేశం ప్రభుత్వమే రద్దు చేసిందని ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. -
పీఎఫ్ ఎవరు చెల్లిస్తారు?
వారంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నెలకు అందే వేతనం రూ.8 వేల నుంచి రూ.10వేలు మాత్రమే. వారి భవిష్యత్ దృష్ట్యా అధికారులు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించారు. వారిని భర్తీ చేసిన ఏజెన్సీ పీఎఫ్ వాటా జమచేయకుండా రూ.25 లక్షలు దిగమింగింది. ఆ మొత్తం తమకు అందుతుందో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, మచిలీపట్నం: తిరువూరు నియోజకవర్గంలో ఉన్న రెడ్డిగూడెం, గంపలగూడెం గ్రామాల్లోని మోడల్ స్కూళ్లలో 16 ఉద్యోగాలు (కంప్యూటర్ టీచర్, అటెండర్, వాచ్మెన్ తదితర), కస్తూర్బా విద్యాలయాల్లో 18 (అటెండర్, వాచ్మెన్ తదితర) ఖాళీగా ఉన్న పోస్టులు 2014వ సంవత్సరంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో రాహుల్ యూత్ ఏజెన్సీ భర్తీచేసింది. ఉద్యోగంలో చేరే సమయంలో హామీ ఇచ్చిన మేరకు పోస్టును బట్టి ఒక్కొక్కరికీ ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.8 వేలు ఉద్యోగుల స్థాయిని బట్టి చెల్లిస్తున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా వేతనంలో 14 శాతం కోత విధించి పీఎఫ్, ఈఎస్ఐ కింద జమ చేయాల్సి ఉంది. ఉద్యోగులను ఏజెన్సీ ద్వారా నియమించినా, ఆ నిధులు సంబంధిత శాఖ అధికారులు చెల్లించాలి. ఇదే అదునుగా భావించిన ఏజెన్సీ నిర్వాహకులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో అక్రమార్జనకు అర్రులు చాచారు. ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ పేర ప్రతినెలా అందే జీతంలో కొంతమేర కోత విధించి, వారు ఉద్యోగం వదిలి వెళ్లిన సమయంలో ఆ మొత్తానికి రెట్టింపు మొత్తం జమచేసి ఇవ్వడం సాధారణం. ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనా ఈఎస్ఐ ద్వారా వైద్యం పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ఏజెన్సీ నిర్వాహకులు ఆ మొత్తంపై కన్నేశారు. అక్రమం జరిగింది ఇలా.. 34 మంది ఉద్యోగులకు సంబంధించి 2014వ సంవత్సరం నుంచి ఒక్కో ఉద్యోగికి వారి స్థాయిని బట్టి (ఉదాహరణకు 2014లో ఉద్యోగంలో చేరిన వ్యక్తికి రూ.లక్ష, 2015లో చేరిన వ్యక్తికి రూ.70వేలు ఇలా..) రూ.లక్ష నుంచి రూ.70 వేలు, రూ.60 వేలు వేతనంలో కోత విధిస్తూ ఆ మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్ఐకు జమ చేస్తామని నమ్మబలికారు. తీరా ఖాతాల్లో జమ చేయకుండా స్వాహాపర్వానికి తెర తీశారు. ఇలా మూడేళ్లకు సంబంధించి దాదాపు రూ.25 లక్షలు మింగారు. ఈ దోపిడీ వ్యవహారాన్ని పసిగట్టిన ఉద్యోగులు 3 నెలల క్రితం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ నిర్వహించగా, అవినీతి గుట్టురట్టయ్యింది. దీంతో సదరు ఏజెన్సీని ఉద్యోగాల ఎంపిక బాధ్యతను తప్పించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులను సెప్టెంబర్‌లో నారాయణ సేవా సంఘానికి బదిలీ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. పీఎఫ్ ఎవరు చెల్లిస్తారు? ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన రూ.28 లక్షల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము రికవరీ ఎలాగన్న సందిగ్ధం నెలకొంది. తమకు ఆ మొత్తం అందుతుందో లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించే ఏజెన్సీపై సదరు శాఖ పర్యవేక్షణ ఉండాలి. అయితే ఆ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి పర్యవేక్షణ గాలికొదిలేశారు. ఏజెన్సీ పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి పీఎఫ్, ఈఎస్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో ఆమ్యామ్యాలు తీసుకుని మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉన్నంతకాలం ఊడ్చుకోవడం తప్ప మిగిలిన వాటిపై ఏజెన్సీ నిర్వాహకులు దృష్టి సారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు ఏజెన్సీ బదలాయింపు జరిగింది. జిల్లాలో మొత్తం 29 అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో అత్యధిక శాతం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఏజెన్సీలపై ఓ నిఘా వేస్తే అక్రమ బండారం బట్టబయలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. పీఎఫ్ చెల్లించే బాధ్యత మాదే.. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదన్న అంశం మా దృష్టికి వచ్చింది. మా శాఖ పరిధిలో ఎవరికీ అన్యాయం జరగలేదు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు పక్కాగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తేనే తప్ప నిధులు విడుదల చేయబోమని ఏజెన్సీలకు చెప్పాం. ఆ ప్రక్రియ మా ఆధ్వర్యంలో నడిచేలా చూస్తున్నాం. – కె.వి.డి.ఎం.ప్రసాద్‌బాబు, ఆర్వీఎం పీవో -
23,667 మంది విలీనం
► విద్యుత్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విలీనానికి మార్గదర్శకాలు సిద్ధం ► నేడు జరగనున్న ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల బోర్డు సమావేశాల్లో ఆమోదం ► రాష్ట్రావిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉత్తర్వులు ► కటాఫ్ తేదీ 2016 డిసెంబర్ 4.. 23,667 మంది అర్హులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త! రాష్ట్రంలోని విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం (అబ్జార‡్ష్పన్) చేసుకోవడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా 23,667 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఒకేసారి విలీనం చేసుకోవడానికి ఉత్తర్వుల జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియ విధివిధానాలు, మార్గదర్శకాలకు తెలంగాణ ట్రాన్స్‌కో యాజమాన్యాలు సోమవారం తుది మెరుగులు దిద్దాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో), రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) యాజమాన్యాలు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను ఆమోదించనున్నాయి. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 2016 డిసెంబర్ 4ను విలీనానికి కటాఫ్ తేదీగా నిర్ణయించిన విద్యుత్ సంస్థలు.. ఆ తేదీనాటికి విద్యుత్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న 23,667 మందిని విలీనం చేసుకోనున్నాయి. మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. విలీనం తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రాన్స్‌కోలో 4,577 మంది.. జెన్కోలో 4,394 మంది.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బయోడేటాలను విద్యుత్ సంస్థలు స్వీకరించాయి. ట్రాన్స్‌కోలో 4,577 మంది, జెన్కోలో 4,394 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 10,268 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,428 మంది సహా మొత్తం 23,667 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారని సంస్థలు తేల్చాయి. విద్యార్హతల ఆధారంగా ఒకేసారి వీరిని విలీనం చేసుకునే అంశంపై మంగళవారం జరిగే బోర్డు సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సంస్థలు భావిస్తున్నాయని అధికారులు తెలిపారు. న్యాయ చిక్కులను అధిగమించేందుకే.. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపర చిక్కులను అధిగమించేందుకు ‘క్రమబద్ధీకరణ’పదం స్థానంలో వ్యూహాత్మకంగా ‘విలీనం’అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. తాజా మార్గదర్శకాల్లోనూ క్రమబద్ధీకరణ కాకుండా విలీనం ప్రక్రియగా పేర్కొన్నట్లు సమాచారం. 1996 ఏప్రిల్ 10 తర్వాత తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఇక క్రమబద్ధీకరించరాదని రమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయొద్దని గత ఏప్రిల్ 26న హైకోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో తీర్పు ప్రభావం క్రమబద్ధీకరణపై పడకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్రమబద్ధీకరణకు బదులు విలీన ప్రక్రియను చేపట్టాయి. గతంలో కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం తాత్కాలిక ఉద్యోగలను విలీనం చేశారని, ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్హతల వారీగా రాష్ట్ర విద్యుత్సంస్థల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు.. సంస్థ మొత్తం ఉద్యోగులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ పదో తరగతి విద్యార్హత లేనివారు ట్రాన్స్‌కో 4,577 84 169 266 680 986 1,811 581 జెన్కో 4,394 72 57 205 85 1,404 2,312 259 టీఎస్ఎస్పీడీసీఎల్ 10,268 228 134 1,221 100 5,306 2,579 700 టీఎస్ఎన్పీడీసీఎల్ 4,428 164 11 513 76 2,784 248 632 మొత్తం 23,667 548 371 2,205 941 10,480 6,950 2,172 -
ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటికే..
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి రాగానే తన అసలు రూపం బయటపెట్టారు. ఉద్యోగం మాట దేవుడెరుగు.. ఉన్న చిరుద్యోగం కూడా ఊడబెరికేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదర్శ రైతులు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధమవుతుండటం ఎన్నో జీవితాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదర్శ రైతు వ్యవస్థను టీడీపీ నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సమీక్షిస్తూ రద్దు దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై మొదటగా కత్తి పెడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 1,658 మంది ఆదర్శ రైతులు పని చేస్తుండగా.. ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 గౌరవ వేతనం చెల్లిస్తోంది. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి పనుల నిర్వహణలో వీరే కీలకం. ఆదర్శ రైతలు, ఫీల్డ్ అసిస్టెంట్లలో అధిక శాతం కాంగ్రెస్ కార్యకర్తలే పని చేస్తున్నారనేది టీడీపీ నేతల భావన. ఆ మేరకు ఈ పోస్టులను రద్దు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనగా ఆందోళన బాట పట్టేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలాఉండగా అన్ని శాఖల్లో కలిపి జిల్లాలో దాదాపు 30వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈనెల చివరితో ముగియనుంది. ప్రభుత్వం వీరి కాంట్రాక్టు పొడిగిస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు శాఖల్లో వీరిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది.