విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త.
► విద్యుత్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విలీనానికి మార్గదర్శకాలు సిద్ధం
► నేడు జరగనున్న ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల బోర్డు సమావేశాల్లో ఆమోదం
► రాష్ట్రావిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉత్తర్వులు
► కటాఫ్ తేదీ 2016 డిసెంబర్ 4.. 23,667 మంది అర్హులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త! రాష్ట్రంలోని విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం (అబ్జార‡్ష్పన్) చేసుకోవడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా 23,667 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఒకేసారి విలీనం చేసుకోవడానికి ఉత్తర్వుల జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియ విధివిధానాలు, మార్గదర్శకాలకు తెలంగాణ ట్రాన్స్‌కో యాజమాన్యాలు సోమవారం తుది మెరుగులు దిద్దాయి.
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో), రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) యాజమాన్యాలు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను ఆమోదించనున్నాయి. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 2016 డిసెంబర్ 4ను విలీనానికి కటాఫ్ తేదీగా నిర్ణయించిన విద్యుత్ సంస్థలు.. ఆ తేదీనాటికి విద్యుత్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న 23,667 మందిని విలీనం చేసుకోనున్నాయి. మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. విలీనం తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ట్రాన్స్‌కోలో 4,577 మంది.. జెన్‌కోలో 4,394 మంది..
సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బయోడేటాలను విద్యుత్ సంస్థలు స్వీకరించాయి. ట్రాన్స్‌కోలో 4,577 మంది, జెన్‌కోలో 4,394 మంది, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 10,268 మంది, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 4,428 మంది సహా మొత్తం 23,667 మంది ఔట్‌సోర్సింగ్ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారని సంస్థలు తేల్చాయి. విద్యార్హతల ఆధారంగా ఒకేసారి వీరిని విలీనం చేసుకునే అంశంపై మంగళవారం జరిగే బోర్డు సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సంస్థలు భావిస్తున్నాయని అధికారులు తెలిపారు.
న్యాయ చిక్కులను అధిగమించేందుకే..
విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపర చిక్కులను అధిగమించేందుకు ‘క్రమబద్ధీకరణ’పదం స్థానంలో వ్యూహాత్మకంగా ‘విలీనం’అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. తాజా మార్గదర్శకాల్లోనూ క్రమబద్ధీకరణ కాకుండా విలీనం ప్రక్రియగా పేర్కొన్నట్లు సమాచారం. 1996 ఏప్రిల్ 10 తర్వాత తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఇక క్రమబద్ధీకరించరాదని రమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయొద్దని గత ఏప్రిల్ 26న హైకోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో తీర్పు ప్రభావం క్రమబద్ధీకరణపై పడకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్రమబద్ధీకరణకు బదులు విలీన ప్రక్రియను చేపట్టాయి. గతంలో కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం తాత్కాలిక ఉద్యోగలను విలీనం చేశారని, ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విద్యార్హతల వారీగా రాష్ట్ర విద్యుత్‌సంస్థల్లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు..
సంస్థ మొత్తం ఉద్యోగులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ పదో తరగతి విద్యార్హత లేనివారు
ట్రాన్స్‌కో 4,577 84 169 266 680 986 1,811 581
జెన్‌కో 4,394 72 57 205 85 1,404 2,312 259
టీఎస్‌ఎస్పీడీసీఎల్ 10,268 228 134 1,221 100 5,306 2,579 700
టీఎస్‌ఎన్పీడీసీఎల్ 4,428 164 11 513 76 2,784 248 632
మొత్తం 23,667 548 371 2,205 941 10,480 6,950 2,172