తెలంగాణలో ‘కరెంట్‌’కు కష్టాలు! | TS Power Discoms Facing Problems Of Employees Salaries And Loans | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘కరెంట్‌’కు కష్టాలు!

Published Mon, Oct 25 2021 2:00 AM | Last Updated on Mon, Oct 25 2021 10:43 AM

TS Power Discoms Facing Problems Of Employees Salaries And Loans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో విద్యుత్‌ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొండలా పేరుకు పోయిన రుణాలకు ప్రతినెలా వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తమ వల్ల కావట్లేదని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు మొత్తుకుంటున్నాయి. ప్రతినెలా రూ.1,200 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, లేకుంటే డిస్కంల నిర్వహణ సాధ్యం కాదని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్‌ సబ్సిడీలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింతగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ చార్జీల పెంపునకు అనుమతించి డిస్కంలను గట్టెక్కించాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

ఒత్తిళ్లు తట్టుకోలేక..:
గత నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన ఓ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు డిస్కంల పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ప్రతినెలా డిస్కంల అప్పులపై వడ్డీల చెల్లింపు కోసం రూ.800 కోట్లు, జీతాల కోసం రూ.400 కోట్లు కలిపి రూ.1,200 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయంగా విడుదల చేయాలని కోరారని.. విద్యుత్‌ చార్జీలు పెంచడానికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే విద్యుత్‌ చార్జీల పెంపుపై మాత్రమే సీఎం సానుకూలంగా స్పందించారని.. అదనపు నిధులివ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో చేసేదేమీ లేక ప్రభాకర్‌రావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని పేర్కొంటున్నాయి. బిల్లులు, బకాయిలు చెల్లించాలంటూ విద్యుదుత్పత్తి కంపెనీలు, రుణ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని.. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రభాకర్‌రావు కొద్దినెలలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, కానీ సీఎం అంగీకరించడం లేదని పేర్కొంటున్నాయి. 
 
రూ.20 వేల కోట్ల అప్పుల్లో.. 
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల నష్టాలు ఏటేటా పెరిగిపోయి.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లను దాటినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థల (నెట్‌వర్క్‌) సామర్థ్యం పెంపునకు డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు చేశాయి. ప్రస్తుతం ప్రతినెలా వడ్డీల కిందనే రూ.800 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తలెత్తుతోంది. దీనితో కొంతకాలంగా ప్రతి నెలా బ్యాంకుల నుంచి అడ్వాన్స్‌ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. 
 
చార్జీల పెంపుపై కసరత్తు 
రాష్ట్రంలో గత ఆరేళ్లుగా విద్యుత్‌ చార్జీలను పెంచలేదు. విద్యుత్‌ చట్టం ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్‌ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ చార్జీల పెంపు (టారిఫ్‌ సవరణ) ప్రతిపాదనలను, ఆదాయ, వ్యయాల అంచనా (ఏఆర్‌ఆర్‌) నివేదికను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ వాటిని పరిశీలించి చార్జీల సవరణను ఆమోదిస్తుంది.

అయితే డిస్కంలు గత మూడేళ్లుగా టారిఫ్‌ సవరణ, ఏఆర్‌ఆర్‌ నివేదికలను సమర్పించడమే లేదు. విద్యుత్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలను గట్టెక్కించడం కోసం చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో.. ఆ ప్రక్రియ ముగిశాక ఈఆర్సీకి టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. 

ఆరేళ్లుగా చార్జీలు పెంచని నేపథ్యంలో ఈసారి గణనీయంగానే పెంపు ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కేటగిరీల వారీగా 10 శాతం నుంచి 20శాతం వరకు చార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయని వివరించాయి. అంతేగాకుండా గత ఆరేళ్లుగా వచ్చిన నష్టాలకు సంబంధించి ‘ట్రూఅప్‌’ చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయని.. దానికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి పెనుభారం పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించాయి. ప్రభుత్వం, ఈఆర్సీ అనుమతిస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయని తెలిపాయి.  

ఇప్పటికే సబ్సిడీల భారం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర రాయితీ పథకాలు, ఎత్తిపోతల స్కీమ్‌లకోసం ప్రతినెలా డిస్కంలకు రూ.833.33 కోట్లు విడుదల చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లోరూ.10 వేల కోట్లు కేటాయిస్తోంది. డిస్కంలు కోరినట్టు ప్రతినెలా మరో రూ.1,200 కోట్ల చొప్పున ఇస్తే ఏడాదికి రూ.14,400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

అప్పులు, నష్టాలు పెరుగుతూ..
కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు బాగా పెరిగాయి. డిమాండ్‌కు తగినట్టుగా ఎక్కువ ధరతో విద్యుత్‌ కొని తక్కువ రేటుతో సరఫరా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఆరేళ్లుగా విద్యుత్‌ చార్జీలు పెంచకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాల పెంపుతోనూ డిస్కంలపై ఆర్థిక భారం పడింది. వివిధ కేటగిరీల కింద సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్‌ కంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ సొమ్ము తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఏటేటా నష్టాలు, అప్పులు పెరుగుతూ పోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement