janco
-
తెలంగాణలో ‘కరెంట్’కు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొండలా పేరుకు పోయిన రుణాలకు ప్రతినెలా వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తమ వల్ల కావట్లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మొత్తుకుంటున్నాయి. ప్రతినెలా రూ.1,200 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, లేకుంటే డిస్కంల నిర్వహణ సాధ్యం కాదని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్సిడీలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింతగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించి డిస్కంలను గట్టెక్కించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒత్తిళ్లు తట్టుకోలేక..: గత నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన ఓ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు డిస్కంల పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ప్రతినెలా డిస్కంల అప్పులపై వడ్డీల చెల్లింపు కోసం రూ.800 కోట్లు, జీతాల కోసం రూ.400 కోట్లు కలిపి రూ.1,200 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయంగా విడుదల చేయాలని కోరారని.. విద్యుత్ చార్జీలు పెంచడానికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే విద్యుత్ చార్జీల పెంపుపై మాత్రమే సీఎం సానుకూలంగా స్పందించారని.. అదనపు నిధులివ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చేసేదేమీ లేక ప్రభాకర్‌రావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని పేర్కొంటున్నాయి. బిల్లులు, బకాయిలు చెల్లించాలంటూ విద్యుదుత్పత్తి కంపెనీలు, రుణ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని.. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రభాకర్‌రావు కొద్దినెలలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, కానీ సీఎం అంగీకరించడం లేదని పేర్కొంటున్నాయి. రూ.20 వేల కోట్ల అప్పుల్లో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఏటేటా పెరిగిపోయి.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లను దాటినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్ పంపిణీ వ్యవస్థల (నెట్వర్క్) సామర్థ్యం పెంపునకు డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు చేశాయి. ప్రస్తుతం ప్రతినెలా వడ్డీల కిందనే రూ.800 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తలెత్తుతోంది. దీనితో కొంతకాలంగా ప్రతి నెలా బ్యాంకుల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చార్జీల పెంపుపై కసరత్తు రాష్ట్రంలో గత ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. విద్యుత్ చట్టం ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను, ఆదాయ, వ్యయాల అంచనా (ఏఆర్ఆర్) నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ వాటిని పరిశీలించి చార్జీల సవరణను ఆమోదిస్తుంది. అయితే డిస్కంలు గత మూడేళ్లుగా టారిఫ్ సవరణ, ఏఆర్ఆర్ నివేదికలను సమర్పించడమే లేదు. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలను గట్టెక్కించడం కోసం చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో.. ఆ ప్రక్రియ ముగిశాక ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆరేళ్లుగా చార్జీలు పెంచని నేపథ్యంలో ఈసారి గణనీయంగానే పెంపు ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కేటగిరీల వారీగా 10 శాతం నుంచి 20శాతం వరకు చార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయని వివరించాయి. అంతేగాకుండా గత ఆరేళ్లుగా వచ్చిన నష్టాలకు సంబంధించి ‘ట్రూఅప్’ చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయని.. దానికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి పెనుభారం పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించాయి. ప్రభుత్వం, ఈఆర్సీ అనుమతిస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఇప్పటికే సబ్సిడీల భారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర రాయితీ పథకాలు, ఎత్తిపోతల స్కీమ్‌లకోసం ప్రతినెలా డిస్కంలకు రూ.833.33 కోట్లు విడుదల చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లోరూ.10 వేల కోట్లు కేటాయిస్తోంది. డిస్కంలు కోరినట్టు ప్రతినెలా మరో రూ.1,200 కోట్ల చొప్పున ఇస్తే ఏడాదికి రూ.14,400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పులు, నష్టాలు పెరుగుతూ.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డిమాండ్‌కు తగినట్టుగా ఎక్కువ ధరతో విద్యుత్ కొని తక్కువ రేటుతో సరఫరా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాల పెంపుతోనూ డిస్కంలపై ఆర్థిక భారం పడింది. వివిధ కేటగిరీల కింద సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్ కంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ సొమ్ము తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఏటేటా నష్టాలు, అప్పులు పెరుగుతూ పోయాయి. -
మళ్లీ 9 గంటల విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్ సరఫరా కార్యక్రమం విజయవంతమైంది. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నిరాటంకంగా విద్యుత్ అందించారు. వారం రోజులపాటు సరఫరా చేసి పరిస్థితిని అంచనా వేయాలని విద్యుత్ శాఖ అధికారులు తొలుత భావించారు. కానీ ట్రాన్స్ఫార్మర్ల నుంచి 400 కెవి సబ్ స్టేషన్ల వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ట్రయల్ రన్‌ను 2వారాలకు పొడిగించారు. సోమవారం (నేటి) అర్ధరాత్రి వరకు సరఫరా కొనసాగించనున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా మళ్లీ 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సరఫరా విజయవంతమైందని, 2018 జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ ప్రయోగం, ఫలితాలపై ఆదివారం జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం సమీక్షించారు. పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో గత జూలై నుంచే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని, 2 వారాలుగా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు విస్తరించామని ప్రభాకర్ రావు వివరించారు. దీంతో రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఏర్పడుతుంది, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వారీగా పడే అదనపు లోడ్ ఎంత తదితర విషయాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. ‘ఎక్కువ మంది రైతులు ఉదయం పూటనే పంపుసెట్లు వాడుతున్నారు. దీంతో ఆ సమయంలోనే లోడ్ ఎక్కువగా పడుతోంది. 24 గంటల్లో ఏ గంటకు ఎంత లోడ్ పడుతుందనే విషయంలో అవగాహన వచ్చింది. పంపుసెట్లు ఎక్కువున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. కొందరు రోజంతా పంపుసెట్లు నడుపుతున్నారని, దీంతో భూగర్భ జలాలు తగ్గి ఇబ్బంది కలుగుతుందని రైతులు అధికారుల దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఆటో స్టార్టర్లు తొలగిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని, రైతులు స్వచ్ఛందంగా సహకరిస్తేనే ఆటో స్టార్టర్ల సమస్య తొలగిపోతుందని తెలిపారు. ఆటోస్టార్టర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ ఆటో స్టార్టర్ల తొలగింపునకు డిసెంబర్ 5 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఆటోస్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అంతరించడం, ఇతర అనర్థాలను వివరించాలని కోరారు. -
23,667 మంది విలీనం
► విద్యుత్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విలీనానికి మార్గదర్శకాలు సిద్ధం ► నేడు జరగనున్న ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల బోర్డు సమావేశాల్లో ఆమోదం ► రాష్ట్రావిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉత్తర్వులు ► కటాఫ్ తేదీ 2016 డిసెంబర్ 4.. 23,667 మంది అర్హులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త! రాష్ట్రంలోని విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం (అబ్జార‡్ష్పన్) చేసుకోవడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా 23,667 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఒకేసారి విలీనం చేసుకోవడానికి ఉత్తర్వుల జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియ విధివిధానాలు, మార్గదర్శకాలకు తెలంగాణ ట్రాన్స్‌కో యాజమాన్యాలు సోమవారం తుది మెరుగులు దిద్దాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో), రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) యాజమాన్యాలు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను ఆమోదించనున్నాయి. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 2016 డిసెంబర్ 4ను విలీనానికి కటాఫ్ తేదీగా నిర్ణయించిన విద్యుత్ సంస్థలు.. ఆ తేదీనాటికి విద్యుత్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న 23,667 మందిని విలీనం చేసుకోనున్నాయి. మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. విలీనం తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రాన్స్‌కోలో 4,577 మంది.. జెన్కోలో 4,394 మంది.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బయోడేటాలను విద్యుత్ సంస్థలు స్వీకరించాయి. ట్రాన్స్‌కోలో 4,577 మంది, జెన్కోలో 4,394 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 10,268 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,428 మంది సహా మొత్తం 23,667 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారని సంస్థలు తేల్చాయి. విద్యార్హతల ఆధారంగా ఒకేసారి వీరిని విలీనం చేసుకునే అంశంపై మంగళవారం జరిగే బోర్డు సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సంస్థలు భావిస్తున్నాయని అధికారులు తెలిపారు. న్యాయ చిక్కులను అధిగమించేందుకే.. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపర చిక్కులను అధిగమించేందుకు ‘క్రమబద్ధీకరణ’పదం స్థానంలో వ్యూహాత్మకంగా ‘విలీనం’అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. తాజా మార్గదర్శకాల్లోనూ క్రమబద్ధీకరణ కాకుండా విలీనం ప్రక్రియగా పేర్కొన్నట్లు సమాచారం. 1996 ఏప్రిల్ 10 తర్వాత తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఇక క్రమబద్ధీకరించరాదని రమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయొద్దని గత ఏప్రిల్ 26న హైకోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో తీర్పు ప్రభావం క్రమబద్ధీకరణపై పడకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్రమబద్ధీకరణకు బదులు విలీన ప్రక్రియను చేపట్టాయి. గతంలో కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం తాత్కాలిక ఉద్యోగలను విలీనం చేశారని, ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్హతల వారీగా రాష్ట్ర విద్యుత్సంస్థల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు.. సంస్థ మొత్తం ఉద్యోగులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ పదో తరగతి విద్యార్హత లేనివారు ట్రాన్స్‌కో 4,577 84 169 266 680 986 1,811 581 జెన్కో 4,394 72 57 205 85 1,404 2,312 259 టీఎస్ఎస్పీడీసీఎల్ 10,268 228 134 1,221 100 5,306 2,579 700 టీఎస్ఎన్పీడీసీఎల్ 4,428 164 11 513 76 2,784 248 632 మొత్తం 23,667 548 371 2,205 941 10,480 6,950 2,172