సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్ సరఫరా కార్యక్రమం విజయవంతమైంది. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నిరాటంకంగా విద్యుత్ అందించారు. వారం రోజులపాటు సరఫరా చేసి పరిస్థితిని అంచనా వేయాలని విద్యుత్ శాఖ అధికారులు తొలుత భావించారు. కానీ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి 400 కెవి సబ్ స్టేషన్ల వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ట్రయల్ రన్‌ను 2వారాలకు పొడిగించారు. సోమవారం (నేటి) అర్ధరాత్రి వరకు సరఫరా కొనసాగించనున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా మళ్లీ 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సరఫరా విజయవంతమైందని, 2018 జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ ప్రయోగం, ఫలితాలపై ఆదివారం జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం సమీక్షించారు.
పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో గత జూలై నుంచే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని, 2 వారాలుగా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు విస్తరించామని ప్రభాకర్ రావు వివరించారు. దీంతో రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఏర్పడుతుంది, సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా పడే అదనపు లోడ్ ఎంత తదితర విషయాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. ‘ఎక్కువ మంది రైతులు ఉదయం పూటనే పంపుసెట్లు వాడుతున్నారు. దీంతో ఆ సమయంలోనే లోడ్ ఎక్కువగా పడుతోంది. 24 గంటల్లో ఏ గంటకు ఎంత లోడ్ పడుతుందనే విషయంలో అవగాహన వచ్చింది. పంపుసెట్లు ఎక్కువున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. కొందరు రోజంతా పంపుసెట్లు నడుపుతున్నారని, దీంతో భూగర్భ జలాలు తగ్గి ఇబ్బంది కలుగుతుందని రైతులు అధికారుల దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఆటో స్టార్టర్లు తొలగిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని, రైతులు స్వచ్ఛందంగా సహకరిస్తేనే ఆటో స్టార్టర్ల సమస్య తొలగిపోతుందని తెలిపారు.
ఆటోస్టార్టర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్
ఆటో స్టార్టర్ల తొలగింపునకు డిసెంబర్ 5 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఆటోస్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అంతరించడం, ఇతర అనర్థాలను వివరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment