వారంతా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు. నెలకు అందే వేతనం రూ.8 వేల నుంచి రూ.10వేలు మాత్రమే. వారి భవిష్యత్ దృష్ట్యా అధికారులు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించారు. వారిని భర్తీ చేసిన ఏజెన్సీ పీఎఫ్ వాటా జమచేయకుండా రూ.25 లక్షలు దిగమింగింది. ఆ మొత్తం తమకు అందుతుందో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, మచిలీపట్నం: తిరువూరు నియోజకవర్గంలో ఉన్న రెడ్డిగూడెం, గంపలగూడెం గ్రామాల్లోని మోడల్ స్కూళ్లలో 16 ఉద్యోగాలు (కంప్యూటర్ టీచర్, అటెండర్, వాచ్‌మెన్ తదితర), కస్తూర్బా విద్యాలయాల్లో 18 (అటెండర్, వాచ్‌మెన్ తదితర) ఖాళీగా ఉన్న పోస్టులు 2014వ సంవత్సరంలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో రాహుల్ యూత్ ఏజెన్సీ భర్తీచేసింది. ఉద్యోగంలో చేరే సమయంలో హామీ ఇచ్చిన మేరకు పోస్టును బట్టి ఒక్కొక్కరికీ ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.8 వేలు ఉద్యోగుల స్థాయిని బట్టి చెల్లిస్తున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతినెలా వేతనంలో 14 శాతం కోత విధించి పీఎఫ్, ఈఎస్‌ఐ కింద జమ చేయాల్సి ఉంది. ఉద్యోగులను ఏజెన్సీ ద్వారా నియమించినా, ఆ నిధులు సంబంధిత శాఖ అధికారులు చెల్లించాలి. ఇదే అదునుగా భావించిన ఏజెన్సీ నిర్వాహకులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో అక్రమార్జనకు అర్రులు చాచారు. ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్‌ఐ పేర ప్రతినెలా అందే జీతంలో కొంతమేర కోత విధించి, వారు ఉద్యోగం వదిలి వెళ్లిన సమయంలో ఆ మొత్తానికి రెట్టింపు మొత్తం జమచేసి ఇవ్వడం సాధారణం. ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనా ఈఎస్‌ఐ ద్వారా వైద్యం పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ఏజెన్సీ నిర్వాహకులు ఆ మొత్తంపై కన్నేశారు.
అక్రమం జరిగింది ఇలా..
34 మంది ఉద్యోగులకు సంబంధించి 2014వ సంవత్సరం నుంచి ఒక్కో ఉద్యోగికి వారి స్థాయిని బట్టి (ఉదాహరణకు 2014లో ఉద్యోగంలో చేరిన వ్యక్తికి రూ.లక్ష, 2015లో చేరిన వ్యక్తికి రూ.70వేలు ఇలా..) రూ.లక్ష నుంచి రూ.70 వేలు, రూ.60 వేలు వేతనంలో కోత విధిస్తూ ఆ మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్‌ఐకు జమ చేస్తామని నమ్మబలికారు. తీరా ఖాతాల్లో జమ చేయకుండా స్వాహాపర్వానికి తెర తీశారు. ఇలా మూడేళ్లకు సంబంధించి దాదాపు రూ.25 లక్షలు మింగారు. ఈ దోపిడీ వ్యవహారాన్ని పసిగట్టిన ఉద్యోగులు 3 నెలల క్రితం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ నిర్వహించగా, అవినీతి గుట్టురట్టయ్యింది. దీంతో సదరు ఏజెన్సీని ఉద్యోగాల ఎంపిక బాధ్యతను తప్పించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులను సెప్టెంబర్‌లో నారాయణ సేవా సంఘానికి బదిలీ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
పీఎఫ్ ఎవరు చెల్లిస్తారు?
ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన రూ.28 లక్షల పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము రికవరీ ఎలాగన్న సందిగ్ధం నెలకొంది. తమకు ఆ మొత్తం అందుతుందో లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించే ఏజెన్సీపై సదరు శాఖ పర్యవేక్షణ ఉండాలి. అయితే ఆ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి పర్యవేక్షణ గాలికొదిలేశారు. ఏజెన్సీ పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి పీఎఫ్, ఈఎస్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో ఆమ్యామ్యాలు తీసుకుని మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉన్నంతకాలం ఊడ్చుకోవడం తప్ప మిగిలిన వాటిపై ఏజెన్సీ నిర్వాహకులు దృష్టి సారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగులకు ఏజెన్సీ బదలాయింపు జరిగింది. జిల్లాలో మొత్తం 29 అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో అత్యధిక శాతం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఏజెన్సీలపై ఓ నిఘా వేస్తే అక్రమ బండారం బట్టబయలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
పీఎఫ్ చెల్లించే బాధ్యత మాదే..
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించలేదన్న అంశం మా దృష్టికి వచ్చింది. మా శాఖ పరిధిలో ఎవరికీ అన్యాయం జరగలేదు. అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు పక్కాగా పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లిస్తేనే తప్ప నిధులు విడుదల చేయబోమని ఏజెన్సీలకు చెప్పాం. ఆ ప్రక్రియ మా ఆధ్వర్యంలో నడిచేలా చూస్తున్నాం. – కె.వి.డి.ఎం.ప్రసాద్‌బాబు, ఆర్వీఎం పీవో
Comments
Please login to add a commentAdd a comment